ప్రొటోకాల్ బ్రేక్ చేసిన మోడీ.. ‘మీకేమైనా అయితే తట్టుకోలేం’
ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రోటోకాల్‌ను బ్రేక్ చేశారు. లైటింగ్ టవర్లు ఎక్కిన అభిమానులను హెచ్చరించడానికి పవన్ ప్రసంగాన్ని అడ్డుకున్న మోడీ.
ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఏపీ రాజకీయం మరింత ఊపందుకుంది. అన్ని పార్టీలు తమ ప్రచార రథాలను కదిలించి జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు ఆచితూచి తమ ప్రసంగాలను ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చిలకలూరిపేటలో నిర్వహించిన సభ నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. పదేళ్ల తర్వాత మళ్ళీ ఒకే వేదికపైన ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆశీనులైనారు. ఈ సభను పవన్ తన ప్రసంగంతో ప్రారంభించారు. పవన్ రెట్టించిన ఆవేశంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే పవన్ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ మధ్యలో జోక్యం చేసుకున్నారు. తన సీటు నుంచి లేచి వచ్చి పవన్‌ను పక్కకు పంపి మైక్ తీసుకున్నారు. అందుకు ఒక బలమైన కారణం ఉంది.
ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ప్రధాని
‘ప్రజాగళం’ సభలో పవన్ ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకుని ప్రధాని మోడీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. అయితే సభలో కొందరు యువకులు లైట్లు ఏర్పాటు చేసిన టవర్ల మీదకు ఎక్కారు. అది గమనించిన ప్రధాని వెంటనే పవన్ వద్దకు వచ్చి మైక్ తీసుకున్నారు. లైటింగ్ ఫ్రేమ్స్ ఎక్కిన వారు వెంటనే దిగాలని, పోలీసులు వెంటనే స్పందించాలని ప్రధాని మోడీ కోరారు. ఈ సభలో ప్రధాని మోడీ చేసిన చర్య అందరి దృష్టిని ఆకర్షించింది.
మీకేమైనా అయితే తట్టుకోలేం
లైటింగ్ టవర్స్‌పైకి ఎక్కిన వారు వెంటనే దిగాలని కోరుతున్న క్రమంలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పోల్స్‌పై కరెంటు తీగలు ఉన్నాయని, వాటిపైకి ఎక్కడం ప్రమాదకరమని తెలిపారు. ‘‘లైటింగ్ టవర్లు, బ్యారికేడ్లు ఎక్కిన వారు వెంటనే కిందకు దిగాలి. మీ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేం. ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలు ఏమీ చేయొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా. అందరూ లైటింగ్ టవర్లపై నుంచి కిందకు దిగండి. ఇలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోండి. ఎవరికీ ఏమీ కాకూడదు’’ అని మోడీ అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాగా మోడీ అభిమానులు మాత్రం ‘దట్ ఈజ్ మోడీ’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు హోరెత్తిస్తున్నారు.
Next Story