పవన్ ఓటమే ముద్రగడ వ్యూహమా!
x
Source: Twitter

పవన్ ఓటమే ముద్రగడ వ్యూహమా!

పార్టీలో చేరిన రెండో రోజే పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కాపు ఉద్యమనేత ముద్రగడ విమర్శలు గుప్పించారు. జనసేన మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు.



ముద్రగడ పద్మనాభం.. ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సీనియర్ రాజకీయ నేతలతో సమానమైన నాయకుడాయన. కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయడమే ధ్యేయంగా ఆయన పోరాడారు. తాజాగా వైసీపీ కండువా కప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారు. రాజకీయ పార్టీలో చేరిన రెండో రోజే తమ ప్రత్యర్థి పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే రానున్న ఎన్నికల్లో పవన్‌ను ఓడించడమే టార్గెట్‌లా అనిపిస్తోంది. పవన్‌కు రాజకీయం తెలియట్లేదంటూ ఎద్దేవా చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన సీట్లపై కూడా ముద్రగడ సెటైర్లు వేశారు. వచ్చిందే పావలా అందులో మళ్ళీ పంపకాలు, త్యాగాలా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పార్టీలో అందుకే చేరా

వైసీపీలో చేరిన తర్వాత తొలిసారి ముద్రగడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఏ పదవులు, అధికారాలు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. ‘‘నాకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. వారు అభివృద్ధి చెందాలన్నదే ఆశయం. రాష్ట్రంతో పాటు ప్రజలు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే లక్ష్యం. కాపులు ఎల్లప్పుడూ ఆనందా ఉండాలనే కోరుకుంటాను. అంతేకానీ నాకు ఎటువంటి స్వప్రయోజనాలు, స్వార్థాలు లేవు’’అని తెలిపారాయన.

పవన్ మారుద్దామని ప్రయత్నించా

తన ఆశయాల గురించి చెప్పిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. పవన్‌కు రాజకీయాలు అర్థం కావట్లేదని, పొత్తులో భాగంగా ఇచ్చిన 21 సీట్లను తిరిగి టీడీపీకి ఇచ్చేస్తే మంచిదంటూ సెటైర్లు వేశారు. ‘‘పవన్‌ను మారుద్దామని చాలా ప్రయత్నించా కానీ ఆయన రాలేదు. రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లను ప్రజలు నమ్మరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా జనసేన ఓడిపోవడం ఇందుకు నిదర్శనం. తాజాగా వస్తున్న ఎన్నికల కోసం టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. అందులో భాగంగా కేవలం 21 స్థానాలకు జనసేన పరిమితం కావడమే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ బలమెంతో కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. వచ్చిన ఈ 21 సీట్లలో కూడా పవన్ ఎన్ని గెలుస్తారు అన్నది అంచనా కూడా లేదు. ఈ ఎన్నికల తర్వాత జనసేన మూతపడటం ఖాయం. మొలతాడు కూడా కట్టుకోలేని వాళ్ళు నాకు రాజకీయాలు నేర్పుతున్నారు’’అని విమర్శనాస్త్రాలు సంధించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.


Read More
Next Story