ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోయినా గెలిచిన నేత..!
ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదంటే అభ్యర్థికి చాలా చిన్నతనంగా ఉంటుంది. కానీ అలా డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థి విజయం సాధించారు. ఆయనెవరో తెలుసా..
ఎన్నికలు చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి అధికారం కట్టబెడతాయో.. ఎవరిని అధికారం నుంచి ఢమాలున కిందపడేస్తాయో తెలియదు. ఈ ఎన్నికల్లో గెలవాలని పోటీ పడే ప్రతి అభ్యర్థి కోరుకుంటాడు. ఆ దిశగా కృషి చేస్తాడు కూడా. అందులో భాగంగానే తన ప్రత్యర్థికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలంటూ ఓటరు దేవుళ్లను వేడుకుంటాడు. అయితే అసలు డిపాజిట్ కూడా రాకపోవడం అంటే ఏంటి? డిపాజిట్ రాకపోతే ఓటమి పాలయైనట్లేనా? అంటే మన ఎన్నికల చరిత్ర సమాధానం చాలా వెరైటీగా ఉంది. గతంలో ఓ నేత తనకు డిపాజిట్ దక్కకపోయినా ఎన్నికల్లో గెలిచారు. ఆయనే ఉంవీ వీనభద్రం.
ఆయన ఎలా గెలిచారు
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారి 1952లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎంవీ భద్రం.. విశాఖ జిల్లా పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగిపోయింది. అసలు చిక్కు కౌంటింగ్ రోజునే వచ్చింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎంవీ భద్రంకు డిపాజిట్ కూడా దక్కలేదని, కానీ ఆయనే విజేత అని అధికారులు ప్రకటించారు. దాంతో ఎమ్మెల్యే పదవిని పొంది ఆయన భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎవరూ సాంధించని, సాధించలేదని ఘనతను తన పేరిట లిఖించుకున్నారు.
అసలు ఏమైంది!
1952 ఎన్నికల్లో విశాఖ జిల్లా పరవాడ నియోజవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో అప్పుడు మొత్తం 60,780 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల పోలింగ్‌లో మాత్రం కేవలం 25,511 ఓట్లు పోల్ అయ్యాయి. దాంతో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. ఆ ఓట్లలో ఎంవీ భద్రంకు 7,064 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జగన్నాథరాజుకు 4,347 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఎల్‌జీఏ రావుకు 3,109 ఓట్లు, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థి ఈటి నాగయ్యకు 1,158 ఓట్లు లెక్కన వచ్చాయి. డిపాజిట్ దక్కాలంటే అప్పట్లో నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో మూడో వంతు అంటే 8,504 ఓట్లు రావాల్సి ఉంది. కానీ ఇక్కడ ఏ అభ్యర్థికి అన్ని రాలేదు. దాంతో ఎవరినీ విజేతగా ప్రకటించలేమని అధికారులు తేల్చి చెప్పారు.
పట్టుబట్టిన సీపీఐ
అయితే అధికారులు చెప్పినదాన్ని సీపీఐ అంగీకరించలేదు. ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్లే అవుతుందని, అటువంటిది తమ అభ్యర్థికి ఉన్న వారందరికంటే ఎక్కువ ఓట్లే వచ్చాయని, కాబట్టి తమ అభ్యర్థి భద్రంను విజేతగా ప్రకటించాలంటూ సీపీఐ నేతలంతా పట్టబట్టారు. దాంతో చేసేదేమీ లేక అధికారులు కూడా ఎంవీ భద్రంను విజేతగా ప్రకటించారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చలు కూడా జరిగాయి. ఈ ఘటన ఎదురవడంతో ఆ తరవాత డిపాజిట్ నిబంధనలను సవరించారు. ఆ ప్రకారమే 1955 ఎన్నికలు జరిగాయి.
డిపాజిట్ దక్కపోవడం అంటే!
డిపాజిట్ దక్కకపోవడం అంటే చాలా మంది సదరు అభ్యర్థికి ఒక్కఓటు కూడా పడకపోవడం అని అనుకుంటారు. కానీ దానికి అర్థం అది కాదు. జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు సదరు అభ్యర్థికి వస్తే అతడికి డిపాజిట్ దక్కిందని అధికారులు వెల్లడిస్తారు. అతడికి పడిన ఓట్లు అంతకన్నా తక్కువగా ఉంటే డిపాజిట్ కూడా దక్కలేదని అర్థం. ఈ మార్పునే 1955లో తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం రద్దు అయింది. ఆ నియోజకవర్గం కూడా వచ్చి పెందుర్తిలో విలీనమైంది.