ఏపీలో పోలీసులు బృందాలుగా విడిపోయి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం తిరుగుతున్నరని ప్రచారం. కేసు ఏమిటంటే టీడీపీ ఆఫీసుపై దాడి.


నాలుగు రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ చుట్టూ సోషల్‌ మీడియా, ఇతర మీడియా సంస్థలు తిరుగుతున్నాయి. అదిగో అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు అంటూ ప్రచారం సాగింది. ఇదంతా గాసిప్‌ అని తేలిపోయింది. దీంతో ఇప్పుడు పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారంటూ మళ్లీ కథనాలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో జరిగిన సంఘటనలపై కేసులు నమోదయ్యాయి. చాలా మందిని నిందితులుగా రెండో సారి నమోదు చేశారు. కొన్ని కేసులు అప్పట్లో నమోదైనా కొందరు నిందితులు తప్పించుకు తిరుగుతున్నారంటూ వారిని కూడా నిందితులుగా చేర్చి కేసును తిరగరాశారు. ఇలా చాలా మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుకున్నారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్‌ను కూడా అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల 71వ నిందితునిగా చేర్చారు. ఎలాగైనా పట్టుకుని అరెస్ట్‌ చేయాలనే పట్టుదలతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇందుకు బోలెడు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై నిందలు వేసి అవమానించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్నారు. అవే కాకుండా వంశీతో పాటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే నానీ కూడా చంద్రబాబుపై అవాకులు చవాకులు పేల్చారు. ఇష్టానుసారం మాట్లాడారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న చంద్రబాబు వీరిని ఎలాగైనా జైలు గోడల మధ్యకు పంపించాలనే ఆలోచనకు వచ్చారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో నిందితునిగా వంశీ మోహన్‌ ఇరుక్కున్నారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైఎస్సార్‌సీపీలో చేరిన వంశీ 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సుడిగాలిలో ఉద్దండులనుకున్న వారంతా మట్టికరిచారు. దీంతో ఎలాగైనా తనకు జైలు తప్పదనుకున్న వంశీ అమెరికా వెళ్లి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వీసా తీసుకునే పనిలో ఉన్నారు. తన పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు. అందువల్ల వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలో కేసు నమోదు కావడం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఏ లాయర్‌ ద్వారా అనేది వెల్లడి కాలేదు.
కక్ష రాజకీయాలకు రాష్ట్ర రాజకీయ పార్టీలు వేదికలుగా మారాయి. ప్రస్తుతం తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల వంశీని కొట్టేందుకు కొందరు టీడీపీ కార్యకర్తలు గన్నవరంలోని ఆయన కార్యాలయాన్ని చుట్టుముట్టారు. పోలీసులను సైతం టీడీపీ కార్యకర్తలు తరిమి కొట్టారు. అందులో ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు కూడా ఉండటం విశేషం. దీంతో పోలీసులు ఏఆర్‌ పార్టీని పిలిపించి తగిన చర్యలు తీసుకున్నారు. గుంపును చెదరగొట్టారు. అప్పటి నుంచి వంశీమోహన్‌ హైదరాబాద్‌లోనే వుంటున్నారు. రెండు రోజుల క్రితం వంశీ భార్య గన్నవరంలో జరిగిన ఒక ప్రోగ్రాంకు వచ్చారు. అప్పుడు వంశీని అరెస్ట్‌ చేశారని భారీ ప్రచారం జరిగింది. దీనిని వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు ఖండించారు. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన పేర్ని నాని ఖండిస్తూ ఇటువంటి దుందుడుకు ప్రచారాలు మంచివి కాదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడికక్కడ కేసుల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Next Story