
శంఖారావం సభలో నారా లోకేశ్
రెడ్ బుక్.. మొదటి పేరు మంత్రి పెద్దిరెడ్డిదే.. !
టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే మొదట జైలుకు వెళ్ళేది మంత్రి పెద్దిరెడ్డి. అందులో సందేహం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.
ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఆ కోవలో... టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, వారి కుమారుడు అనంతపురం జిల్లాల్లో గురువారం పర్యటనలు ప్రారంభించారు.
రెండో విడత శంఖారావం..
రాయలసీమలో రెండో విడత శంఖారావం సభలు అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం ప్రారంభించి లోకేశ్ మాట్లాడారు. తన రెడ్ బుక్‌లో నమోదు చేసుకున్న పేరును మొదటిసారి ప్రస్తావించారు. "చట్టాలు ఉల్లంఘించి, కొండలు గుట్టలు లేపేసిన వారిలో మొదట జైలుకు వెళ్లేది రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి" అందులో ఎలాంటి డౌట్ లేదు అని నారా లోకేష్ హెచ్చరించారు. రెడ్ బుక్ వ్యవహారం దేశంలోనే ఫేమస్ అయిందని అన్నారు. న్యాయస్థానం వరకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు పట్టిన క్యాన్సర్ అని అన్నారు.
పీఎల్‌ఆర్ లారీల్లో ఇసుక, మద్యం ఇష్టానుసారంగా తరలించేస్తున్నాడని. ఆయన దోపిడీకి అంతం లేకుండా పోయిందంటూ అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి పట్ల జాగ్రత్తగా ఉండాలని నారా లోకేష్ హెచ్చరించారు. "మా పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బంది పెట్టిన మంత్రులను వదిలేది లేదు. చట్టాలు ఉల్లంఘించిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ జరిపి, డిస్మిస్ చేయడంతో పాటు జైలుకు పంపుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునరుద్ఘాటించారు.
కేసులు మాఫీ
తమ కార్యకర్తలపై బానాయించిన కేసులన్నీ అక్రమమైనవని, ప్రభుత్వం ఏర్పడగానే అన్ని కేసులు మాఫీ చేయిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఎక్కువ కేసులు నమోదైన నాయకులకు ప్రభుత్వం ఏర్పడగానే పెద్ద నామినేటెడ్ పోస్ట్ కూడా ఇస్తామని ఓ వింత ఆఫర్ ఇచ్చారు. " నాపై ఎన్నో కేసులు పెట్టారు. అందులో అటెంప్ట్ టు మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది" అయినా ఏమి పీకలేరు అని కార్యకర్తలకు ధైర్యం చెప్పే రీతిలో నారా లోకేష్ అన్నారు.
మళ్లీ జేబి కమిటీల మాదిరే..
గతంలో అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీని భారీగా దెబ్బతీసిన జన్మభూమి కమిటీల తరహాలోని ఇంకొక కమిటీ వస్తుందా? మళ్లీ ఆ కమిటీ అధ్యక్షులే కీలకపాత్ర పోషించబోతున్నారా అంటే.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పిన మాటలు నిజమనే అంటున్నాయి.
ఎన్నికల వరకు క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు చురుగ్గా పనిచేయాలని నారా లోకేష్ హిందూపురంలో సూచించారు. ఆ కమిటీకి కేటాయించిన 500 ఇళ్లకు పార్టీ కిట్ అందే విధంగా చూడాలన్నారు. అందులో సూపర్ సిక్స్ మేనిఫెస్టో బ్రోచర్, క్యాలెండర్ ఉన్నాయి. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకు ఉత్తమ కార్యకర్త సర్టిఫికెట్ అందిస్తామన్నారు. పార్టీ ఎమ్మెల్యే నుంచి అధ్యక్షుడు వరకు ఈ కార్యకర్తను కలిసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చూసుకోవాల్సి ఉంటుందని కార్యాచరణ ప్రకటించారు.
కర్నూలులో చంద్రబాబు సతీమణి..
"నిజం గెలవాలి" పేరిట రెండు రోజుల కార్యక్రమాన్ని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అనంతపురం జిల్లాలో పర్యటన ప్రారంభించారు. శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు తన భర్త ఎన్ . చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతి చెందినపత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.
Next Story