
మద్యం కేసులో పొడి పొడి జవాబులు ఇస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం దర్యాప్తు ఊపందుకుంది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం దర్యాప్తు ఊపందుకుంది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు. ఏప్రిల్ 18న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుకాగా ఏప్రిల్ 20న వైసీపీ ఎంపీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మిథున్ రెడ్డి (Mithun Reddy) హాజరయ్యారు. విజయవాడలో సిట్ కార్యాలయానికి ఆయన ఇవాళ ఉదయం వచ్చారు. అనంతరం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
మద్యం కుంభకోణం కేసులో ఓ సాక్షిగా నిన్న విజయసాయి రెడ్డి హాజరు అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు.దర్యాప్తు అధికారులు 20కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ఈ కుంభకోణం వెనకున్న సూత్రధారులు, పాత్రధారుల వివరాలపై ప్రశ్నించగా పొడిపొడిగా జవాబులు చెప్పారు. మద్యం వ్యవహారంతో తనకెలాంటి సంబంధమూ లేదని.. ఏదైనా సరే రాజ్ కసిరెడ్డిని అడగాలంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి సమాధానాల పట్ల సిట్ అసంతృప్తిగా ఉంది. మరోసారి నోటీసులిచ్చి ఆయన్ను విచారణకు పిలవనున్నట్లు సిట్ అధికారులు చెప్పారు.
ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అదే తరహాలో సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం. తెలియదు, గుర్తులేదు అంటూ పొడిపొడిగానే జవాబులు ఇస్తున్నారని తెలిసింది.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిపించారు.
మద్యం కుంభకోణంలో అనుచిత లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక రాజ్ కసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి చెప్పారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో మిథున్ రెడ్డి ఇప్పటికే సుప్రింకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. అందువల్ల ఆయన అరెస్ట్ భయం లేదు.
Next Story