పవన్ కు ముద్రగడ 'నమస్కారం' చెప్పినట్టేనా?
జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కాపు రిజర్వేషన్ ఉద్యమ సమితీ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కాపు రిజర్వేషన్ ఉద్యమ సమితీ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక చేత్తో కమలం మరో చేత్తో సైకిల్ పట్టుకుని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయ గోదాను ఎలా ఈదుకొస్తాడని రుసరుసలాడుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ పంథాపై మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న ముద్రగడ పద్మనాభం అనుచరులు, అభిమానులైతే మరో ముందడు వేసి ఎన్నికలై పోయే దాకా ఈ అయోమయమే కొనసాగుతుందా అని పెదవి విరుస్తున్నారు. అయితే కాపులకు రాజ్యాధికారం సాధించే క్రమంలో పవన్‌కల్యాణ్ చిరు ఆశాదీపంగా కనిపిస్తున్నాడని, ఆ సామాజిక వర్గం పదేపదే ఆయన చెవిలో ఊదరగొడుతోంది. దీంతో పవన్‌పై ముద్రగడ కోపాన్ని పక్కన పెట్టారు. కాస్త మెత్తబడి జనసేనలో చేరడానికి కూడా మొగ్గు చూపారు. ఇంతలో ఏమైందో ఏమో...
“ఆయన (పవన్ కల్యాణ్) వస్తే ఓ నమస్కారం, రాకపోతే రెండు నమస్కారాలు” అనడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన అంతమాట ఎందుకన్నట్టు?
ఇదీ నేపథ్యం..
ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి రావాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు, తాడేపల్లిగూడెం జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ గత నెలలో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఇందుకు ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణే స్వయంగా ముద్రగడ ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకుంటారని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. బొలిశెట్టి చెప్పిన సమయం దాటి కూడా నెలైంది. ఇంత వరకూ పవన్ కల్యాణ్ జాడ లేదు. ముద్రగడ గడప పవన్ తొక్కలేదు.
టీడీపీ అభ్యంతరం చెప్పిందా?
ముద్రగడను జనసేనలో చేర్చుకోవడంపై టీడీపీ అభ్యంతరం చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన సన్నిహితుల వద్ద ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. ‘జనసేనలో చేరే విషయమై తన ఆమోదం తెలిపా. ఇంతటితో కాపు నాయకుడిగాతన బాధ్యత తీరిపోయింది. తన ఇంటికి పవన్‌కల్యాణ్ వస్తే ఒక నమస్కారం, లేదంటే రెండు నమస్కారాలు’ అని వ్యంగంగా ముద్రగడ వ్యాఖ్యానించడం గమనార్హం.
పవన్ కల్యాణ్ తో విభేదాలన్నీ పక్కన పెట్టి, జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిన తర్వాత అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నారని ముద్రగడ అనుచరులు, అభిమానులు మండిపడుతున్నారు. పవన్‌ను నమ్ముకుని, టికెట్ ఇస్తామన్న జగన్ పార్టీని అవమానించామనే అంతర్మథనం ముద్రగడ అనుచరుల్లో మొదలైంది. సీనియర్ రాజకీయ వేత్త, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు మర్యాద ఇవ్వకపోగా, ఇలా అవమానించడానికైనా తన పార్టీ నేతల్ని ఇంటికి పంపి, మీడియా ముందు పెద్దపెద్ద మాటలు మాట్లాడిందని జనసేనను ముద్రగడ అనుచరులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు.