మునిసిపల్ శాఖ మంత్రి సురేష్ కనిపించడం లేదని ఆయన నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంలో గోడలపై పోస్టర్లు వెలిశాయి. ఓటర్లు రాజకీయ బదిలీలపై సెటైర్లు ఎలా వేస్తున్నారో చూడండి.
ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో రాజకీయ బదిలీలు ఎప్పుడూ చూడలేదు. ముఖ్య నాయకులైతే ఎక్కడి నుంచైనా పోటీ చేయడాన్ని చూశాం. ఎప్పుడూ కనిపించని వ్యక్తులు హటాత్తుగా కనిపించి పోటీలో ఉండడాన్ని ఇప్పుడు చూస్తున్నాం. రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటున్నాయో వచ్చే ఎన్నికలే ఉదాహరణ. గతంలో స్థానికులైనా ప్రజలకు మంచి చేయలేరని భావిస్తే తిరస్కరించే వారు. ఇప్పుడు అలా కాదు. ఓటుకు ఎంత డబ్బు ఇచ్చారనేదే కొలమానం. లేదంటే నాయకుడు ఎవరైనా ఓటమి చవిచూడాల్సిందే.
రాజకీయ బదిలీలపై సెటైర్లు
రాజకీయ బదిలీలకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టింది. దీంతో మంత్రులు, కొంత మంది ఎమ్మెల్యేలు తన నియోకవర్గాన్ని వదిలి మూడు నెలలుగా బదిలీ అయిన నియోకర్గంలో ఉంటున్నారు. అక్కడే ప్రచారం ఇటీవల మొదలు పెట్టారు. ఉదాహరణకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన మేరుగు నాగార్జున మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయనను అక్కడి నుంచి సంతనూతలపాడుకు బదిలీ చేసింది వైఎస్సార్‌సీపీ. దీంతో ఆయన వేమూరు నుంచి మకాం మార్చి సంతనూతలపాడులో మకాం పెట్టారు. అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గానికి ఆయన బదిలీ జరిగింది. దీంతో ఆయన కొండపికి ఎర్రగొండపాలెం నుంచి మకాం మార్చారు.
తాము గెలిపించిన సురేష్ తమకు కనిపించడం లేదంటూ ఎర్రగొండపాలెంలో పోస్టర్లు వెలిశాయి. ఓటర్లకు కోపం వచ్చిందో, ప్రత్యర్థులు కావాలని చేశారో తెలియదు కాని సురేష్ కనిపించడం లేదు. వెతికి పెట్టాలంటూ పోస్టర్లు వేశారు. ఇప్పుడు ఈ అంశం కొత్తగా తెరపైకి రావడంతో రాజకీయ నాయకులు ఏడ్వాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.
నోటిఫికేషన్‌కు ముందే మారిన సీన్..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత అభ్యర్థి మార్పు జరిగితే తప్పకుండా ఆ నియోకవర్గాన్ని వదిలి తనకు కేటాయించిన నియోజకవర్గంలోకి వెళ్లొచ్చు. అలా కాకుండా మూడు నెలల ముందు నుంచే వేరే నియోకవర్గంలో తిరుగుతూ స్థానిక నియోజకవర్గలలో కనిపించకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపంలో భాగంగానే పోస్టర్లు వెలిసినట్లు పలువరు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సురేష్ మంత్రి కూడా కావడం వల్ల ఆయనను కలవాలంటే కొన్ని సెక్యూరిటీ ఇబ్బందులు ఉంటాయి. అదే ఎర్రగొండపాలెంలో ఉంటే క్యాంపు కార్యాలయంలో ఏదో ఒక సమయంలో కలవొచ్చు. అలా కాకుండా కొండపిలో ఉండటం వల్ల స్థానికులు జీర్ణించుకోలేక పోస్టర్లు వేశారని స్థానికులు అంటున్నారు.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాజకీయ బదిలీల వ్యవహారం చర్చకు తావిచ్చింది. స్థానికులను ఎన్నుకున్నా, స్థానికేతరులను ఎన్నుకున్నా ఐదేళ్లు సక్రమంగా మన వద్ద ఉంటారన్న నమ్మకం లేదని ఓటర్లు వ్యాఖ్యానించడం విశేషం.
Next Story