సొంత గడ్డపై  సీఎంకు ఎదురుదెబ్బ
x

సొంత గడ్డపై సీఎంకు ఎదురుదెబ్బ

జిల్లాలో సీఎం వైఎస్. జగన్‌కు దెబ్బ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మౌనం వహించారు. ఆయన అనుచర వర్గం టిడిపిలో చేరింది.


( ఎస్..ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: సొంత జిల్లాలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనాలు తలకిందులయ్యాయి. మోనార్క్ రాజకీయాలు చెల్లబోవంటూ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గట్టి షాక్ ఇచ్చారు. మరో మాజీ మంత్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ సమకాలిక సహచరుడు టిడిపికి మద్దతు ప్రకటించారు. ఈ ఘటనలతో వైఎస్ఆర్సిపి నాయకులు దిమ్మెర పోయారు. నష్ట నివారణ చర్యలకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. కడప జిల్లా రాజంపేట, మైదుకూరులో చోటు చేసుకున్న పరిణామాలు వైఎస్ఆర్‌సీపీ నాయకులకు శరాఘాతంగా మారాయి.

రాజంపేట టిడిపి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం సోదరుడు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు సారథ్యంలో.. దాదాపు 100 వాహనాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి సహా నియోజకవర్గంలోని ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు వెళ్లారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వారంతా హైదరాబాద్‌కు వెళ్లి టిడిపిలో చేరారు.

నేను రాను.. రాలేను..

" ప్రచారానికి వచ్చేది లేదు. నా వల్ల కాదు" అనే భీష్మించిన వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని టిడిపిలోకి పంపించేశారు. ఈ అనూహ్య పరిణామంతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి దిమ్మెర పోయారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కడప జిల్లా రాజంపేట శాసనసభ స్థానంలో జరిగిన ఈ పరిణామం వైఎస్సార్సీపీ వర్గాలను కుదుపు కుదుపాయి. ఆ వివరాల్లోకి వెళితే..

రాజంపేటలో గండి

రాజంపేట వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఆగ్రహించారు. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మేడా మల్లికార్జున్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన మేడా మల్లికార్జున రెడ్డి.. వైఎస్ఆర్సిపిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. సున్నిత మనస్కుడైన మేడా మల్లికార్జున్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో తనకు జరిగిన చేదు అనుభవాలను భరించలేని స్థితిలో మిగిలారు.

దీంతో ఆయన నియోజకవర్గంలోని సుండుపల్లి, రాజంపేట, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు దశలవారీగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ తర్వాత మంగళవారం కొందరు టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిపోయారు. రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్లు అధిక శాతం అదే బాటలో ఉన్నారు. గురువారం వారందరూ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోవడంలో సమాచారం. దీంతో ఉలిక్కిపడిన టిడిపి రాజంపేట అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వద్దకు పరుగులు తీశారు. పార్టీ నాయకులు టిడిపిలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని మేడా మల్లికార్జున రెడ్డిని వారు కోరారని సమాచారం. తద్వారా ఇంకొంతమంది టీడీపీలోకి వెళ్లకుండా నివారించడానికి ఆస్కారం ఉంటుందని అభ్యర్థించినట్లు సమాచారం.

ససేమిరా అన్న మేడా..

దీనికి రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఘాటుగానే స్పందించారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బూత్ కమిటీలను మార్చడంతో పాటు అసైన్మెంట్ ప్రతిపాదనను నిలిపివేయడం తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కూడా మేడా మల్లికార్జున రెడ్డి గట్టిగా ప్రస్తావించినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పటికీ గత ఐదేళ్ల కాలంలో తనను నమ్ముకున్న నాయకులు అనుచరులు నష్టపోయారంటూ, ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అసలు కారణం ఏంటంటే..

సీటు పోయిందిగా..

2014 ఎన్నికల్లో రాజంపేట శాసనసభ స్థానం నుంచి మేడ మల్లికార్జున్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు ప్రభుత్వ విప్ హోదా కూడా అప్పుడు కల్పించారు. చిన్న విషయాన్ని కూడా సున్నితంగా భావించే మేడా మల్లికార్జున్ రెడ్డి మనస్తత్వాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్ర విభజన తర్వాత రెండో భద్రాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ప్రకటించారు. టీటీడీ ఆధీనంలోకి తీసుకున్న ఈ ఆలయంలో శ్రీరామ మహోత్సవాలు స్వామివారి పట్టాభిషేకం కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కుటుంబంతో రాష్ట్ర ప్రభుత్వ విప్ హోదాలో వెళ్ళిన మేడా మల్లికార్జున రెడ్డిని, కుటుంబ సభ్యులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆయన "నాకు విప్ హోదా వద్దు. నా వాహనంపై ఎర్రబుగ్గ అసలే వద్దంటూ తొలగించారు" ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సతీష్ చెప్పడంతో పరిస్థితి తాత్కాలికంగా సుఖాంతం అయింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో 2019 ఎన్నికల్లో ఆయన వైయస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక సమస్య ఏమిటి అంటే..

సీటు మార్చారు...

రాజంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట అమర్నాథ్ రెడ్డి కూడా రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట చెందిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ అభిమానం ఉంది.

దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న మేడ మల్లికార్జున రెడ్డిని తప్పించి ఆ స్థానంలో 2024 ఎన్నికల కోసం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడా రఘునాథరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం కూడా కల్పించారు.

" మేడా కన్‌స్ట్రక్షన్ ద్వారా ఆర్థిక స్థిరత్వం కలిగినది మేడ కుటుంబం" అలాంటి తనకు టికెట్ నిరాకరించాల్సిన అవసరం ఏంటనేది మేడా మల్లికార్జున రెడ్డి మదిలో ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం. తనకు టికెట్ దక్కక పోవడానికి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కారణమని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ఆర్సిపిలో మేడా, ఆకేపాటి వర్గాలుగా విడిపోయాయి.

దీనికి తోడు గత సంవత్సరాల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆయన కినుకు వహించినట్లు చెబుతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో అధికార వైయస్సార్సీపితో పాటు టిడిపిలో లోపాయికారీగా సహకారం అందించే నాయకులకు కూడా ఏమాత్రం తక్కువ లేదు. బలమైన అనుచర వర్గం, ఆర్థిక స్థిరత్వం కలిగిన తనకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని మేడా మల్లికార్జున రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. దీంతో ఆయన అనుచర వర్గం కూడా ఆగ్రహంతో కీలకమైన నాయకులందరూ టిడిపిలో చేరారు. రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. మరో రెండు రోజుల్లో బిజెపి జాతీయ కార్యదర్శి, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజులు వేయడానికి కార్యక్రమాలు రూపొందించారు. మేడ విజయవర్గమంతా బిజెపికి మద్దతు తెలపడానికి సమయం సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

ఇక్కడ నష్ట నివారణ చర్యలకు రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బలమైన మేడ మల్లికార్జున వర్గం టిడిపికి మద్దతు తెలపడానికి ముందు కదలడంతో రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అంచనాలు తలకిందులయ్యాయని భావిస్తున్నారు.

నా మద్దతు పుట్టాకే..

కడప జిల్లా మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ సమకాలీకులు, మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి మద్దతు ప్రకటించారు. "టిడిపి అంటే నాకు గిట్టదు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ఇస్తున్న" అని డిఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. తన అభిమానులు శ్రేయోభిలాషులు టిడిపి అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.

సుధాకర్ యాదవ్ ప్రజలతో మమేకమైతే శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటారు. అంటూనే వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి రాజకీయాలకు పనికిరాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుధాకర్ యాదవ్ పద్ధతిగల రాజకీయ నాయకుడని ప్రశంసించిన డిఎల్ రవీంద్రారెడ్డి... పొత్తు లేకున్నా టిడిపి అధికారంలోకి వచ్చేది. బిజెపి వల్ల 30 సీట్లు దెబ్బ తగిలిందని ఆయన విశ్లేషించారు. ప్రతి ఊరికి వెళ్లి జనాన్ని కలిసి సమస్యలన్నీ డైరీలో రాసుకొని పరిష్కారానికి కృషి చేయాలని డిఎల్ రవీంద్రారెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ కు సూచించారు.

Read More
Next Story