తొలి సంతకం మెగా డీఎస్‌సీ పైనే...
x
శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబు

తొలి సంతకం మెగా డీఎస్‌సీ పైనే...

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించడానికి తొలి సంతకం చేస్తానని టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు వెల్లడించారు.


‘‘సీఎం కాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ నిర్వహించడానికి మొదటి సంతకం చేస్తా" అని టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 11 డిఎస్సీలు నిర్వహించిన ఘన చరిత్ర టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీ రామారావు మూడు డీఎస్సీలు నిర్వహించారని, తాను 14 సంవత్సరాల సీఎం పదవి కాలంలో 8 డీఎస్సీలు నిర్వహించానని వివరించారు. చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ పాలనతో సంక్షేమం, జగన్ హయాంలో సంక్షోభం వచ్చిందంటూ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

జగనన్నా డీఎస్‌సీ ఏదీ!
ఉద్యగావకాశాల విషయమై రాష్ట్రంలోని నిరుద్యోగులంతా సీఎం జగన్‌పై ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల సమయంలో అన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరా అధికారం వచ్చాక ఒక్క ఏడాదైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేశావా? అడిగిన ప్రతిసారీ ఏదో పిచ్చి క్యాలెండర్ విడుదల చేయడం కొన్ని రోజులకు దానిని సవరణ అంటూ క్యాలెండర్‌ను అటకెక్కించడమే కదా చేసింది? గత నెలలో ఏడు మేనేజ్‌మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో మెగా డీఎస్‌సీ విడుదల చేస్తున్నాం అన్నారు. అది ఏమైంది? సీఎం గారూ.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో చేసిన ట్రిక్కేగా అది? మీరు ప్రకటించారు ఎన్నికల కోడ్ వచ్చి వాళ్లు ఆపారు. ఎన్నికల కోడ్ వస్తుందన్న సంగతి మీకు, మీ మంత్రులకు తెలియదా అని రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
డీఎస్‌సీ కథ ఇది
ఇప్పటివరకు రాష్ట్రంలో 13 డీఎస్‌సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటిలో మొట్టమొదటి డీఎస్‌సీ నోటిఫికేషన్ 1977లో విడులైంది. ఎన్‌టీ రామారావు హయాంలో ఆయన 1984, 1989, 1994 సంవత్సరాల్లో మూడు డీఎస్‌సీ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఆ తర్వాత 1995లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు నాయుడు 2004 వరకు సీఎంగా కొనసాగారు. ఈ కాలంలో 1996, 1997, 1998 సంవత్సరాల్లో డీఎస్‌సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఆంధ్ర సీఎంగా వైఎస్‌రాజశేఖర్ రెడ్డి పదవీ స్వీకారం చేశారు. ఆయన 2008లో డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆతర్వాత 2009లో రాజశేఖర్ రెడ్డి రెండోసారి గెలిచి నప్పటికీ అదే ఏడాది సెప్టెంబర్‌లో మరణించడంతో ఆంధ్రాలో రాజకీయా గందరగోళం మొదలైంది.
2009 నుంచి 2014 వరకు ఇద్దరు సీఎంలు మారారు. అప్పటికీ 2011లో కొన్ని ఖాళీల బర్తీకి డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేయగా, 2012లో మరిన్ని ఖాళీలతో మరోసారి నోటిఫికేషన్ విడుదలైంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది 9061 ఉద్యోగాలతో డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2019లో మళ్లీ ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ.. 2024 ఫిబ్రవరి 12న 6100 ఖాళీలతో మెగా డీఎస్‌సీ అని నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఎన్నికల కారణంగా అవి వాయిదా పడ్డాయి.
ప్రజాగళం సభలో చంద్రబాబు ఇచ్చిన హామీలు
అయితే ప్రజాగళం సభలో ప్రజలపై చంద్రబాబు హామీల వర్షం కురిపంచారు. తాము అధికారంలోకి వస్తే అందరి తలరాతలు మారతాయని, రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో నాగుతుందని అన్నారు. ‘‘ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కోక్కరికి రూ.1500 చొప్పున అందిస్తాం. తల్లికి వందనం పేరిట రూ.15000 ఇస్తాం. మహిళలకు ఆర్టీ‌సీ బస్సు ప్రయాణం ఉచితం చేస్తాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలెండర్లు ఫ్రీగా అందిస్తాం. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. బిందు సేద్యం కోసం నిధులు కేటాయిస్తాం. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3000 నిరుద్యోగ భృతి అందిస్తాం. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను పెంచుతాం. మీరు మీ ఇంట్లో కూర్చునే ప్రపంచంలో ఎక్కడ కంపెనీలో అయినా పనిచేసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4000కు పెంచుతాం. దానిని ఇంటికే పంపిస్తాం. ప్రతి ఇంటికీ నీరు అందేలా చేస్తాం’’అని చంద్రబాబు వరాల జల్లు కురిపించారు.
కంటితుడుపు చర్యగానే డీఎస్‌సీ
2024లో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్‌సీ నోటిఫికేషన్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని, ఇది చెప్పుకోవడానికి చేసిన చర్చేనని ఆగ్రహించారు. ‘‘2019 ఎన్నికల్లో గుడిని, గుడిలో లింగాన్ని మింగే నేతలు గెలిచారు. సెటిల్‌మెంట్లు, కుట్రలు, దగాలు చేయడం వారి స్పెషాలిటీ. వారి హయాంలో రాష్ట్రమంతా అవినీతి రాజ్యమేలుతోంది. వీళ్లు ఐదేళ్ల పాలనలో మీకు ఏమైనా లాభం చేకూరిందా. జగన్ ఓ పెద్ద అవినీతి పరుడు. అలాంటి వారంతో కాలగర్భంలో కనుమరుగయ్యారు. మా తమ్ముళ్లపై అకారణంగా అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు. నా ఆలోచనలను ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమయితే జగన్ ఆలోచన తన స్వార్థం కోసమే ఉంటుంది. మా పాలనలో రాష్ట్రానికి హోండా, సిలికాన్ కార్బన్ ఎక్సైజ్, పీసీఎల్ వంటి ఐటీ కంపెనీలు వరుసపెట్టి వస్తే వైసీపీ హయాంలో ఉన్నవి కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. మేము కంపెనీలు తీసుకొస్తే వైసీపీ ఎమ్మెల్యేలు వసూలు ప్రారంభించారు. మేము ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపితే వైసీపీ మాత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారు. వైసీపీ తమ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని స్మగ్లింగ్ హబ్‌గా మార్చారు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వదిలిపెట్టలేదు’’అని ధ్వజమెత్తారు.
అంతేకాకుండా జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతే జరిగిందని, రూ.60 రూపాయల మద్యాన్ని రూ.200 చేశారని, నాశిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని, కర్ణాటక, తమిళనాడులో ఉన్న మద్యం బ్రాండ్‌లు ఆంధ్రలో ఉన్నాయా? ఇక్కడ ఉన్నవి ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘టీడీపీ పాలనలో ఇసుక విధానంలో మార్పు తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల ఆదుకుంటాం. అదే మా మార్క్. మేము మా ప్రభుత్వంలో 24 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించాం. మరి వైసీపీ తమ పాలనలో ఒక్క మరుగుదొడ్డి కానీ, సీసీ రోడ్డు గాని నిర్మించారా? రాష్ట్రంలో జగన్ బెండు తీసే ట్రెండ్ వచ్చింది. అందుకు ఇరు పార్టీలు నిర్వహిస్తున్న సభలే నిదర్శనం. మన సభలు ప్రజలు, అభిమానులతో కళకళలాడుతుంటే వాళ్ల సభలు ఈగలు, దోమలు కూడా లేక విలవిలలాడుతున్నాయి. ఐదేళ్ల జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అందరూ గమనించారు. ఒక సీఎం విధ్వంసకుడు అయితే ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో అనడానికి ఆంధ్ర ఒక ఉదాహరణ అవుతుంది. వైసీపీ అరాచకాలతో విసుగెత్తిన జనం జగన్ బెండు తీసే సమయం వచ్చింది’’అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More
Next Story