మంగళగిరి ఎయిమ్స్ రాష్ట్ర విభజన సమయంలో తెరపైకి వచ్చింది. విభజన చట్టంలో ఇదొక హామీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని నాటి కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మంగళగిరిలో నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరచారు. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. సుమారు 183 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు కేటాయించారు. 2015 డిసెంబరు 19న దీనికి శంకుస్థాపన చేశారు. రూ. 1,618 కోట్లతో దీని పనులు మొదలు పెట్టారు. 2019 మార్చి 12 నుంచి ఔట్ పేషెంట్ (ఓపి) సేవలు అందుబాటులోకి వచ్చాయి. 950 పడకలతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. 2024 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ దీనిని వర్చువల్‌గా ప్రారంభిస్తూ జాతికి అంకితం చేశారు.
ఓపి కేవలం 10 రూపాయలే
ప్రైవేటు ఆసుప్రతుల్లో భారీగా ఓపి ఉంటుంది. వందల్లో వసూలు చేస్తారు. దీంతో పాటు ఇతర పరీక్షల బిల్లులతో జేబులు చిల్లు చేస్తారు. అంతటి ఆగకుండా శస్త్ర చికిత్సలకయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. కానీ ఎయిమ్స్‌లో అందుకు భిన్నం. రోగులకు కేవలం రూ. 10లకే ఓపి వైద్య సేవలు అందిస్తున్నారు. 58 రోగులతో మొదలైన ఓపి సేవలు వేల సంఖ్యకు చేరింది. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నారు. రోజుకు సగటున 2,500 మంది రోగులు ఓపి సేవలు పొందుతున్నారు. ఐదేళ్లల్లో సుమారు 15లక్షల మంది ఓపి వైద్య సేవలు పొందారు. 40 రకాల వైద్య విభాల్లో దాదాపు 40 రకాల వైద్య విభాగాల వైద్య సేవలు పది రూపాలకే అందిస్తున్నారు. దీంతో పాటుగా కార్పొరేట్ ఆసుపత్రుల కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరలకు ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు వంటి అనేక వైద్య పరీక్షలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేశారు. సిటీ స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ స్కాన్, పిఇటి స్కానింగ్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, కాన్పులు, రేడియో థెరపీ, ట్రామాతో పాటు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు.
ఇన్ పేషెంట్లు సేవలు
ఇన్ పేషెంట్ల సేవలు మొదలైన తర్వాత రోగుల సంఖ్య ఇంకా పెరిగింది. 2020 జూన్ 11న ఇన్ పేషెంట్ల సేవలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 21వేల మందికి పైగా వైద్య చికిత్సలు చేయించుకున్నారు. మరో 5వేల మందికి పైగా శస్త్ర చికిత్సలు అందించారు. కోవిడ్ సమయంలో కూడా వైద్య సేవలు అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలైన ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, సిజిహెచ్‌ఎస్ ద్వారా కూడా వైద్య సేవలు అందించే సదుపాయం కూడా కల్పించారు. ఎలాంటి ఖర్చు లేకుండా వీటి ద్వారా కూడా వైద్య సేవలు పొందొచ్చు.
వైద్యులకు అక్కడ నివాసం
మంగళగిరి ఎయిమ్స్ పని చేసే వైద్యులకు నివాస గృహాలు కూడా నిర్మించారు. ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంగణంలోనే ఉండేందుకు కావలసిన అన్నీ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇదే క్యాంపస్‌లో వైద్యులు ఉండటం వల్ల ప్రజలకు వైద్య సేవలు సకాలంలో అందించేందుకు వీలుగా ఉంటుంది.
చవకైన నాణ్యమైన వైద్యం అందించడం మంగళగిరి ఎయిమ్స్ ప్రత్యేకత. అవసరం అనుకుంటేనే టెస్టులు రాస్తారు. ప్రవేటు ఆసుప్రతుల మాదిరిగా ఇక్కడ మెడికల్ టెస్టుల పేరుతో దోపిడీ ఉండదు. ఇతర ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలాది రూపాయాలు డబ్బులు ఖర్చు పెట్టినా జబ్బులు నయం కానీ రోగులు సంఖ్య కూడా వేలల్లోనే ఉంటోంది. సుమారు 40 వైద్య విభాలు ఉన్న ఈ ఆసుపత్రిలో క్యాన్సర్, మూత్రపిండాలు, ఉదర కోశ వ్యాధులకు ప్రసిద్ధి. సర్జికల్ అంకాలజీతో పాటుగా దాదాపు పది రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు, మరో 20 రకాల స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు.
దూరపు ప్రాంతాల నుంచి రోగులు
మంగళిగిరి ఎయిమ్స్‌కు సమీపంలోని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది రోగులు వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా రోగులు వచ్చి చికిత్సలు చేయించుకుంటుంటారు. ఇక్కడ వైద్య పరమైన పరిశోధనలు, శిక్షణలు కూడా నిర్వహిస్తుంటారు. పైపైన కాకుండా వ్యాధుల మూలాలను గుర్తించి, వాటిని కూకటి వేళ్లతో పెకిలించే విధంగా రోగాలకు చికిత్సలు అందించడం ఇక్కడి ప్రత్యేకత. దీంతో అనతి కాలంలోనే ప్రజల్లో ఈ ఆసుపత్రికి మంచి పేరు వచ్చింది.
వైద్య కళాశాల
దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. 125 ఎంబిబిఎస్ సీట్లతో పాటు 50 పిజి సీట్లు కూడా ఉన్నాయి. దీనికి అనుబంధంగా నర్శింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. దీనిలో 50 సీట్లు వరకు ఉన్నాయి. త్వరలో వీటిని 100కు పెంచడంతో పాటు పారామెడికల్ కోర్సులు కూడా ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
మెడికల్ టెస్టులు వాటి ధరలు
కన్సల్టేషన్ ఫీజు రూ. 10, కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్టుకు రూ. 135, ఫాస్టింగ్ అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షకు రూ. 24+24, లివర్ ఫంక్షన్ పరీక్షకు రూ. 225, కిడ్నీ ఫంక్షన్ టెస్టుకు రూ. 225, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షకు రూ. 200, థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షకు రూ. 200, ఇసిజికి రూ. 50, చెస్ట్ ఎక్స్‌రేకు రూ. 60, మామ్మోగ్రఫికి రూ. 630, అల్ట్రాసోనోగ్రఫికి రూ. 323, యూరిన్ అనాలిసిస్ పరీక్షకు రూ. 35, హెఐవి ర్యాపిడ్ టెస్టుకు రూ. 150, హెబీస్ ఏజి ర్యాపిడ్ టెస్టుకు రూ. 128 వంటి తక్కువ ధరలకు సేవలు అందిస్తున్నారు.