నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు మంత్రి ఆదేశాలు
x

నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు మంత్రి ఆదేశాలు

విజయవాడ ప్రాంతంలో డయేరియా ప్రబలడంపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులతో సమావేశమయ్యారు.


రాష్ట్రంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. జగ్గయ్యపేటలో డయేరియా కేసులు అధికంగా నమోదు కావడంపై ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. మంత్రి ఆదేశాలతో సమావేశానికి హాజరు కావడానికి అధికారులంతా పరుగుపరుగున జగ్గయ్యపేట చేరుకున్నారు. మంత్రి సత్యకుమార్‌తో అక్కడి పరిస్థితులపై చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు మంత్రి సత్యకుమార్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో, సీజనల్ వ్యాధులను కట్టడిచేయడంలో నిర్లక్ష్యం వద్దని, అలసత్వం కనబరిచిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో ఎన్‌టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ సుహాసిని కూడా పాల్గొన్నారు.

ఆందోళన అక్కర్లేదు

జగ్గయ్యపేటలో డయేరియా కేసులు అధికంగా నమోదు అవుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని డాక్టర్ సుహాసిని వివరించారు. మంత్రి ఆదేశాల మేరకు తాము జగ్గయ్యపేటలో సందర్శించి అక్కడి పరిశుభ్రత, వైద్య సేవలు వంటి పలు అంశాలను పరిశీలించామని ఆమె చెప్పారు. అక్కడ డయేరియా నివారణ చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. దాంతో పాటుగా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామని, అక్కడి ప్రతి ఒక్కరికీ ప్రథమ చికిత్సతో పాటు, కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఆ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ

‘‘అనుమంచిపల్లి , బోదవాడ, జగ్గయ్యపేట టౌన్, షేర్ మహమ్మద్ పేట ప్రాంతాల్లో కొందరు విరోచనాలతో బాధపడుతున్నారు. వారంతా వెంకట సన్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఆమె తెలిపారు.

అదుపులోనే పరిస్థితులు: ఎమ్మెల్యే

జగ్గయ్య పేట ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కూడా పర్యటించారు. అక్కడ డయేరియా ప్రబలడంపై అధికారులను ఆరా తీశారు. ప్రజలకు వైద్య సేవలు అందుతున్న తీరు, అక్కడి పరిసరాల పారిశుధ్యం వంటి పలు అంశాలను పరిశీలించడమే కాకుండా ప్రజలను కూడా అడిగి తెలుసుకున్నారు. డయేరియా పెద్ద సమస్య కాకూడదని, కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఔషదాల స్టాక్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ అవసరమైన ఔషదాలను తెప్పించుకోవాలని, ప్రజలకు బయటి మందులు రాసి ఇవ్వొద్దని, ప్రభుత్వం అందిస్తున్న మందులే అందివ్వాలని ఎమ్మెల్యే శ్రీరామ్ వివరించారు.

సీజనల్ వ్యాధులపై డిప్యూటీ సీఎం ప్రత్యేక సమీక్ష

వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న సీజనల్ వ్యాధుల కేసులపై డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా సీజనల్ వ్యాధులు పెద్ద సమస్య కాకూడదని, మారుమూల ప్రాంతాల్లో కూడా వాటికి సరైన, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు పవన్ కల్యాణ్. ఇప్పటికే అధికంగా వస్తున్న సీజనల్ వ్యాధులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై పవన్ కల్యాణ్.. అధికారులను నిలదీశారు. వరుస ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసి మూడు చెరువుల నీళ్లు తాపించారు. ‘‘స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వలేదు? ఆర్థిక సంఘం, స్థానిక సంస్థలకు చెందిన నిధులను ఎంత మేరకు సీఎఫ్ఎంఎస్ ఖాతాకు మళ్లించారో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలి. తాగునీటి సరఫరాలో లోపాల వల్లే విజయవాడ ప్రాంతాల్లో డయేరియా ప్రబలం అవుతుంది. సీజనల్ వ్యాధుల కట్టడికి నియంత్ర విధానాన్ని అమలు చేసేలా వెంటనే కార్యాచరణను సిద్ధం చేయాలి’’ అని అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.

Read More
Next Story