నేల రాలిన రిజిస్ట్రార్ల రాచరిక దర్పం.. ఇంతకీ ఈ గొప్ప ఎప్పుడు మొదలైందంటే..?
x

నేల రాలిన రిజిస్ట్రార్ల రాచరిక దర్పం.. ఇంతకీ ఈ గొప్ప ఎప్పుడు మొదలైందంటే..?

సబ్‌రిజిస్ట్రా ఆఫీసు నుంచి ఏపీ ప్రభుత్వం బూజుపట్టిన రాచరిక పద్దతికి చెల్లు చీటి ఇచ్చింది. ఆ ఆఫీసుల్లో జోరుగా సాగే అవినీతి పరిస్థితి ఏంటి..?


రామయ్య.. రామయ్య.. రామయ్య.. రిజిస్ట్రార్ గారి ముందు నిలబడు. ఆయన అడిగిన వాటికి జవాబులు చెప్పు. డాక్యుమెంట్లు చూపించు (బంట్రోతు పిలుపు)

వస్తున్నానయ్యా..(క్లైంట్ జవాబు)

ఆ పక్కన నిల్చో.. అయ్యవారు పిలిచినపుడు రండని బంట్రోతు గదమాయింపు..

సహజంగా ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే తంతు ఇది. కోర్టుల్లో న్యాయమూర్తి మాదిరి పెద్ద వేదికపై రిజిస్ట్రార్ కూర్చుని ఉంటారు. ఆ కార్యాలయంలో పని కోసం వెళ్లే ఏ ఒక్కరైనా ఆ రిజిస్ట్రార్ కి వారగా నిలబడి సమాధానాలు చెప్పి, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుతో పాటు ఇతర మామూళ్లు ఇచ్చి పని ముగించుకుని రావాలి. ఇప్పటి వరకు జరిగిన రాచరికపు విధానం ఇది. ఇకపై ఆ విధానానికి చెల్లు చీటి పడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ మార్క్ పాలన చేయడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తరతరాలు సాగుతున్న బూజుపట్టిన ఓ రాచరికపు తీరుకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంతో కాలంగా పాటిస్తున్న రాచరిక తీరుకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చేలా ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. కూటమి ప్రభుత్వం కూడా వాటికి ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదినల ప్రకారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్పులు వీలైనంత త్వరగా తీసుకురావాలని అధికారులకు సూచించింది సర్కార్. ఇంతకాలం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు తమ పని అయ్యే వరకు నిల్చునే ఉండేవారని, దానికి స్వస్తి పలకాలని, ప్రజలను గౌరవించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

కాఫీలు, టీలు ఇస్తారట..

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే విధానాన్ని మార్చాలని అధికారులు చెప్పారు. ఇంతకాలంలో కోర్టుల్లో న్యాయమూర్తి తరహాలోనే సబ్‌రిజిస్ట్రార్ కూడా కూర్చునే వారని, ఆ పద్దతిని మార్చాలని మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్పీ సిసోడియా తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ సీటింగ్‌ను మార్చాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల తరహాలోనే రిజిస్ట్రార్ సీటింగ్ ఉండాలని వారు పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రార్‌కు ఉన్న ఎత్తైన పోడియాన్ని తొలగించాలని, ఆయన చుట్టూ ఉండే ఎర్రటి వస్త్రాన్ని కూడా తొలగించాలని వారు తమ ప్రతిపాదనల్లో తెలిపారు. వాటన్నింటికి సర్కార్ ఓకే చెప్పింది. అంతేకాకుండా పనులు ఆలస్యమైన సమయంలో ప్రజలను కూర్చోబెట్టి వారికి తాగడానికి నీరు, టీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇంతకాలం పాటించిన తీరు ప్రజలను అవమానించేలా ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ చర్యలు పలు ప్రశ్నలకు దారి తీస్తోంది. ఇది ప్రజలను అవమానించడమే అయితే కోర్టుల్లో పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

కోర్టుల పరిస్థితి ఏంటి..

కోర్టుల తరహాలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రధాన అధికారికి ప్రత్యేక పోడియం ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ముందు ఫైళ్లు పట్టుకుని గంటల తరబడి నిల్చుని ప్రజలు తమ పనులు చేయించుకుంటారు. ఈ పద్దతిని మార్చాలనే ప్రభుత్వ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సమయంలోనే కొందరు.. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మార్చినట్లే కోర్టుల్లో కూడా మార్పులు తెస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కానీ అది జరగదని మాత్రం కొందరు నిపుణులు చెప్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు, కోర్టుకు చాలా తేడా ఉందని వారు చెప్తున్నారు. కోర్టుల్లో కూడా నిందితులు, సాక్షులను విచారించడం, దోషులకు శిక్ష పడేలా చేయడం వంటి పనులు జరుగుతాయి. అదే విధంగా కోర్టుల్లో సామాన్య ప్రజలకు మాత్రం ఎప్పుడూ కూర్చోడానికి సౌకర్యం కల్పించబడే ఉంది. అంతేకాకుండా న్యాయస్థానాలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల మధ్య పోలిక సరైన పని కాదని, న్యాయస్థానాలు తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయడానికి, అమాయక ప్రజలకు న్యాయం చేకూర్చడానికి అనేక నియమ నిబంధనలతో పనిచేస్తుంటాయని, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రజలకు సేవలు అందించడం కోసం పనిచేస్తాయని వారు అంటున్నారు.

అసలు ఈ రాచరికం ఎప్పటిడి?

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న తీరుతెన్నులన్నీ కూడా బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత వచ్చినవే. అంతకుముందు భారతదేశం అనేక రాజ్యాలుగా ఉండేది. ఆ సమయంలో దాదాపు అన్ని పనులు కూడా రాజులు, వారి సామంతుల కనుసన్నల్లోనే జరుగుతుండేవి, అప్పటికి కూడా అన్ని వివరాలు దస్త్రాల రూపంలో పొందుపరచబడే ఉన్నా అవన్నీ కూడా రాజమందిరాల్లో ఉండేవి. కానీ బ్రిటిషర్లు వచ్చిన తర్వాత అన్నింటికి అధికారిక కార్యాలయాలు ప్రారంభించారు. ఎక్కడిక్కడ ఫైళ్లను ఉంచుతూ.. ఎప్పటికప్పుడు తమ హెడ్‌క్వార్స్‌కు పంపుతూ వచ్చే వారు. రెవెన్యూ, ఆర్థిక శాఖ ఇలా అన్ని శాఖలను విడివిడి వ్యక్తులు నిర్వర్తిస్తూ.. వారు ప్రతి ప్రాంతాల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకునేవారు. వారు అమలు చేసిన విధానాలనే చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. వాటిల్లో ఈ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఒకటి. అప్పట్లో రిజిస్ట్రార్ పనులను దొరలు చూసే వారు, వారి వద్దకు ఇక్కడి స్థానిక ప్రజలు వెళ్లడంతో వారి స్థాయిని కనబరచడం కోసం తమ రాచరిక పద్ధతులు అమలు చేశారని ఒక వాదన. అదే పద్ధతి ఆ తర్వాత కూడా కొనసాగిందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఒక్కసారిగా ఈ మార్పెందుకు?

ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లూ లేనిది సామాన్యుడిపై ప్రభుత్వానికి ఒక్కసారిగి ఇంతటి ప్రేమ ఎందుకు పెల్లుబీకిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత మూడు సార్లు ఆయనకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఇప్పుడు సామాన్యుడికి గౌరవం ఇవ్వాలని, వారిని కూర్చోబెట్టి సేవలు చేయాలని? అంటున్నారు. ఆ దిశగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మార్పులు ఒక్కసారిగా ఎందుకు తెచ్చారు? ఈ ప్రశ్నలు తెగ వినిపిస్తున్నాయి. అయితే ప్రజలను తనవైపు తిప్పుకోవడానికి, వారి దృష్టిని ఆకర్షించడానికే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని కొందరి వాదన. దాంతో పాటుగా వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు, అమలు చేయని హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ప్రజలపై వల్లమాలిన ప్రేమ వలకబోస్తోందన్న విమర్శలూ వినిపిస్తునాయి.

అవినీతి సంగతేంటి..

రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి రాచరికాన్ని తీసేసిన క్రమంలోనే మరో ప్రశ్న తెరపైకి వస్తుంది. రాజరికాన్ని తొలగించిన సరే.. మరి రెవెన్యూ శాఖల్లో తిష్ట వేసుకుని ఉన్న అవినీతి సంగతేంటన్న ప్రశ్న ప్రస్తుతం కీలకంగా మారింది. రెవ్యూ కార్యాలయంలే అవినీతికి నిలయాలుగా చెప్తారు. అలాంటి వాటిల్లో అవినీతి నిర్మూలనకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? రాచరికాన్ని తీసినట్లే అవినీతి ఎప్పుడు తీస్తారు? అసలు అవినీతి తీయాలన్న ఆలోచనైనా ప్రభుత్వం చేస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా వరకు అవినీతి కేసులు రెవెన్యూ కార్యాలయాల్లో జరుగుతున్నాయని, అలాంటిది ముందుగా దానిపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం రాచరికాన్ని తీసేసి గొప్పగా చెప్పడం ఏంటని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. రాచరికం కన్నా ముందు అవినీతిని నిర్మూలిస్తే.. ప్రజలు చాలా సంతోషిస్తారని వారంటున్నారు. రెవెన్యూ శాఖల్లో అవినీతి సొమ్ము పంచుకునే కార్యక్రమంలో ఉన్నతాధికారుల నుంచి ఆఫీసు బాయ్ వరకు పాత్రధారులగానే ఉంటున్నారని, ఎప్పుడు ఈ కార్యాలయాలకు వెళ్లని వారికి కూడా తెలిసిన ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? తెలిసినా పట్టించుకోదా? అని అంటున్నారు. మరి రెవెన్యూ ఆఫీసుల్లో జరిగే అవినీతిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Read More
Next Story