
జగన్ పాట నా కొంపకు తిప్పలు తెచ్చిదన్న మంగ్లీ!
ప్రముఖ గాయని మంగ్లీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ఏపార్టీకి వ్యతిరేకం కాదన్నారు. దేవుడి కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.
ప్రముఖ గాయని మంగ్లీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ఏపార్టీకి వ్యతిరేకం కాదన్నారు. దేవుడి కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. ఇప్పుడెందుకు ఆమె ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దేవుడి కార్యక్రమానికి వెళ్తే, తనపై రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమని గాయని మంగ్లీ (singer mangli) ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి అరసవల్లి దేవాలయానికి వెళ్లారు. అరసవిల్లి ఆలయంలోకి మంగ్లీని రామ్మోహన్ నాయుడు తీసుకు వెళ్లారు. జగన్ మద్దతుదారు మంగ్లీని ఎలా తీసుకెళతారని టీడీపీ క్యాడర్ ప్రశ్నించింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున మంగ్లీ ప్రచారం చేసినట్టు క్యాడర్ ఆరోపించిది.
వైసీపీ నేతలు, మద్దతుదారులు, ఆ పార్టీకి అనుకూలంగా పని చేసిన అధికారులకు టీడీపీలోని కొందరు నేతలు అండగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలతో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఆమధ్య ఒకే వేదికను పంచుకోవడం, ఒకే వాహనంపై ఊరేగింపులో పాల్గొనడం కలకలం రేపింది. తాజాగా మంగ్లీ వ్యవహారం టీడీపీ శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది.
సినీ గాయని మంగ్లీ వైసీపీకి గట్టి మద్దతుదారు అని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రశంసిస్తూ ఆమె పాడిన పాటను విడుదల చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె ప్రచారం చేసింది. ఆ పార్టీ తరపున పాటలు పాడింది. ఫ్యాన్ కు ఓటేస్తే చల్లగా ఉంటామని ప్రచారం చేసింది. టీడీపీ తరపున పాటలు పాడాల్సిందిగా టీడీపీ వర్గాలు ఆమెను సంప్రదిస్తే... తన నోట చంద్రబాబు పేరు ఉచ్ఛరించడం ఇష్టం లేదంటూ తిరస్కరించారనే ప్రచారం జరిగింది.
అలాంటి మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవిల్లి ఆలయంలోకి వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవిల్లి ఆలయం వద్ద మంగ్లీ బృందం పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రామ్మోహన్ నాయుడు ఆలయంలోకి వెళుతూ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. దీన్ని టీడీపీ క్యాడర్ తప్పుపట్టారు. జగన్ కు మద్దతిచ్చిన మంగ్లీని వెంట తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం ఎలా చేయిస్తారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీరావును రామ్మోహన్ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడి తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మంగ్లీ ఏమని లేఖ రాశారంటే..
ఈ నేపథ్యంలో గాయని మంగ్లీ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో ఏముందంటే...
‘‘2019 ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన కొందరు నాయకులు నన్ను సంప్రదిస్తే పాట పాడాను. నేను ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు. వైసీపీ ఒక్కటే కాదు, అన్ని పార్టీల లీడర్లకు నేను పాటలు పాడా. వైసీపీ పార్టీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా. వైసీపీ కి పాడినందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. నా పాట ప్రతి ఇంట్లో పండుగ పాట కావాలి కానీ, పార్టీల పాట కాకూడదన్నది నా అభిప్రాయం. 2024లో ఎన్నికల్లో ఏ పార్టీకీ నేను పాటలు పాడలేదు’’ అని ఆమె పేర్కొన్నారు.
బాబుకు పాట పాడనని చెప్పలేదు...
‘‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి నేను పాట పాడను, ఆయన పేరును నా నోట ఉచ్చరించను అన్నది అవాస్తవం. రాజకీయ లబ్ధి కోసం నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి ఆయన. 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో నాపై విషప్రచారం చేస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవు. నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను. ఒక కళాకారిణిగా నాకు నా పాటే అన్నింటికన్నా ముఖ్యం. నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు. ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు’’ అని మంగ్లీ పేర్కొన్నారు.
మంగ్లీ లేఖతోనైనా టీడీపీ శ్రేణుల మనసు మారుతుందో లేదో చూడాలి. ఇప్పటికే చాలామంది టీడీపీ అభిమానులు కేంద్ర మంత్రి రామమోహన్ నాయుణ్ణి అన్ ఫ్రెండ్, అన్ ఫాలోయర్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
Next Story