నేటి జర్నలిస్ట్ తరానికి తెలియని వ్యక్తి మానికొండ చలపతిరావు. సమాజంపై ఆయన ఆలోచన తీరు గురించి అక్షర రూపం ఇచ్చిన జర్నలిస్ట్ అమరయ్య అభినంద నీయులు.


రాజకీయాలు, సమాజం గురించి, స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం నాటి తరం నేతల తీరును ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప జర్నలిస్ట్ మానికొండ చలపతిరావు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అంత గొప్ప జర్నలిస్ట్ గురించి ఎక్కడా ఎటువంటి రచనలు లేవు. సీనియర్ జర్నలిస్ట్ ఆకుల అమరయ్య ఎంతో శ్రమకోర్చి ఆయన గురించి సమాచారం సేకరించి రాయడం నేటి తరం జర్నలిస్ట్ లకు స్పూర్తిగా ఉందని అన్నారు. బుధవారం రాత్రి విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో 35వ విజయవాడ పుస్తక మహోత్సవం వేదికపై జరిగిన సభలో ‘భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు కూడా మానికొండ చలపతి రావు గురించి తెలియదు, అమరయ్య రాసిన పుస్తకం చదివిన తరువాత మాత్రమే తెలిసింది. అంతటి త్యాగ శీలత ఉన్నందునే స్వాతంత్ర్యానికి పూర్వం దేశం దాటి వెళ్లి చదువుకుని, దేశంలోని పలు ఇంగ్లీషు పత్రికల్లో ఎథిక్స్ తో కూడిన జర్నలిస్ట్ గా రాణించడం అంటే సామాన్యమైన విషయం కాదని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ వంటి వారితో సన్నితంగా ఉంటూనే వారి పనితీరుపై, సమాజంపై వారికి ఉన్న భావనలపై, రాజ్యాంగంపై ఉన్న అభిప్రాయాలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడించడం అంటే అనితర సాధ్యమైనది. అయినా ఆయన ఆచరణలో చూపించారంటే ఎంతో గొప్ప వ్యక్తిత్వం కావాలి. ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించిన నేతలు నాడు ఉన్నారు కాబట్టి ఆయన నిబద్ధతతో జీవించ గలిగారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించి అంతర్జాతీయ స్థాయి జర్నలిస్ట్ గా ఎదగటం తెలుగు జాతికి గర్వకారణమన్నారు. నేడు జర్నలిజంలో స్వతంత్రత అసాధ్యం, కార్పొరేట్ శక్తుల్లోకి జర్నలిజం వెళ్లి వ్యపార వస్తువుగా మారిందని అన్నారు.

ఇంత గొప్ప వ్యక్తి గురించి భారత సమాజానికి తెలియాలంటే ఆయన పేరుతో ఒక ‘మెమోరియల్’ ఉండాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ తాను ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ఆకుల అమరయ్య మాట్లాడుతూ మూడు దశలు దాటి నాలుగో దశలోకి జర్నలిజం చేరిందని, ఇది వ్యాపార దశ అని అన్నారు. నేడు జర్నలిస్ట్ లు ఉద్యోగం కోసం యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు. నాడు మానికొండ చలపతిరావు లాంటి మహానుభావుడు రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరిగే వాడని తెలిపారు. ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ మహాత్మా గాంధీ కుమారుడు దేవదాస్ గాంధీ నిర్వహించిన ‘ప్రెస్ ఇన్ ఇండియా’ మాగజైన్ లో పనిచేశారు. వేరొక పత్రిక వస్తుదని విన్నాను. అక్కడ నాకంటే ఎక్కువ జీతం ఇస్తారట. మీరు వెళతారేమో.. జీతం ఎంత కావాలో అడగండి అని అడిగారట. అప్పుడు మానికొండ ఏమన్నారంటే.. ‘నేను ఇప్పుడు చాలా బాగున్నాను. జీతం పెంచి నా జీవితాన్ని పాడు చేయొద్దు’ అన్నారంటే ఆయన వ్యక్తిత్వం ఏమిటో అర్థం చేసుకోవచ్చని అమరయ్య తెలిపారు.

నెహ్రూకు అత్యంత సన్నిహితునిగా ఉండే వారు, అయినా ఎన్ జి రంగా మానికొండ సలహాలను తీసుకునే వారన్నారు. తాను రాసిన ఈ పుస్తకంలో 28 వ్యసాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఢిల్లీ, ఇంకా పలు లైబ్రరీలు, మిత్రుల వద్ద సేకరించిన సమాచారాన్ని రాశానని చెప్పారు. మానికొండ గురించి మరో చిన్న సంఘటన గురించి ఆయన మిత్రుడు ఒకరు రాశారని, ఆ సంఘటన సమాజం కళ్లు తెరిపించిందన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తరువాత ఆ సాన్నిహిత్యం ఇందిరాగాంధీ వద్ద కూడా మానికొండ కొనసాగించారు. ఆయన చెప్పింది వినటమే కాని, ఎవరి చేతా ఆయన చెప్పించుకోరన్నారు.

నిత్యం ఇందిరాగాంధీకి కనిపించాల్సిందే. ఒక రోజు హటాత్తుగా కనిపించలేదు. ‘చలపతి రావు కనిపించలేదు. ఎక్కడి వెళ్లారు. ఒకసారి ఎక్కడైనా అనాథ శవాలు ఉన్నాయేమో వెంటనే వెతకండి అని సెక్యూరిటీతో అన్నారు ఇందిరాగాంధీ’ దీంతో వెంటనే వెతకడం ప్రారంభించారు. ఉదయం ఒక టీకొట్టు దగ్గర టీ తాగుతూ కిందపడి మృతి చెందారు. ఎవరో తెలియక మునిసిపాలిటీకి టీకొట్టు వారు సమాచారం ఇచ్చారు. శవాన్ని ఆస్పత్రికి పంపించాము అని చెప్పినట్లు ఇందిరాగాంధీ సమాచారం అందుకున్నారు. వెంటనే మార్చురీకి ఆమె వెళ్లి శవాన్ని తీపించి పరిశీలించారు. గుర్తించటానికి ఒక రోజు పట్టింది. అటువంటి త్యాగ జీవితం గడిపిన వ్యక్తిగా చరిత్రలో మానికొండ నిలిచిపోయారన్నారు. తన గురించి ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదని, పాలకుల వద్దకు వెళ్లాలి కాబట్టి వారికి తెలిస్తే చాలనుకునే వారని తెలిపారు.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వృత్తిపై గౌరవంతో వృత్తి మిత్రులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ ఎం సాగర్ కుమార్ మాట్లాడుతూ మానికొండకు ఉన్నది సామాన్య ప్రజలపై ప్రేమ మాత్రమే అన్నారు. అందుకోసం జర్నలిజాన్ని ఎంచుకున్నారనేది ఆయనపై వచ్చిన వ్యసాలు తెలియజేస్తున్నాయన్నారు. ఈ పుస్తకం చదివిన తరువాత, ఆయన ఇంగ్లీష్ లో రాసిన కొన్ని వ్యాసాలు చదివిన తరువాత ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిందన్నారు.

ఏరువాక ఎడిటర్ రాఘవరావు మాట్లాడుతూ అమరయ్య రాసిన పుస్తకం ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుందన్నారు. అమరావతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ సతీష్ మాట్లాడుతూ మానికొండ చలపతిరావు జీవితం ఎంతో మందికి ఆదర్శం అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు పి ఆనందం మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికలో స్థానం సంపాదించడమంటే ఎంతో గొప్ప జర్నలిస్ట్ అయి ఉండాలి. అన్ని అవార్డులన ఆయన తిరస్కరించారు. మానికొండ చలపతిరావు అనాథగా చనిపోయారంటే ఇందిరాగాంధీ ఎంతో బాధపడ్డారన్నారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎన్ వెంకట్రావు మాట్లాడుతూ మానికొండ జీవితం గురించి, జర్నలిస్ట్ గా ఆయన సేవల గురించి తెలుసుకునేందుకు రచయిత అమరయ్య పడిన కష్టం గురించి వివరించారు.

సభకు అధ్యక్షత వహించిన సీనియర్ జర్నలిస్ట్ కె శరచ్చంద్ర జ్యోతిశ్రీ మాట్లాడుతూ మానికొండ చలపతి రావు జీవిత విశేషాలు, ఆయన త్యాగ నిరతి, ప్రజల మంచి కోసం ఆయన చేసిన శ్రమ వర్ణించేందుకు వీలు లేని దన్నారు. ఎంతో ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి కాబట్టే అంతర్జాతీయ జర్నలిస్ట్ గా ఎదిగారన్నారు. సభ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు వందన సమర్పణతో ముగిసింది.

Next Story