కాపులను చంద్రబాబు అణగదొక్కాలని చూశారా!
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్.. కాపుల ద్రోహి అని మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ జగన్ ప్రభంజనం సృష్టిస్తారన్నారు.
కాపులను అణగదొక్కాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారంటూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. కాపుల ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆంధ్రలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ప్రజలు మరోసారి జగన్‌నే తమ సీఎంగా ఎంచుకోడానికి ఉవ్విళ్లూరుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనతోనే ఆంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలోని రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది జగనే అని, వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
పవన్‌తో పొత్తు అందుకే
ఈ సందర్భంగా టీడీపీ-జనసేన కూటమిపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమి లక్ష్యం అధికారంలోకి రావడమే తప్ప పేదలు, ప్రజలకు మేలు చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదని విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే కాపుల ద్రోహి పవన్‌తో పొత్తు ఏర్పరుచుకున్నారు. కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నారు. కాపులను అణగదొక్కాలని బాబు ప్రయత్నిస్తే వారిని అక్కున చేర్చుకున్న నేత జగన్. ప్రజలు మెచ్చిన సీఎం, వారి మనసులు ఎరిగిన నేత జగన్ మోహన్. అలాంటి నేతనే ఆంధ్ర ప్రజలు ఎన్నుకుంటారు’’అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వన్నీ దుర్మార్గపు రాజకీయాలే
చంద్రబాబు తన 42 ఏళ్ల జీవితంలో చేసినవన్నీ దుర్మార్గపు రాజకీయాలేనంటూ ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని పార్టీలు కలిసి కట్టుగా వచ్చినా జగన్ చరిష్మా ముందు ఓడిపోవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘పవన్ కల్యాణ్.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పేట్టేశారు. పవన్ చేసేవన్నీ బుద్ది లేని పనులే. తన బౌన్సర్లు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇస్తున్నారు. వారిని చూస్తేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నన్ను ముట్టుకోకూడదు. దుమ్ము పడకూడదు అని బౌన్సర్లతో ప్రజలను కొట్టించే నేతలు రాజకీయాలకు దూరంగానే ఉండాలి. పవన్, చంద్రబాబు లాంటి నీచ నేతలను ప్రజలు నమ్మరు. త్వరలో జరిగే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. మళ్ళీ జగన్‌కే ప్రజలు పట్టం కడతారు’’అని చెప్పారు ముద్రగడ.
Next Story