మోదీ విజయవాడ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
x

మోదీ విజయవాడ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అటువంటి మోదీ రేపటి షెడ్యూల్ ఎలా ఉందంటే..


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడీ పెరిగింది. ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీల అధినేతలు స్పీడు పెంచారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ కూడా పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన సోమవారం.. రాజమండ్రిలో ప్రచారం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో కూడా మోదీ పాల్గొని ప్రసంగించారు. అయితే ఆయన బుధవారం రోజున విజయవాడలో పర్యటించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. సాయంత్రం 6-8 గంటల సమయంలో విజయవాడలో నిర్వహించే రోడ్‌లో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగం కూడా ఇస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నామని, పార్కింగ్ స్థలాలను కూడా సిద్ధం చేశామని విజయవాడ పోలీసులు వివరించారు.

రెండు కిలోమీటర్ల మేరా రెడ్ జోన్

ప్రధాని మోదీ పర్యటనకు రానున్న నేపథ్యంలో విజయవాడలో రెడ్ జోన్ అమలు చేయాలని సీపీ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు, ఓల్డ్ పీసీఆర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రెడ్ జోన్‌లను అమలు చేయనున్నారు. ఈ మార్గానికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రెడ్ జోన్ అమలవుతుందని సీపీ వెల్లడించారు. ఈ రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో డ్రోన్‌లు, బలూన్‌లు కూడా ఎగరవేయకూడదని, ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రధాని మోదీ.. రోడ్ షో నిర్వహించనున్న 1.3 కిలోమీటర్ల మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేస్తున్నామని పోలీసులు వివరించారు.

ఇదిలా ఉంటే రేపు ఉదయం ప్రధాని మోదీ తెలంగాణ వేములవాడలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బండిసంజయ్‌కి మద్దతుగా జరగనున్న ఈ సభ పూర్తిచేసుకున్న అనంతరం మోదీ.. వరంగల్‌కు వెళ్లి అక్కడ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌ తరపున ప్రచారం చేయనున్నారు. అది పూర్తయిన వెంటనే తిరిగి బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు ప్రయాణించనున్నారు. విజయవాడలో 1.3 కిలోమీటర్ల రోడ్‌షోను నిర్వహించనున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారాలపై మోదీ ప్రత్యేక దృష్టిసారించారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

Read More
Next Story