గంజాయి చాక్లెట్ రూ. 50, గంజాయి సిగరెట్ రూ.150.. విశాఖలో గంజాయి గబ్బు
x

గంజాయి చాక్లెట్ రూ. 50, గంజాయి సిగరెట్ రూ.150.. విశాఖలో గంజాయి గబ్బు

పాన్షాపులు, బడ్డీలే అడ్డాలుగా అమ్మకాలు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలే టార్గెట్. బానిసలుగా మారుతున్న ఉత్తరాంధ్ర యువత. ఇతర ప్రాంతాలకు గుట్టుగా రవాణా.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

విశాఖపట్నం ఏజెన్సీ గంజాయి సాగుకు పెట్టింది పేరు. మన్యంలో ఒకప్పుడు గుట్టుగా సాగే ఈ పంట కొన్నేళ్లుగా బహిరంగంగానే జరుగుతోంది. వేలాది ఎకరాల్లో గంజాయి గుప్పుమంటోంది. అయినా ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం దీనిని కట్టడి చేయలేకపోతోంది. పోలీసు, ఎక్సైజ్ అధికారుల దాడుల్లో క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతోంది. ఇలా పట్టుబడుతున్నది మొత్తం పంటలో కేవలం పది శాతం కూడా ఉండదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మిగిలినదంతా ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు రవాణా అయిపోతోంది. ఇందుకు స్మగ్లర్లు వేర్వేరు ఎత్తుగడలు, విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. పోలీసులు, తనిఖీ అధికారులు, సిబ్బంది కంటబడకుండా వీరు తప్పించుకుంటున్నారు.

ఇలా గంజాయితో పట్టుబడుతున్న వారిలో స్మగ్లర్లతో పాటు యువత కూడా ఉంటున్నారు. ఇదంతా ఇప్పటివరకు చాలామందికి తెలిసిన వ్యవహారమే. అయితే కొన్నాళ్లుగా గంజాయి నుంచి చాక్లెట్లు, సిగరెట్లను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే గంజాయికి అలవాటుపడ్డ యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్లు, సిగరెట్లను తయారు చేసి గుట్టుగా సరఫరా చేస్తున్నారు. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ చాక్లెట్లు, సిగరెట్లు ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పోలీసులకు ఇవి తరచూ పట్టుబడుతున్నాయి.

బడ్డీలు, పాన్షాపులే అడ్డాలుగా..

సాధారణ పాన్షాపులు, కిళ్లీ బడ్డీల్లో సిగరెట్లు, చాక్లెట్లు విక్రయిస్తుంటారు. ఇప్పుడు వాటినే అడ్డాలుగా చేసుకుని గంజాయి సిగరెట్లు, చాకెట్లను అమ్ముతున్నారు. గంజాయి ముఠాలతో మాదకద్రవ్యాలను సరఫరా చేసే వారు సంబంధాలను కలిగి ఉంటారు. మత్తుకు బానిసలుగా మారిన వారితో వీరు టచ్లో ఉంటారు. ఫలానా చోట, ఫలానా బడ్డీలో, పాన్ షాపులో ఇవి అందుబాటులో ఉన్నాయని చెబుతారు. ఇలా ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల వీటిని విస్తృతంగా అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం నగరంతో పాటు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో వీటి విక్రయాలు జరుగుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. తమకు అందిన సమాచారంతో దాడులు చేస్తున్న పోలీసులకు ఈ గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు పట్టుబడుతున్నాయి.

తాజాగా నాలుగు రోజుల క్రితం (సెప్టెంబర్ 29న) విశాఖ నగరంలోని టూటౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఓ పాన్ షాపులో ఉన్న 133 గంజాయి చాక్లెట్లను (660 గ్రాములు) సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని షాపు నిర్వాహకుడు మనోజ్కమార్ను అరెస్టు చేశారు. ఈ చాక్లెట్ల రేపర్పై లహరి, జోష్ అనే పేర్లతో ఆకర్షణీయంగా ముద్రించి ఉన్నాయి. విశాఖ నగరంలో పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. వీటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పలు ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులను టార్గెట్ చేసి గంజాయితో పాటు దాంతో తయారైన చాక్లెట్లు, సిగరెట్లను విక్రయిస్తున్నారు.

అంతుకాదు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ గంజాయి చాక్లెట్లు, సిగరెట్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. పొరుగున ఉన్న ఒడిశాలోని పర్లాకిమిడి, బ్రహ్మపుర (బరంపురం) ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి గంజాయి సిగరెట్లు, చాక్లెట్లను తయారు చేస్తున్నారు. ఎంపిక చేసుకున్న పాన్షాపులు, బడ్డీల్లో వీటిని విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే వారు కోడ్ భాషను ఉపయోగిస్తారు. అలా కోడ్లో అడిగిన వారికే వీటిని అమ్ముతారు. 'రానురాను యువతలో మాదక ద్రవ్యాలకు బానిసలయ్యే వారి సంఖ్య అధికమవుతోంది. గంజాయి అక్రమ రవాణాతో పాటు గంజాయి చాక్లెట్లు, సిగరెట్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారు విశాఖలోనూ పెరుగుతున్నారు. యువత, విద్యార్థినీ విద్యార్థులు వీటికి బానిసలు కాకుండా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం' అని యాంటీ డ్రగ్స్ కన్వీనర్, న్యాయవాది సురేష్ బేతా 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

చాక్లెట్ రూ.50, సిగరెట్ రూ.150

గంజాయి చాక్లెట్లు 5, 10, 15 గ్రాముల బరువుతో ఉంటాయి. ఒక్కో గంజాయి చాక్లెట్ ఖరీదు రూ.20-50, సిగరెట్ ధర రూ.150-200 వరకు ఉంది. చాక్లెట్లో 14-20 శాతం గంజాయిని కలిపి తయారు చేస్తున్నారు. ఈ చాక్లెట్ను తిన్న వారు కొద్ది సేపటికే ఏదో తెలియని మైకంలోకి, ఆపై మత్తులోకి వెళ్లిపోతారు. తొలుత యువత/విద్యార్థినీ, విద్యార్థులు వీటికి అలవాటు పడే వరకు ఉచితంగా ఇస్తారు. కొద్దిరోజుల తర్వాత బానిసలుగా మారాక వాటి కోసం ఎగబడుతుంటారు. అవి లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంటారు. తొలుత ఉచితంగా, కొన్నాళ్లకు తక్కువ ధరకు, బానిసలయ్యాక ఎక్కువ రేటుకు విక్రయిస్తారు. ఇక గంజాయి సిగరెట్లను కూడా అలాగే అలవాటు చేస్తుంటారు. కొంతమంది విక్రయదార్లు మామూలు సిగరెట్లలోని పొగాకును తొలగించి వాటిలోకి గంజాయి పొడిని చొప్పిస్తారు.

చూడడానికి సాధారణ సిగరెట్ల మాదిరిగానే ఉంటాయి. ఇంకొందరు సిగరెట్ మాదిరి పేపర్లను కత్తిరించి వాటిలో వేసి చుడతారు. కోడ్ భాషలో అడిగిన వారికి ఈ గంజాయి సిగరెట్లను విక్రయిస్తారు. గంజాయి సిగ రెట్లను గతంలో ఏదో మారుమూల ప్రాంతాల్లోను, సినిమా థియేటర్ల పరిసరాల్లోనూ కాల్చేవారు. ఇప్పుడు పార్కులు, బీచ్లు వంటి బహిరంగ ప్రదేశాలతో పాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనూ తాగుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి..

కాగా ఈ గంజాయి సిగరెట్లు, చాక్లెట్లను ఒడిశా, బీహార్ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోకి దిగుమతి అవుతున్నాయి. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న బ్యాగుల్లో వీటిని తీసుకొస్తున్నారు. ఎక్కువగా రైళ్లలోనూ, బస్సుల్లోను వీటిని తరలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు తీసుకొచ్చి నిర్దేశిత వ్యక్తులకు, షాపులకు సరఫరా చేస్తారు. ఇటీవల కాలంలో కొరియర్, ఆన్లైన్ ద్వారా కూడా గంజాయి సిగరెట్లు, చాక్లెట్లను రప్పిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Read More
Next Story