బీజేపీ చెప్పిన భూచట్టం వేరు.. వైసీపీ తెచ్చింది వేరు.. తేడా చెప్పిన మంత్రి
x

బీజేపీ చెప్పిన భూచట్టం వేరు.. వైసీపీ తెచ్చింది వేరు.. తేడా చెప్పిన మంత్రి

ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేని తొందర వైసీపీకి ఏం వచ్చిందని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. బీజేపీ ప్రతిపాదిత చట్టం అసలు వేరేదన్నారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశం ఫలదాయకమైన ఫలితాలను అందించిందని మంత్రి పార్థసారధి వివరించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారాయన. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రజలను భయాందోళనలకు గురి చేసిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చర్చ జరిగిందని, ఈ చట్టం రద్దుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. అనంతరం ఈ చట్టాన్ని తమ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయాలని భావిస్తుందో కూడా చెప్పారు. బీజేపీ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి, వైసీపీ అమలు చేసిన చట్టాన్ని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు

‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల జీవన ప్రమాణాలు ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంటాయి. అందులో భాగంగానే కేంద్రంలోని నీతి అయోగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు ప్రతిపాదనలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు సమాచారం పంపింది. కానీ ఎక్కడా కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పలేదు. బలవంతంచేయలేదు. ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అమల్లో లేదు. అమలు చేయాలన్న ఆలోచనను కూడా సదరు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యక్తం చేయలేదు. పత్రికలు, మీడియా, అనేక మంది మేధావులు ఈ చట్టంపై సందేహాలను వ్యక్తం చేశారు. ఈ చట్టం విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేని తొందల గత ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో తెలియదు. స్టేక్ హోల్డర్లతో కూడా చర్చించకుండా హడావుడిగా ఈ భయంకరమైన చట్టాన్ని అమలు చేసేసింది. ఈ చట్టం కారణంగానే చిన్న సన్నకారు రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు’’ అని చెప్పారు.

అదే విధంగా చాలా మంది ఈ పథకాన్ని తెచ్చింది బీజేపీనే కదా అంటూ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అసలు బీజేపీ ప్రతిపాదించిన చట్టానికి వైసీపీ అమలు చేసిన చట్టానికి అసలు పోలికే లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నీతి అయోగ్ ప్రతిపాదించిన చట్టంలో ఒక ప్రభుత్వ అధికారి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరిస్తారు. కానీ వైసీపీ అమలు చేసిన చట్టంలో ఈ పనిని ఏ అధికారి చేస్తారు అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా ఎనీ సర్సన్ అని అనేశారు. ఈ స్థానంలో ఉండే అధికారికి అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. అతడు కోర్టులకు వెళ్లకుండా చట్టం కూడా తెచ్చారు. బీజేపీ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. భూ వివాదాలను తగ్గిస్తే.. వైసీపీ అమలు చేసిన చట్టం మాత్రం భూ వివాదాలు విపరీతంగా పెంచేలా ఉంది’’ అని వివరించారాయన.

ధ్వంసమే లక్ష్యం

‘‘రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వ్యవస్థలను, ల్యాండ్ రికార్డులను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసేలా ఈ చట్టాన్ని వైసీపీ తీసుకొచ్చింది. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్థలం ఒరిజినల్ పట్టా ఇవ్వమని జిరాక్సులు ఇస్తామని అనడంతో.. ప్రభుత్వం తమ ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకుంటుందేమో అని ప్రజలు బెంబేలెత్తారు. ఇదే చట్టం ఇంకా ఉండి ఉంటే ఇప్పటికే గిఫ్ట్ డీడ్స్, మార్టిగేజ్ డీడ్స్‌ను రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అందులో పొందుపరిచారు. ఆ చట్టం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారని మా ప్రభుత్వం గుర్తించే దీనిని రద్దు చేశారు సీఎం చంద్రబాబు’’ అని చెప్పుకొచ్చారు.

Read More
Next Story