RK ROJA | చెప్పులు మోయించిన రోజాపై మాదిగల ఫిర్యాదు
పాత సంఘటనను మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నూలులో ఆర్కే రోజాపై దళితులు ఫిర్యాదు చేశారు.
వైసీపీ సోషల్ మీడియానే కాదు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను కూడా కేసులు వెంటాడుతున్నాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని అందుతున్న ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కాలచక్రంలో కలిసిన ఓ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి ఆర్కే. రోజాపై దళిత సంఘ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా నగిరి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సినీ కథానాయకి, ఆర్కే రోజా మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ సీఎం వైయస్ జగన్ క్యాబినెట్లో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.
ఈ శాఖలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేక శ్వేత పత్రాలను విడుదల చేసింది. ఖేల్ ఆంధ్ర కార్యక్రమంలో కూడా నిధులు దుర్వినియోగమైనట్లు టిడిపి కూటమి ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే,
వైసిపి అధికార ప్రతినిధి,మాజీ మంత్రిఆర్కే రోజాపై కర్నూలు నగరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మాదిగ దండోరా నాయకుడు అనంతరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై కర్నూలు మూడో పట్టణ సీఐ పీ. శేషయ్యను 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి ఫోన్ లో సంప్రదించారు. ఆయన ఏమంటున్నారంటే...
"మాకు దళిత సంఘం నుంచి ఫిర్యాదు అందింది" అని సీఐ శేషయ్య తెలిపారు. " కేసు నమోదుకు సంబంధించి, ఉన్నతాధికారులతో మాట్లాడాలి. అంతేకుకుండా, న్యాయ సలహా కూడా తీసుకోవాలి" అని చెప్పారు. ఇది తాజాగా జరిగిన సంఘటన కాదు. అందువల్ల న్యాయ సలహా తీసుకున్న తరువాత ఏమి చేయాల్సింది నిర్ణయిస్తాం" అని సీఐ శేషయ్య వివరించారు.
కేసు ఏమిటంటే..
"దళిత ఉద్యోగితో చెప్పులు మోయించారు. ఇది దళితులను అవమానించడమే"అని మాదిగ దండోరా నాయకులు మాజీ మంత్రి ఆర్కే రోజాపై కేసు పెట్టారు. ఈ సంఘటన పూర్వపరాల్లోకి వెళితే..
2023 ఫిబ్రవరి 9వ తేదీ ఆర్కే రోజా ఏపీ పర్యాటక శాఖ మంత్రి హోదాలో బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ ను సందర్శించారు. ఒడ్డుని చెప్పులు వదిలిన ఆమె సరదాగా కాసేపు సముద్రపు అంచుల వద్ద నీళ్లలోకి వెళ్లి సరదాగా గడిపారు.
ఆర్కే రోజా తిరిగి ఒడ్డుకు రాగానే ఇసుకలో నడిచి వస్తున్నారు. ఆ సమయంలో ఆర్కే రోజా విడిచిన చెప్పులను పర్యాటకశాఖ ఉద్యోగి ఒకరు చేతితో పట్టుకుని రావడం తీవ్ర విమర్శలకు దారి చేసింది. దీనిపై దుమారం కూడా చెలవేగింది.
"మంత్రి రోజా చెప్పులు జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె అక్కడ ఉద్యోగికి సూచించినట్లు"అప్పట్లో వార్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి.. దీంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, ఆక్షేపణలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై చెప్పులు పట్టుకున్న ఉద్యోగి మనోహర్ ఏమన్నారంటే..
"చెప్పులు పట్టుకోవాలని నాకు ఎవరు చెప్పలేదు" అని ఆ తర్వాత మనోహర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే. 19 నెలల తర్వాత ఆ సంఘటనపై కర్నూలులో మాదిగ దండోరా నాయకులు ఆర్కే రోజా పై ఫిర్యాదు చేశారు.
ఆరోజు మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్పులు చేతిలో పట్టుకుని వచ్చిన వ్యక్తి దళిత ఉద్యోగి. ఇది ఆయనే కాదు దళిత సమాజాన్ని అవమానించడమే అని ఆరోపిస్తూ, మాదిగ దండోరా నాయకులు కర్నూలు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
"కొన్ని వందల మంది చూస్తుండగా మాజీ మంత్రి ఆర్కే రోజా ఆ రోజు దళిత ఉద్యోగితో చెప్పులు మోయించారు. ఉద్యోగం పోతుంది అనే భయంతోనే మనోహర్ ఆ రోజు ఆ పని చేశారు" అని మాదిగ దండోరా నాయకులు అంటున్నారు. "ఈ పని చేసిన మనోహర్ మనసు ఎంత బాధ పడి ఉంటుందో కదా ఆలోచన చేయాలి. ఆయన కుటుంబీకులు కూడా ఎంతో బాధపడి ఉంటారని" కూడా ఇప్పుడు మాదిగ దండోరా నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని మాదిగ దండోరా నాయకులు డిమాండ్ చేశారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
Next Story