వైఎస్సార్‌సీపీ వీడిన మాగుంట

ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


వైఎస్సార్‌సీపీ వీడిన మాగుంట
x
Magunta Raghavareddy s/o Srinivasulu Reddy

పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారు పార్టీలు మారుతున్నారు. ఒంగోలు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్‌సీపీకి బుధవారం రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసేందుకు మాగుంటకు వైఎస్సార్‌సీపీ అధిష్టానం టిక్కెట్‌ నిరాకరించింది. మాగుంటకు టిక్కెట్‌ కోసం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్‌ వద్ద పూర్తిస్థాయిలో పట్టుబట్టారు. అయినా సీఎం వినలేదు. మాగుంటకు సీటు ఇవ్వకుంటే ఒంగోలు ఎమ్మెల్యే సీటు వదులుకుంటానని కూడా సీఎం వద్ద బాలినేని అల్టిమేటమ్‌ ఇచ్చారు. అయినా సీఎం పట్టించుకోలేదు. వద్దనుకుంటే బాలినేనిని కూడా బయటకు పంపించేందుకు సిద్ధమయ్యారు. దీంతో మాగుంట విషయాన్ని బాలినేని సైతం వదిలేయాల్సి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాగుంట కుటుంబానికి వైఎస్సార్‌సీపీ సీటు దక్కకపోవడంతో ఎంపీ మాగుంట వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థిగా సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి పంపడంతో మాగుంట వైఎస్సార్‌సీపీని వదిలేందుకు నిర్ణయించుకున్నారు. ఈ దఫా తనకు కాకుండా తన కుమారుడు రాఘవర రెడ్డికి ఒంగోలు పార్లమెంట్‌ టికెట్‌ ఇవ్వాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరినా అవకావం ఇవ్వలేదు.
ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా రాఘవరెడ్డి పోటీ
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేయనున్నట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని బుధవారం మీడియాకు చెప్పారు. వారం రోజుల్లో టీడీపీలో చేరేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. రాఘవరెడ్డి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలన్నీ కలియ తిరిగారు. మాగుంట కుటుంబానికి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకొని అన్ని మండలాల్లోనూ తన కోసం యువతను తయారు చేశారు. రానున్న ఎన్నికల్లో వారు మాగుంట రాఘవరెడ్డి కోసం పనిచేసే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
మాగుంట ప్రయాణం
మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సీనియర్‌ రాజకీయ నేతల్లో ఒకరు. వీరి కుటుంబం గత 33 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంది. మాగుంట సుబ్బరామిరెడ్డి మరణానంతరం ఆయన భార్య మాగుంట పార్వతమ్మ రాజకీయాల్లో ప్రవేశించారు. వారి వారసుడుగా శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంపిగాను, ఎమ్మెల్యేగాను పని చేశారు. 1998, 2004, 2009లో ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఆ ఎన్నికల్లో ఒంగోలు ఎంపి అభ్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 2015 ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీగా టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒంగోలు ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
రాజీనామా ఎందుకు చేశారు
రాజకీయంగా ప్రత్యర్థులను దూషించడంలో వెనుకంజ వేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాగుంటకు టిక్కెట్‌ లేకుండా చేశారు. దీంతో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. ఇప్పటికే పార్టీని వీడుతున్న వారు ఎక్కువగా చెప్పింది ఒక్కటే.. తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలను తిట్టడం చేతకాని వారు పార్టీలో ఉండొద్దనే సంకేతాలు వచ్చాయని, అందుకే పార్టీని వదులుతున్నామని చెబుతున్నారు.
Next Story