సీఎం చంద్రబాబు తెచ్చిన ఇసుక పాలసీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బొత్స, ఇదేం ఇసుక పాలసీ అని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ ఏమీ బాగ లేదని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంలో ఎలాంటి స్పష్టత లేదంటూ పెదవి విరిచారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ నూతన ఇసుక పాలసీ, ఉచిత అని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో పారదర్శకత లోపించిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా, ఇసుకపై సరైన విధానమంటూ లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వైపు ఉచిత ఇసుక అని భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నేతలు మాత్రం ఇసుకను యధేచ్ఛగా దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 117 రోజులు గడుస్తున్నా, నేటికీ భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని, దీనికి కారణం సీఎం చంద్రబాబు ప్రభుత్వ విధానమే కారణమని ఆరోపించారు. ఇసుకపై ఆధారపడిన వారంతా పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.