ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన అట్టహాసంగా మొదలై సానుకూల సందేశంతో ముగిసింది. ఘన స్వాగతాలు, భక్తిప్రపత్తులు, పూజలు, పరస్పర పొగడ్తలు, జీఎస్టీ బంపర్ ఆఫర్లు, పాత పథకాలకు ప్రారంభోత్సవాలు, అంకితాలు, కొత్తవాటికి శంకుస్థాపనలు, భారత్ మాతాజీ జై వంటి సమైక్యతా నినాదాలతో మోదీ పర్యటన ముగిసింది. సుమారు 7 గంటల పాటు సాగిన నరేంద్ర మోదీ పర్యటనలో ఆది నుంచి అంతం వరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్ షో కనపడింది.
ఇలా మొదలైంది టూరు..
కర్నూలు విమానాశ్రయంలో అడుగిడింది మొదలు తిరిగి ఢిల్లీకి పయనం అయ్యేంత వరకు ప్రధానికి అడుగడుగునా ఘన స్వాగతాలు, అభిమానుల కేరింతలు, నాయకుల పులకరింతలతో సాగింది. కర్నూలు జిల్లాను ప్రత్యేకించి శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ప్రధానుల్లో మోదీ నాలుగో వారిగా చరిత్రపుటల్లోకి ఎక్కడం ఓ రికార్డు.
ఇక, ఈ పర్యటన ఎన్డీఏ కూటమి ఐక్యతను చాటేందుకు బాగా ఉపయోగపడింది. ఈ మొత్తం షో కి నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఆద్యులు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు మోదీ పర్యటన ఊపు ఇచ్చినా రాయలసీమ పాత డిమాండ్లైన హైకోర్టు బెంచ్ ఏర్పాటు, జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన నీటి ప్రాజెక్టుల పూర్తి, వలసల నిరోధానికి చేపట్టాల్సిన సమస్యల ప్రస్తావన లేకపోవడం సీమవాసులకు కాస్త నిరాశ కలిగించింది. అయితే రాయలసీమను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామన్న సందేశంతో ముగించారు.
పరస్పర ప్రశంసలు, పొగడ్తలు...
మోదీ టూరు ఆద్యంతం పరస్పరం పొగడ్తలతో సాగింది. మోదీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తితే ప్రధాని కూడా అదే స్థాయిలో వారిద్దర్నీ కీర్తించారు.
“ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూపంలో శక్తిమంతమైన నాయకత్వం లభించింది” అని నరేంద్ర మోదీ ప్రశంసిస్తే ఆయన్ను (మోదీ) ఈ 21వ శతాబ్దానికే లభించిన గొప్ప నాయకుడు అని చంద్రబాబు కీర్తించారు.
ఇక, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకేసి ‘ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారు” అన్నారు. కూటమి స్థిరత్వానికి భరోసా ఇచ్చారు. మరో 15 ఏళ్లు కలిసే పని చేస్తామంటూ ప్రధానమంత్రి ముందు హామీ ఇచ్చి పరోక్షంగా తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వైపు బీజేపీ ని చూడకుండా చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన “శక్తిమంతమైన నాయకత్వం” అంటే బీజేపీ సారథ్యాన్ని అంగీకరిస్తున్నామని చెప్పకనే చెప్పారు. మోదీ గత దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్ ను “చిన్నచూపు” చూశారనే విమర్శకు జవాబు ఇచ్చారు. ప్రాజెక్టులు, పెట్టుబడులు, అభివృద్ధి రూపంలో మోదీ దృష్టి పెట్టారని చెప్పి ప్రజల్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.
“కేంద్రం – రాష్ట్రం ఒకే దిశలో ఉన్నాయి” అనే భావనను ప్రజలలోకి తీసుకువెళ్లడం ద్వారా వైసీపీకి వ్యతిరేకంగా “డెవలప్‌మెంట్ కూటమి” జైత్రయాత్ర సాగుతుందనే అభిప్రాయానికి కూడా తెర లేపారు.
మోదీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారా?
“21వ శతాబ్దంలో మోదీ అంతటి నాయకుణ్ణి చూడలేదు” అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొగడడం అంటే అది కేవలం ఆతిథ్య మర్యాద కాదు, రాజకీయ సంకేతం. మోదీకి చంద్రబాబుకి మధ్య ఉండే అగాధాన్ని పూచ్చుకోవడం, మనం మనం భాయ్ భాయ్ అని చెప్పుకోవడంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభివర్ణించారు.
ఈ ఇద్దరూ (చంద్రబాబు, పవన్) తమ సాయంతో మోదీ ప్రభుత్వం నడుస్తోందన్న సంకేతం ఇవ్వడానికి బదులు ఆయన సారథ్యంలో నడిచే “ ఎన్డీఏ కూటమి” భాగస్వాములుగా కలకాలం నడుస్తామని చెప్పడం అంటే, “ఇది కేవలం ఆంధ్ర కూటమి కాదు, డిల్లీతో అనుసంధానమైన ఆంధ్ర కూటమి” అని సంకేతం ఇవ్వడంగా రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
మోదీతో సహజ అనుబంధం ఉన్న వైసీపీని “జనం నుంచి వేరుపడిన, ఒంటరి పార్టీ”గా చూపించే ప్రయత్నంగా సీనియర్ జర్నలిస్టు గోరంట్లప్ప అభిప్రాయపడ్డారు.
సీమ సమస్యల ప్రస్తావన ఏదీ?
రాయలసీమ న్యాయమైన కోర్కెల కనీస ప్రస్తావన లేకపోవడాన్ని పలువురు ఆక్షేపించారు. ప్రధానమంత్రి మోదీ లాంటి వ్యక్తి వెనుకబడిన రాయలసీమకు వచ్చినపుడు సుదీర్ఘ కాలంగా నలుగుతున్న- హైకోర్టు బెంచీ, సీమ సాగునీటి ప్రాజెక్టుల- ప్రస్తావన ఎందుకు తేలేదని రాయలసీమ సాగునీటి సాధన సమితీ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రశ్నించారు.
"రాయలసీమకు ఏమీ ప్రకటించలేదు. జీఎస్టీ ప్రచారం చేసుకోవడానికి ప్రధాని స్థాయి వ్యక్తి ఇక్కడికి రావాల్నా? జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి సుమారు 15వేల రూపాయలు మిగిలాయని ప్రధాని చెబుతున్నారు. మరి గత 15 ఏళ్లుగా జీఎస్టీ రూపంలో తీసుకున్న వేలాది కోట్ల రూపాయలకు సమాధానం ఏమిటీ? రాయలసీమలోనూ ఇటీవల కాలంలో వ్యవసాయం పెరిగింది. ట్రాక్టర్లపై జీఎస్టీ తగ్గించామని చెబుతున్న ప్రధాని- రైతులు వాడే డీజిల్ పైన, పురుగుమందులపైన ఎందుకు తగ్గించలేదు? దీంతో ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకున్నట్టయింది. ప్రధానమంత్రి రాయలసీమ కష్టాలు, కన్నీళ్లు, వలసలు చూడాలనుకుంటే రోడ్డు మార్గంలో పయనిస్తే తెలిసేది. కానీ ఆయన ఆకాశమార్గాన హెలికాఫ్టర్ లో ప్రయాణించి మా పల్లెల దుస్థితిని చూడలేకపోయారు" అని దశరథరామిరెడ్డి అన్నారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై పాలకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని కూడా ఆయన ఆరోపించారు. "ప్రధాని సభకు సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు తెలిసింది. ఇందులో మూడో వంతు 30 కోట్లు ఖర్చు పెడితే ఓ నీటి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. దీనికైతే డబ్బులు ఇవ్వరు గాని ప్రధాని సభలకు, జీఎస్టీ షోలకు డబ్బు ఖర్చు పెడతారు" అని దశరథరామిరెడ్డి అన్నారు.
ఏయే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారంటే...
అయితే ఈ వాదనను తోసిపుచ్చే వారూ లేకపోలేదు. మోదీ ఈ టూరులో ₹13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడమో, శంకుస్థాపన చేయడమో జరిగింది.
వీటిని రాజకీయ దృష్టితో చూసేకన్నా ప్రజలకు జరగబోయే లాభాల దృష్టితో చూడాలన్నారు ప్రముఖ రచయిత పంచాగ్నుల చంద్రశేఖర్.
రహదారులు, రైల్వేలు, పవర్ ట్రాన్స్‌మిషన్, గ్రీన్ ఎనర్జీ కారిడార్ వంటివి దీర్ఘకాల అభివృద్ధి ప్రాజెక్టులు. రామాయపట్నం పోర్టు, ఎయిర్‌పోర్టు అప్‌గ్రేడేషన్, రక్షణ ఉత్పత్తి కేంద్రాలు వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తాయి. అయితే, ప్రాజెక్టుల అమలు, నిధుల విడుదల, భూసేకరణ సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందువల్ల తక్షణ మేలు ఆశించలేం.
"సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న కర్నూలు జిల్లా పారిశ్రామికీకరణకు ఇదో ముందడుగు. ఇది కొనసాగాలి. అదే సమయంలో కొన్ని కాలుష్య కారక పరిశ్రమలు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. వాటికి అనుమతి ఇస్తే రాయలసీమ ప్రాంతానికి దెబ్బ తగులుతుంది. దీనిపై నిఘా పెట్టాలి" అని చంద్రశేఖర్ అన్నారు.
ఉత్తరాంధ్రకి వస్తున్న పెట్టుబడుల్లో సగం కూడా రాయలసీమకు రావడం లేదని, ఆ అసమ్మతి ఎక్కడ రాజుకుంటుందోనన్న భయంతోనే ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి అంటూ పాటపాడుతున్నారని అనంతపురం జిల్లాకి చెందిన ప్రజాసంఘాల నాయకుడు రమణ అన్నారు.
సోలార్ ఫార్మ్ లో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి?
భూములకు నేరుగా నీళ్లు పారించేలా పంట కాలువలను తవ్వాలని నిత్యము రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూనే ఉంటే అసలు రైతులు ఏ రోజు కూడా అడగని ఈ సోలార్ విండ్ పవర్ ప్రాజెక్ట్ లు రాయలసీమ ప్రాంతంలో ఎందుకు పెడుతూ ఉన్నారోనని రాయలసీమ విమోచన సమితి నాయకుడు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి ఆశ్చర్యం వక్తం చేశారు. "ఎవరి ప్రయోజనాల కోసం ఇవి పెడుతూ ఉన్నారు అనేదే మా రాయలసీమ ఉద్యమకారులకు అర్థం కాని కోటి రూపాయల ప్రశ్న? 100ఎకరాలలో సోలార్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్తును కేవలం ఒక ఉద్యోగస్థుడు మాత్రమే ఆపరేట్ చేయగలడు. ఈ లేక్కన మన రాయలసీమ ప్రాంతంలో సోలార్ విండ్ పవర్ ప్రాజెక్ట్ లకు భూములను కారుచౌకతో ఇస్తున్న రైతుల కుటుంబాలకు ఈ కూటమి నాయకులు చెబుతూ ఉన్నట్లు గా ఏ విధంగా ఉద్యోగాలు వస్తోయో అర్థం కావడం లేదు," అని నాగార్జున రెడ్డి అన్నారు. రాయలసీమ రైతులు నీళ్లు అడుగుతుంటే, భూములను పరిశ్రమలంటూ తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
మోదీ పూజలు చేయడానికి వచ్చారా?
రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి రైతు సమస్యలు ప్రత్యేకించి రాయలసీమ టమాటా, ఉల్లి, పత్తి రైతుల సమస్యలు పట్టకపోవడం విడ్డూరంగా ఉందని ఏపీ రైతు సంఘం నాయకుడు కేవీవీ ప్రసాద్ అన్నారు. "కర్నూలు నడిబొడ్డున ఉల్లి రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నారు. టమాటా రైతులు తమ పంటను నడిరోడ్డుపై పోసి తొక్కించేస్తున్నారు. పత్తికి ధర లేదు. ఆ విషయాన్ని కర్నూలుకు వచ్చిన ప్రధాని దృష్టికి తీసుకురావడానికి సీఎంకి నోరు రాలేదు. ఎక్కడెక్కడి సమస్యల్నో ప్రస్తావించే మోదీకి ఈ విషయం గుర్తుకు రాలేదు. విచిత్రంగా ఉంది" అని ప్రసాద్ అన్నారు. మోదీ అసలు పూజలు చేయడానికి వచ్చారా లేక ప్రజాసమస్యలు వినడానికి వచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
వామపక్షనాయకులు సహా పలువుర్ని గృహ నిర్బంధం చేసి ఈ టూరును సక్సెస్ చేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వందలాది మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టి, స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ఇచ్చి, యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్నీ, రవాణా వ్యవస్థను ఉపయోగించి మోదీ టూరును జయప్రదం చేసినట్టు ప్రకటించుకున్నా రాయలసీమ సమస్యలపై ప్రధాని మోదీతో ప్రకటన చేయించకపోవడం లోపమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అనడం గమనార్హం.
ఈ పర్యటన తర్వాత సీమ ప్రజల నమ్మకం పెరిగిందా తగ్గిందా అన్న ఆత్మావలోకనమైతే చేసుకోవాల్సిందే.