చంద్రబాబు జీన్స్ లోనే బీసీ వ్యతిరేకత ఉందా?
టీడీపీ నిర్వహించిన జయహో బీసీ సదస్సు రాష్ట్రవ్యాప్తంగా మంటలు రేపింది. అధికార పక్షమైన వైసీపీ చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. సవాళ్ల పర్వం కొనసాగుతోంది
‘చంద్రబాబూ.. నువ్వో బీసీ వ్యతిరేకివి. బీసీలకు అధికారం ఇవ్వనివాడివి నువ్వు బీసీలను ఉద్దరిస్తావా? హాస్యాస్పదంగా లేదూ? మీరు కనుక చర్చకు వస్తే, ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో నీతో వాదించేందుకు నేను సిద్ధం. మీరు చేసిన పొరపాట్లు అన్నీ చూపిస్తా. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచీలు నేను చూపించేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటున్నారు రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు. నీ జయహో బీసీని ప్రజలెవ్వరూ నమ్మరు అని కూడా చెబుతున్నా అని సవాల్ విసురుతున్నా. “నీలో మాయ ఉంది. మోసం ఉంది. అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయి తప్ప నిజమైన సామాజిక న్యాయం, రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించే ఆలోచనలు నీలో లేవు. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయకత్వానికి లేదు ” అంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
బీసీల పార్టీగా టీడీపీకి ముద్ర ఉంది. 2019 ఎన్నికల్లో అది కాస్తా పటాపంచలైంది. 2024 ఎన్నికలు వస్తున్న సమయంలో చంద్రబాబు పార్టీ జయహో బీసీ నిర్వహించింది. 50 ఏళ్లకే పెన్షన్ సహా దాదాపు 8 హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటన్నింటినీ వైసీపీ చీల్చిచెండాడుతోంది. ”పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. 40 ఏళ్లు రాజకీయాలలో అనుభవం ఉన్నవారు. ఆయన భావజాలం మీరు చూస్తే ఏనాడూ అతడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. రాజ్యసభకు ఇప్పటిదాకా ఒక్క బీసీని కూడా చంద్రబాబు పంపించలేదు. ఇది నిజం కాదా? ” అన్నది ధర్మాన ప్రశ్న.
మీ జీన్స్ లోనే బీసీ వ్యతిరేకత ఉంది...
ధర్మాన ప్రసాదరావు ఇంకో అడుగుముందుకేసి చంద్రబాబు జీన్స్ లోనే బీసీ వ్యతిరేకత ఉందనడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ”అసలు చంద్రబాబు వ్యక్తిగతంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు వ్యతిరేకి. అది మేం చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కాని, గడిచిన ఐదేళ్లలో మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్‌గా చెబుతోంది కదా. నిన్న జయహో బీసీ అని అన్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఇస్తే ఆటోమెటిక్ గా సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది. బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, తెలుగు దేశం పార్టీకీ ఒక డిబెట్ కనుక మీరు పెడితే,డిబెట్‌కు మీరు వస్తామన్నా, మీ తాలుకా వ్యక్తులు ఎవ్వరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేందుకు సిద్ధం” అని సవాల్ చేశారు.
టీడీపీ కూడా అదే రేంజ్ లో...
చంద్రబాబును విమర్శించిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కూడా అదే రేంజ్ లో విరుచుకుపడ్డారు. జగన్ లాంటి వ్యక్తిని నమ్మి ఓటు వేసినందుకు బీసీలకు బాగానే వాతలు పెట్టారని, తన బాస్ ప్రాపకం కోసం మంత్రి ధర్మాన పాకులాడుతూ జగన్ ను మెప్పించేందుకు తంటాలు పడుతున్నారన్నారు పార్టీ అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు. బీసీలకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం ఇస్తున్నారన్నారు గుడివాడ టీడీపీ ఇన్‌చార్జి వెనిగండ్ల రాము. “జయహో బీసీ సదస్సు సక్సెస్ కావడంతో వైసీపీ నేతల కళ్లుకుట్టాయని, బీసీలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత ఏంటో సదస్సులో స్పష్టంగా కనిపించిందిని” అన్నారు రాము. “తమకు ఇంతకంటే ఏం కావాలని, బీసీ సోదరులు అనుకునే విధంగా చంద్రబాబు - పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. రూ. లక్షా 50వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ చారిత్రాత్మకం. టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని బీసీ సోదరుల స్థితిగతులు సమూలంగా మారతాయి. బీసీ సోదరుల రాయితీలు తొలగించి, ప్రయోజనాలను హరించిన సీఎం జగన్ ప్రభుత్వం, బీసీలను ఉద్ధరించానని గొప్పలు చెప్పుకుంటోంది. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం” అన్నారు రాము. మొత్తం మీద జయహో బీసీ సదస్సు అధికారపక్షంలో మంటలు పుట్టించిందనే భావన వ్యక్తం అవుతోంది.