ముచ్చుమర్రి ఘటన దర్యాప్తులో ఊహించని పరిణామం..
ముచ్చుమర్రి బాలిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల కస్టడీలో ఒక నిందితుడు మరణించాడు. పోలీసులే చంపారంటూ మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ప్రాంతంలో 8ఏళ్ల బాలిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసలో కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా పోలీసుల అదుపులో ఉన్న నందికొట్కూరుకు చెందిన హుస్సేన్(అత్యాచారం చేసిన మైనర్ బాలురలో ఒకరి మేనమామ) మృతి చెందాడు. అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కొట్టిన దెబ్బలకు తాలలేకే హుస్సేన్ మరణించాడని కొందరు ఆరోపిస్తున్నారు. కాగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో ముగ్గురు మైనర్లకు కుటుంబీకులు కొందరు సహాయపడ్డారు. వారిలో నలుగురికి పోలీసులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. వారిలో హుస్సేన్ కూడా ఒకరు. వారిని మూడు రోజులు పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున హుస్సేన్ తుదిశ్వాస విడిచాడు. ఈ క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతడి మరణానికి మరేమైనా కారణం ఉందా? అనేది తేలాల్సి ఉంది. అయితే మృతుడి శరీరంపై గాయాలున్నాయని, పోలీసుల దెబ్బల వల్లే హుస్సేన్ మృతి చెందాడని అతడు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, హుస్సేన్‌ను విచారణ పేరుతో చిత్రవధ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మృతుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు.