మనసు మంగళగిరి వైపే..

నారా లోకేష్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు నాలుగు నెలల ముందే రాజీనామా చేశారు.


మనసు మంగళగిరి వైపే..
x
Nara Lokesh Family

మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి నారా లోకేష్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు నాలుగు నెలల ముందే రాజీనామా చేశారు. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు పోటీ పడుతున్న తీరు పలువురి దృష్టిని ఆకర్షించింది.

రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచి సత్తా చూపించడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన ప్రతి పనీ చేస్తానని ఇప్పటికే పలు సార్లు లోకేష్‌ ప్రకటించారు.
రాష్ట్రమంతా తిరుగుతూ పాదయాత్రలో ఉన్నా మనసు మంగళగిరి వైపే ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పలుసార్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు విషయాల కోసం ప్రత్యేకించి ఒక టీమును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా ఈ టీమ్‌ పనిచేస్తున్నది.
ఓటమిని పాజ్‌టీవ్‌గా తీసుకున్న లోకేష్‌
ఓటమిని పాజిటివ్‌గా తీసుకున్న లోకేష్‌ ఇక్కడే గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కేవలం 5,337 ఓట్ల తేడాతోనే ఓటమి చెందారు. అంటే రెండున్నర వేల మంది లోకేష్‌కు ఓటు వేసి ఉంటే గెలుపు సాధ్యమయ్యేది. నియోజకవర్గంలో ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఓటమి వల్ల బాధపడుతున్నాననే మాట ఎక్కడా అనలేదు. అన్నా ఎలా ఉన్నారు. ఏమి చేస్తున్నారు. నేను ఏదైనా చేయాల్సింది ఉందా? అంటూ పలకరిస్తూ నియోజకవర్గమంతా తిరుగుతూనే ఉన్నారు.

పాదయాత్ర ముగించుకుని ఇంటికి చేరిన లోకేష్‌ మొదటి వారమంతా మంగళగిరి నియోజకవర్గంలోనే గడిపారు. ఆదివారం సాయంత్రంతో పర్యటన ముగిసింది. మంగళగిరిలో ఉన్న పానకాల లక్ష్మీనరసింహస్వామి, శివాలయాలను సందర్శించారు. పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కింద నుంచి కొండపైకి మెట్ల దారిన కాలినడకన వెళ్లారు. ఆయనతోపాటు తల్లి భువనేశ్వరి, భార్య హ్మ్రణి, కుమారుడు దేవాన్స్‌లు ఉన్నారు. కుటుంబమంతా ప్రత్యేక పూజలు చేసి దేవునికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇరువురు ముఖ్య నేతల చేరిక
టీడీపీలోకి మంగళగిరికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు అందె వెంకటప్రసాద్, పల్నాటి నాగేశ్వరావులు లోకేష్‌ సమక్షంలో చేరారు. ఒక్కొక్కరుగా పార్టీలోకి నాయకులు చేరుతున్నారు. ఇటీవల జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలే మమ్ములను ఆకర్షిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
9 నుంచి 28 వరకు క్రికెట్‌ పోటీలు
ఈనెల 23న నారా లోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా మంగళగిరిలో ‘మంగళగిరి ప్రీమియం లీగ్‌–2 క్రికెట్‌ పోటీలు’ నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. మంగళగిరి, తాడేపల్లిల్లో ఇప్పటికే లోకేష్‌ అభిమానులు క్రికెట్‌ గ్రౌండ్స్‌ సొంతగా ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండో బహుమతి రూ. 1లక్ష, మూడో బహుమతి రూ. 50లు ఇస్తారు. ఇప్పటికే వంద జట్లు మొదటి రౌండ్‌కు పేర్లు నమోదు చేసుకోగా మొదటి డ్రా సోమవారం తీశారు.
తటస్తులతో కొనసాగుతున్న భేటీలు
నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్‌ బేటీలు కొనసాగుతున్నాయి. ఉండవల్లికి చెందిన కాపు సామాజికవర్గ ప్రముఖుడు సింగంశెట్టి వెంకటేశ్వరావు, గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ ఫలగాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ పాత్రికేయుడు తాడిబోయిన నాగేశ్వరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. ప్రముఖులను కలిసే కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సొంత నిధులతో సంక్షేమ కార్యక్రమాలు..
నూతన వధూవరులకు ఉచితంగా బట్టలు పెట్టే కార్యక్రమానికి లోకేష్‌ శ్రీకారం చుట్టారు. ఎస్సీలకు పెళ్లి బట్టలతో పాటు బంగారు తాలిబొట్టు కూడా ఉచితంగా ఇస్తున్నారు. సొంత నిధులతో రెండు చోట్ల సంజీవని ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ఒకటి, మరొకటి తాడేపల్లిలో ఉన్నాయి. ఇక్కడికి ఎవరు వెళ్లినా ఉచితంగా వైద్యం చేస్తారు. వైద్య పరీక్షలు కూడా ఉచితంగానే చేస్తారు. నిత్యం వైద్యుడు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు మొబైల్‌ వ్యాన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రథమిక చికిత్స ఇస్తారు. అవసరమైతే మెరుగైన సేవల కోసం మంగళగిరి లేదా తాడేపల్లిలోని వైద్య శాలలకు తరలిస్తారు. స్త్రీ శక్తి పేరుతో నియోజకవర్గంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి, వారికి ఒక కుట్టు మిషన్‌ను ఉచితంగా అందజేసే కార్యక్రమం చేపట్టారు. అలాగే బ్యూటీషన్‌ కోర్స్‌ల్లో కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ పూర్తయిన తరువాత ఎవరైనా బ్యూటీ క్లినిక్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తే వారికి ఉచితంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

మంగళగిరి, తాడేపల్లి కేంద్రాలుగా అన్న క్యాంటిన్లు లోకేష్‌ నడుపుతున్నారు. ఈ క్యాంటిన్లలో సమయానికి ఎవరు వచ్చినా ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. ఎన్‌ఆర్‌ఐలు, ఇతరులు డొనేషన్స్‌ ఈ క్యాంటిన్ల నిర్వహణకు ఇస్తున్నట్లు లోకేష్‌ ఏర్పాటు చేసిన టీమ్‌ వారు చెప్పారు.
స్వర్ణ కారుల ద్వారా లక్ష్మీనరసింహ సొసైటీని ఏర్పాటు చేయించి వారికి ఉచితంగా స్వర్ణకార పనిముట్లు అందజేస్తున్నారు. పేదలకు ఉచితంగా ఇస్తీ బండ్లు, తోపుడు, టిఫిన్‌ బండ్లు ఇస్తున్నారు. ఈ బండ్ల ద్వారా చిన్న కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ బండ్లపై ‘మన లోకేష్‌ మన మంగళగిరి’ పేరు రాశారు. వెల్డింగ్‌ షాపులు పెట్టుకున్న వారిని గుర్తించి వెల్డింగ్‌ పనులు చేసుకునేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయించి ఇప్పించారు. అది నిరంతర ప్రక్రియగా జరుగుతున్నది.

నియోజకవర్గంలో ఎవరి ఇంట్లోనైనా చావులు సంభవిస్తే మట్టి ఖర్చులు, దినం ఖర్చులకు ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. రంజాన్, క్రిస్‌మస్, ఇతర పండగలకు తోఫాలు ఇప్పిస్తున్నారు. పార్టీ నాయకులు పండగ సమయాల్లో పేదలను గుర్తించి వారి సాయం చేస్తున్నారు.
Next Story