ఆంధ్రా మద్యం అమ్మకాల్లో ఇదే మతలబు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మక దుకాణాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకోవడం లేదు. అందుకు కారణాలు ఏమిటో మీకు తెలుసా..


ఆంధ్రా మద్యం అమ్మకాల్లో  ఇదే మతలబు
x
Liquor Shop in Vijayawada

డిజిటల్‌ పేమెంట్స్‌ ఎందుకు తీసుకోవడం లేదో తెలుసా?

సేల్స్‌ తగ్గినా ధరలు పెరిగాయి, ఆదాయం పెరిగింది
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల్లో డిజిటల్‌ లావాదేవీలు ఎందుకు చేయడం లేదు. డిజిటల్‌ లావాదేవీలు భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నగదు రహిత లావాదేవీల ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది పాలకులు చెబుతున్న మాట. కానీ పాలకులే అమలు చేయడం లేదు. ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ వుండటం లేదు. ప్రధానంగా ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ దుకాణాల్లో మొదటి మూడేళ్లు డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకోలేదు. ఆ తరువాత మధ్యలో ఒక ఆరు నెలలపాటు డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించారు. అక్కడక్కడ కొన్ని షాపుల్లో మాత్రమే ఈ లావాదేవీలు జరిగాయి. యుపీఐ యాప్స్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్స్‌ స్కాన్‌ చేసి డబ్బులు తీసుకోవడం, పోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటి ద్వారా తీసుకోవడం చేశారు. రెండు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్‌ పూర్తిగా ఆగిపోయాయి.
డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో మీనమేషాలు ఎందుకు?
డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో ఈ గందరగోళం ఎందుకోసం, ఎవరికోసం అనేది అర్థం కాని వ్యవహారం. ప్రభుత్వం కూడా సమాధానం చెప్పకుండా దాటేస్తున్నది. చిన్న చిన్న వ్యాపారాల్లో సహితం ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ని అంగీకరిస్తున్న దశలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదును మాత్రమే తీసుకోవడం వెనుక పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందన్నది మరో ఆరోపణ.
రాష్ట్రంలో 80 లక్షల మంది మద్యం సేవించే వారున్నారని, వారంతా రోజుకి రూ. 200 కనీసంగా ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి కనీసంగా రూ. 50వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉందని, కానీ అందులో సగమే అధికారికంగా జమ చేస్తూ, పెద్ద మొత్తంలో అవినీతికి ప్రభుత్వం పాల్పడుతోందనే ఆరోపణలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వం రిటైల్‌ వ్యాపారం
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్బీసీఎల్‌ ) దగ్గర రిజిస్టర్‌ అయిన వివిధ డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తారు. ప్రస్తుత ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా రిటైల్‌ విక్రయాలు జరుపుతోంది. డిస్టిలరీల నుంచి మద్యం సేకరణ విషయంలో కొన్ని సంస్థలకే ప్రాధాన్యం దక్కుతోందన్నది విపక్షాల వాదన. చంద్రబాబు పాలనలో అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో వంటి సంస్థలకు ప్రాధాన్యతనిచ్చారని ఇటీవల సీఐడీ కేసులో పేర్కొన్నారు. ఇప్పటికీ అదే పంథా కొనసాగుతుండటం ఆసక్తికరం. కేవలం 16 కంపెనీల నుంచి 74 శాతం మద్యం సేకరించడం అందుకు ఆధారంగా వైరిపక్షాలు చూపుతున్నాయి.
డిస్టలరీ లేని సంస్థకు సప్లై లైసెన్స్‌
జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన అదాన్‌ డిస్టలరీస్‌కి ప్రాధాన్యత దక్కుతుండడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. సొంతంగా డిస్టలరీ కంపెనీ లేని అదాన్‌ సంస్థ చింతకాయల రాజేష్‌ పేరుతో ఉన్న విశాఖ డిస్టలరీస్, పుట్టా మహేష్‌ పేరుతో ఉన్న పీఎంకే డిస్టలరీస్‌కి సబ్‌ లీజుదారుడిగా ఉంది. సబ్‌ లీజుదారుడిగా ఉన్న అదాన్‌ సంస్థకు అధికంగా లబ్ది చేకూర్చేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారనేది ఆరోపణ. మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు బంధువులు కావడం విశేషం. అదాన్‌తో పాటుగా కొన్ని సంస్థల నుంచే అత్యధిక మద్యం కొనుగోలు జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం కూడా కాదనడం లేదు.
జీఎస్టీ ఎగ్గొడుతున్నారా?
డిజిటల్‌ పేమెంట్స్‌ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్‌ తీసుకుని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలకు లెక్క చెప్పాలి. వారిని ప్రశ్నించాల్సింది ప్రజలు, వారికి ఎటువంటి సమాచారం లేనప్పుడు వారు ఎలా ప్రశ్నిస్తారనేది ప్రశ్న. అందుకే కొంత డబ్బుకు మాత్రమే లెక్కలు చెప్పి మరికొంత డబ్బుకు లెక్కలు చెప్పకుండా దాట వేస్తున్నారని, దాని వల్ల జీఎస్టీ లాంటిది ఎంతో మిగిలే అవకాశం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం లైసెన్డ్‌ మద్యమే కాకుండా అన్‌లైసెన్డ్‌ మద్యం కూడా విక్రయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. లేకుంటే డిజిటల్‌ లావాదేవీలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రతిపక్ష పార్టీల వారు ప్రశ్నిస్తున్నారు.
రోజుకు రూ. 80 కోట్లు..
2019 నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకు రూ. 50 కోట్లు మద్యం ద్వారా వస్తుంటే ప్రస్తుతం అది రోజుకు రూ. 80 కోట్ల వరకు వెళ్లింది. ధరలు రెండు నుంచి మూడు రెట్లు ప్రభుత్వం పెంచింది. 2018–19లో బీరు 2.77 కోట్ల కేసులు అమ్మకం జరిగితే 2022–23 నాటికి 1.16 కోట్ల కేసులు అమ్మకాలు జరిగాయి. ఇండియన్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌) అమ్మకాలు 3.84 కోట్ల నుంచి 3.35 కోట్ల కేసులకు తగ్గింది. 2014 నుంచి 2019 వరకు మద్యం అమ్మకాలు రూ. 75,284 కోట్లు ఉంటే జగన్‌ ప్రభుత్వంలో రూ. 1.10 లక్షల కోట్లకు చేరింది. 2018–19లో మద్యం ఆదాయం రూ. 20,128 కోట్లుగా ఉంటే 2022–23లో రూ. 28,113 కోట్లకు పెరిగింది. అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పెరిగింది. అంటే కారణం ధరలు విపరీతంగా పెంచడం. గతంలో రూ. 90లు అమ్మిన క్వార్టర్‌ బాటిల్‌ ప్రస్తుతం రూ. 210లు అమ్ముతున్నారు.
అనారోగ్యం పాలవుతున్న మందుబాబులు
ప్రస్తుతం తాగుతున్న మద్యం వల్ల ఎంతో మంది ఆరోగ్యానికి ముప్పు వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. పేర్లు చెప్పడానికి ఇష్ట పడని వైద్యులు రోగులను పరీక్షించినప్పుడు క్వాలిటీలేని మద్యం వల్లనే ఇటువంటి వ్యాధులు వస్తాయంటున్నారు.
బ్రాండ్స్‌ కూడా వారు ఇచ్చినవే తీసుకోవాలి
వినియోదారుడు అడిగిన బ్రాండ్స్‌ షాపుల్లో ఇవ్వడం లేదు. షాపు వారు చెప్పినవే తీసుకోవాలి. లేదంటే వెనుదిరగాల్సిందే. దుకాణాల వద్ద 116 రకాల బ్రాండ్స్‌ పేర్లు బోర్డులపై డిస్‌ప్లే చేశారు. కానీ షాపుల్లో ఉండేది కేవలం నాలుగైదు బ్రాండ్స్‌ మాత్రమే.
యాప్‌ పనిచేయడం లేదు
డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించేందుకు ఒక ప్రైవేట్‌ కంపెనీ వారు యాప్‌ తయారు చేశారు. ఆ యాప్‌ పనిచేయడం లేదు. మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ఉద్యోగులు చెబుతున్న మాట. ఎందుకు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ తీసుకోవడం లేదనే విషయాన్ని తెలుసుకునేందుకు విజయవాడలోని మద్యం షాపు నెం: 06977లో ఉద్యోగులను ఫెడరల్‌ ప్రతినిధి ప్రశ్నిస్తే వారి నుంచి వచ్చిన సమాధానం ఇది.
మరికొందరిని ప్రశ్నిస్తే మాకు తెలియదు, యాప్‌ పనిచేయడం లేదు. డబ్బులు ఉంటే తీసుకోండి. లేకుంటే వెళ్లండి. ముందు అడ్డులేయండి. ఇదీ అక్కడ జరుగుతున్న వ్యవహారం.
డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకోకపోవడం తప్పు
డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకోవాలి. దాని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లెక్కలు కూడా పక్కాగా ఉంటాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకోకపోవడం ముమ్మాటికీ తప్పే.
పివి రమేష్, రిటైర్డ్‌ ఐఏఎస్, పూర్వపు ఏపీ ఫైనాన్స్‌ కార్యదర్శి.
Next Story