హ్యాట్రిక్‌కు.. అసమ్మతి పొగ..!
మూడోసారి గెలవాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉవ్విళ్లూరుతున్నారు. కొత్త వ్యూహంతో అసమ్మతి వర్గం ఆమెకు ముల్లులా మారారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: పార్టీని వదలరు. అందరూ పార్టీ వైఎస్ఆర్‌సీపీ విధేయులే. అభ్యర్థికి మద్దతు ఇవ్వరు. ప్రచారానికి కూడా రారు. ఈ అసమ్మతి సెగ చల్లారలేదు. ఇది కాస్తా ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని సాగుతున్న నగరి ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు కంటిలో నలుసుగా మారారు. ఆ అసమ్మతి వర్గ నేతల సహచరులు, మద్దతు దారులు టిడిపి అభ్యర్థికి అండగా నిలుస్తున్నారు. జిల్లా మొత్తం సారథ్యంలో పెద్దన్నగా నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయంలో మాత్రం చోద్యం చూస్తున్నట్లు కనిపిస్తోంది. అసమ్మతి రాగం ఆలపిస్తున్న నగరి నియోజకవర్గంలోని నాయకులందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వైఎస్ఆర్సిపిలోకి వచ్చిన వారే కావడం ప్రస్తావనార్హం.
దక్షిణాది దృష్టి సీమ వైపే..
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంపై దృష్టి కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపక్ష టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అందరికీ భిన్నంగా ఇద్దరు ప్రముఖ నటులు రాయలసీమ జిల్లాల నుంచే పోటీలో ఉన్నారు. వారిలో ఒకరు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినిమా కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. సినిమా కథానాయకి, జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరికీ చిరపరిచితంగా మారిన ఆర్కే రోజా సెల్వమణి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో..
ఆగని అసమ్మతి బుసలు..!
మరో ఐదు వారాల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు తుది అంకం ముగియనున్నది. అయినా, నగరి నియోజకవర్గంలో బుసలు కొడుతున్న అసమ్మతి, ఆగ్రహావేశాలు చల్లారటం లేదు. ఈ పరిస్థితుల్లో అంతర్గత కుమ్ములాటను అధికమించి హ్యాట్రిక్ సాధించాలన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా లక్ష్యం ఎలా నెరవేరుతుంది అనేది సర్వత్రా వినిపిస్తున్న చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో రెండోసారి నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే రోజా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కీలకమైన సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన, సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా నగరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్.. మండలం నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, విజయపురంలో లక్ష్మీపతి రాజు, ఉడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరు మున్సిపల్ నేత ఏలుమలై (అమ్ములు) మూకుమ్మడిగా ఆర్కే రోజాను వ్యతిరేకిస్తున్నారు. వీరిలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా చక్రపాణి రెడ్డి, వేదిక కార్పొరేషన్ చైర్పర్సన్‌గా కేజే. శాంతి ప్రోటోకాల్‌తో పాటు క్యాబినెట్ ర్యాంకు స్థాయి పదవుల్లో ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరికి వారు అన్ని మండలాల్లో ప్రభావితం చేయగలిగిన స్థాయి కలిగిన నాయకులతో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సఖ్యత లేకుండా పోయింది.
అందుకు ప్రధాన కారణం..
రెండు ఎన్నికల్లో తనకు అండగా నిలిచి, విజయ సోపానానికి కారకులైన వారిని ఉపేక్షించడం. టిడిపి నుంచి వచ్చిన కొందరిని అక్కున చేర్చుకోవడం మరో కారణం అని చెప్తారు. అదే సందర్భంలో తన సోదరులు ఇద్దరి పెత్తనం, భర్త సెల్వమణి మితిమీరిన జోక్యం వల్ల నియోజకవర్గంలోని నాయకులకు ఎమ్మెల్యే రోజా దూరమైనట్లు అనేక సంఘటనలు స్పష్టం చేస్తాయి. ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరులు, ఇతరత్రా కార్యక్రమాల్లో అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి. ఇసుక వ్యాపారం ఒకపక్క, పనుల కేటాయింపులు మరోపక్క సోదరులు భర్త జోక్యం పార్టీ నాయకులకు కంటగింపుగా మారినట్లు స్థానికులు చెప్పే మాట. ఈ పరిస్థితుల కారణంగా, గడిచిన ఐదేళ్ల కాలంలో మండలాల్లోనే కీలక నాయకులతో ఎమ్మెల్యే రోజాకు ఎడతెగని అంతరం ఏర్పడింది.
పై చేయి సాధించిన రోజా..
నగరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎవరికైనా టికెట్ ఇవ్వాలని అసమ్మతి వద్ద నేతలు వైఎస్ఆర్సిపి అధినాయకులకు సూచనతో కూడిన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఆమెకే టికెట్ ఇస్తే, ఓటమికి తమ బాధ్యత కాదని కూడా తెగేసి చెప్పారు. వీటన్నిటిని ఏమాత్రం ఖాతరు చేయని స్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆర్కే రోజాకు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. దీని ద్వారా ఆర్కే రోజా అసమ్మతి వర్గంపై పై చేయి సాధించినట్లు కనిపిస్తుంది. తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో నగరి నుంచి వెళ్లిన నాయకులు... అసంతృప్తితోనే వెనుతిరిగారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా, జీర్ణించుకోలేని వైఎస్ఆర్సిపి అసమ్మతి వర్గ నాయకులు ఆలోచన సరళని మరో రూపంలో అమలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
మద్దతు లేదు.. ప్రచారానికి వెళ్లరు..!
ఐదు మండలాల కీలక నాయకులు చెబుతున్న మాటలు పార్టీ అధిష్టాన వర్గం పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. అందువల్లే అసమ్మతి వర్గం నాయకులు తమ ఆలోచనలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించిన వేళ, ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు నియోజకవర్గంలో పరిస్థితి చెప్పకనే చెబుతోంది. అదే క్రమంలో రోజా కూడా వీరిని వచ్చి కలవడానికి కూడా సుముఖత చూపడం లేదని అంటున్నారు. ప్రధాన నాయకులు ఎవరికి వారు తమ కార్యక్రమాలకు పరిమితం కావాలని! ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వాతావరణం కనిపిస్తుంది.
తిరుగుబాటు ధోరణిలో ఉన్న నాయకులు పార్టీకి దూరం కాకుండానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. బయటికి మాత్రం వెళ్లడం లేదు. రోజాను కలవడానికి సుతారము ఇష్టపడడం లేదు. తమ విధేయులు, అనుచరులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వారంతా ప్రశాంతంగా ఉన్నారు చోద్యం. " కొట్టరు.. తిట్టరు.. విమర్శించరు.. సైలెంట్‌గా ఉంటారు" ఈ సూత్రాన్ని అమలు చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలనే దిశగా సాగుతున్నట్లు సమాచారం. దీనివల్ల వైఎస్ఆర్సిపి అభ్యర్థిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. కొందరు నాయకులు తమ అనుచరులను పరోక్షంగా టిడిపి అభ్యర్థి వైపు మొగ్గు చూపించడానికి పురమాయించినట్లు సమాచారం. అయితే..
పెద్దిరెడ్డి మౌనం వెనుక...
రాయలసీమ జిల్లాలోనే కాదు. రాష్ట్రంలో అనేక జిల్లాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ట్రబుల్ షూటర్స్‌గా మారారు. చిత్తూరు జిల్లా రాజకీయం మొత్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో నడుస్తుంది. నగరి నియోజకవర్గ వ్యవహారంపై మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. నగరి అసంతృప్తి నాయకులను తాడేపల్లి పిలిపించినప్పుడు ఆయన నామమాత్రపు పాత్ర పోషించారని సమాచారం. నగరిలో ఆగ్రహంగా ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వైఎస్ఆర్సిపిలోకి చేరిన వారే. ఈ ఎపిసోడ్‌లో మంత్రి పెద్దిరెడ్డి మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ప్రత్యర్థి పార్టీలు సులువుగానే అవగతం చేసుకుంటున్నట్లు రాజకీయ పరిస్థితి కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా రాజకీయాన్ని కనుసైగలతో శాసించే స్థాయిలో ఉన్న పెద్దిరెడ్డి నగరి రాజకీయాన్ని ఉపేక్షించడం వెనుక మర్మం ఏమిటి అనేది కూడా చర్చకు ఆస్కారం కల్పిస్తోంది.
అందరూ కలిస్తేనే అంతంత... మెజారిటీ
నగరి నియోజకవర్గంలో రాజకీయ దిగ్గజాలు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రెడ్డి వారి రంగారెడ్డి, టిడిపి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా 2014లో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్‌పై విజయం సాధించారు. ఈ విజయం వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన వెంట నడిచే ప్రస్తుత అసమ్మతి వర్గ నాయకులు అందరూ సమష్టిగా పని చేశారు. ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో నుంచి 2014లో 858 ఓట్లు, 2019లో 2,007 ఓట్లతో ఆర్కే రోజా గట్టెక్కారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సమీకరణలు, పోల్ మేనేజ్మెంట్ నిర్వహించే సత్తా కలిగిన నాయకులందరూ దూరంగా ఉన్న నేపథ్యంలో ఆర్కే రోజాకు నగరిలో ఎన్నికలు ముళ్ళబాటగానే మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారం కాస్తా టిడిపికి అనుకూలంగా మారే వాతావరణం లేకపోలేదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా శుభ ముహూర్తం చూసుకున్న మంత్రి ఆర్కే రోజా రెండు రోజుల కిందట నియోజకవర్గానికి వడమాలపేట, పుత్తూరు సమీపంలో నుంచి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేళ్ళ మీద లెక్కించే స్థాయిలోనే కార్యకర్తలు హాజరైనట్లు చెబుతున్నారు. ప్రధాన నాయకులు ఎవరూ ఇందులో భాగస్వామ్యం కాలేదని సమాచారం. ఎన్నికల కోడ్ రాకముందే తాయిలాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా.. రంజాన్ మాసాన్ని కూడా మిగతా వారి మాదిరిగానే తనకు అనుకూలంగా మార్చుకునే దిశలో ఆదివారం ముస్లింలకు పుత్తూరులో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు.
గాలి… వీస్తుందా..!
నగరి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సిపిలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రతిపక్ష టిడిపికి లాభించే వాతావరణం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. గాలి భాను ప్రకాష్‌కు నియోజకవర్గంలో వ్యతిరేకత లేదు. టిడిపి శ్రేణులను సమీకరించుకునే దిశలో ఆయన పయనిస్తున్నారు. పార్టీలో ఆయనకు అంతర్గత కుమ్ములాటలు లేకున్నా, మన కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు వెంట ఉన్న పుత్తూరు ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్ రాజు బయటికి వెళ్లారు. టిడిపి నుంచి ఆయన బిజెపిలో చేరారు. ఇది మినహా టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌కు అంతర్గత కొమ్ములాటలు, పార్టీ శ్రేణులతో విభేదాలు లేకపోవడం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు.