జగన్ వ్యాఖ్యలపై కూటమి మంత్రుల మండిపాటు..
x

జగన్ వ్యాఖ్యలపై కూటమి మంత్రుల మండిపాటు..

అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటన విషయం కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూటమి మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తప్పుబట్టారు.


అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటన విషయం కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూటమి మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తప్పుబట్టారు. అచ్యుతాపురం ప్రమాదాన్ని రాజకీయం చేయడానికి జగన్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారంటూ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పదవి పోయినా జగన్ తన తప్పుడు ప్రచారాలను ఆపడం లేదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి మానుకుంటే జగన్‌కే మంచిదని హితవు కూడా పలికారు. మాజీ సీఎం జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, అచ్యుతాపురం ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ప్రభుత్వం స్పందించి బాధితులకు అన్ని విధాలా సహకారం అందించిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. వారి ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలకు ఈ ప్రమాదం ఒక నిదర్శనం అవుతుందని, పరిశ్రమల నుంచి డబ్బులు దండుకుని వారు నిబంధనలను పాటిస్తున్నారో లేదో పట్టించుకోకుండా ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కదా అంటూ విరుచుకుపడ్డారు. ఆయన అబ్బదాలు నమ్మమని ముఖంపై కొట్టినట్లు 11 సీట్లకే పరిమితం చేసినా జగన్‌కు బుద్ది రాలేదంటూ ఎద్దేవా చేశారు.

జగన్ అలా ఎలా అంటారు?

‘‘అచ్యుతాపురం బాధితులు ప్రతి ఒక్కరికీ పరిహారం అందిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలాంటప్పుడు ధర్నా చేస్తానంటూ జగన్ ప్రకటించడం దేనికి సంకేతం? ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. అంబులెస్తులు పరుగులు తీశాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందింది. ప్రభుత్వం ఇంతా చేస్తూ బాధితులకు అంబులెన్సులు కూడా అందలేదని, కనీస సాయం కూడా ఆసుపత్రి దగ్గర వారికి అందలేదంటూ జగన్ ఎలా మాట్లాడతారు?’’ అంటూ ప్రశ్నించారు.

గప్పాలు చెప్పుకోవడం కాదు..

ఎల్‌జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తమ ప్రభుత్వం ఆఘమేఘాలపై సహాయక చర్యలు అందించిందని, బాధిత కుటుంబాలకు 24 గంటల్లోనే రూ.కోటి పరిహారం అందించిన తొలి ప్రభుత్వం తమదేనంటూ జగన్ చెప్పిన అంశాలపై అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. ‘‘ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులకు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. దుర్ఘటన జరిగిన 15 రోజుల తర్వాత మరణించిన ముగ్గురు బాధ్యులకు రూ.లక్ష పరిహారంతో సరిపెట్టిన విషయం వాస్తవం కాదా? ఎల్‌జీ పాలిమర్స్ బాధ్యులను ఆదుకోవాలని నిరసించిన 30 మందిపై గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది జగన్ కాదా?’’ అని నిలదీశారు. వైసీపీ హయాంలో పరిహారం పొందాలంటే రోడ్డెక్కాల్సిందే అన్న పరిస్థితి వాస్తవం కాదా? రోగులకు అంబులెన్స్‌లు అందని కారణంగా బైకులపై ఆసుపత్రులకు తరలించిన ఘటనలకు లెక్కే లేదన్నది నిజం కాదా అంటూ అచ్చెన్నాయుడు ఘాటుగా బదులిచ్చారు.

జగన్ చర్యలు సిగ్గు చేటు: కొల్లు రవీంద్ర

అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలపై గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘటనను జగన్ రాజకీయం చేయాలనుకోవడం అత్యంత హేయమైన చర్య అంటూ విమర్శలు గుప్పించారు. బాధితులను పరామర్శించిన సందర్భంగా ఎవరైనా రాజకీయ విమర్శలకు పాల్పడతారా? ఆమాత్రం ఇంగిత జ్ఞానం కూడా జగన్‌కు లేదా? అంటూ మండిపడ్డారు. జగన్ అక్కడకు బాధితులను ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి వెళ్లారా.. వారి పరిస్థితిని అడ్డుపెట్టుకుని తన రాజకీయ మైలేజీని పెంచుకోవడానికా? అంటూ ప్రశ్నించారు. అదే విధంగా ప్రమాదం జరిగిన గంటల తర్వాత కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందంటూ జగన్ చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని కూడా తేల్చి చెప్పారు.

‘‘ప్రమాదం జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అని, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. అధికారులను వెంటనే ఘటన స్థలానికి వెళ్ళాలని, బాధితులకు అవసరైన వైద్య సదుపాయాలు సమకూర్చాలని ఆదేశాలిచ్చారు. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వాలని చెప్పారు’’ అని రవీంద్ర వెల్లడించారు. అంతేకాకుండా బాధితులకు ధైర్యం చెప్పాల్సన చోట జగన్ రాజకీయాలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని, అదే విధంగా బాధితుల దగ్గరకు వెళ్లి వెకిలి నవ్వులు నవ్వడం అత్యంత నీచంగా ఉందంటూ కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Read More
Next Story