ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. పిల్లల్ని కాపాడమంటున్న తల్లులు
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో గంజాయి లభించడంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. ఆంధ్ర యువతను కాపాడుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ యువతను గంజాయి మహమ్మారి పట్టిపీడిస్తోంది. ప్రతి జిల్లాలో కూడా గంజాయి రాక్షసికి బలైన యువత కనపిస్తూనే ఉన్నారు. దాని నుంచి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రమిస్తున్నా ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ఆఖరికి ఈ మహమ్మారి అనేక కళాశాల్లోకి కూడా చొరబడి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని విద్యార్థులు కంటున్న కలలను కూడా పేక మేడల్లా కూల్చేస్తున్నాయి. విద్యార్థులను, కుర్రాళ్లను తన కింద బానిసగా మార్చేసుకుంటుంది. ఇటువంటి ఘటనే తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో తాజాగా వెలుగు చూసింది.
ట్రిపుల్ ఐటీ కళాశాలలో భద్రతా సిబ్బంది చేసిన తనిఖీల్లో ఇద్దరు విద్యార్థుల దగ్గర నుంచి సిబ్బంది.. సిగిరెట్లు, గంజాయి లభించాయి. వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్న సిబ్బంది ఈ విషయాన్ని యాజమాన్యానికి చేరవేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు, నెల్లూరు జిల్లా గూడురు ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఈ నెల 3న కడపకు వెళ్లి రాత్రి సమయానికి తిరిగి వచ్చేశారు. వారి దగ్గరే గంజాయి లభించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, ఏవో రవికుమార్, ఇతర కోర్‌కమిటీ సభ్యులు విద్యార్థులను మందలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. తాజాగా దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ట్రిపుల్ ఐటీలో లభించిన గంజాయికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలను ఆదేశించారు. వారికి గంజాయి ఎవరు అమ్మారు, విక్రయదారులకు సంబంధించిన సమాచారం వారికి ఎలా వచ్చింది? విక్రయదారులకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదెంత పెద్ద ముఠా? వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్తుకు బాసటగా నిలవాల్సిన విద్యార్థుల జీవితాను గంజాయి అనే చీడపురుగు తొలిచేస్తుంటే చూస్తూ ఉరుకునే ప్రసక్తి లేదని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.
నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో రాష్ట్రంలో పెరుగుతున్న గంజాయి వినియోగంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి లభ్యమైన విషయాన్ని కూడా వారే లోకేష్ వివరించారు. తమ పిల్లలను అక్కడ చేర్పించి తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఇడుపులపాయలోని క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఆ దిశగానే తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాలపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోతుందని తల్లిదండ్రులకు హమీ ఇచ్చారు లోకేష్.
తాజాగా గుంటూరో కూడా ఇటువంటి అంశమే గుంటూరు ఎమ్మెల్యే గళ్లా మాధవి దృష్టికి వచ్చింది. గుంటూరు వన్‌టౌన్‌లో నల్లచెరువు ప్రాంతానికి చెందిన మహిళలు.. తమ పిల్లలు గంజాయికి బానిసలయ్యారని ఎమ్మెల్యేకు చెప్పుకంటూ కన్నీమున్నీరయ్యారు. ‘‘మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు. గత ఐదేళ్లలో ఎక్కడంటే అక్కడ గంజాయి లభించడంతో పిల్లలు దానికి బానిసలైపోయారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని మా పిల్లలను కాపాడండి’’ అని తల్లులు ఎమ్మెల్యే మాధవిని వేడుకున్నారు. గుంటూరు 19వ డివిజన్‌లో మంగళవారం ఎమ్మెల్యే మాధవి పర్యటించిన సందర్భంగా ఆమెకు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు తల్లులు. ఈ సందర్భంగా జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తున్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమ్యను పరిష్కరిస్తామని, యువతను గంజాయి బారిన పడకుండా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.