మైలవరం వసంతకు సవాలే

మైలవరంలో టీడీపీ నేతలు సహకరిస్తారా.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి అదే పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలోకి వసంత. అసంతృప్తుల్లో టీడీపీ నేతలు.


మైలవరం వసంతకు సవాలే
x
Vasantha krishna Prasad

జి. విజయ కుమార్

వసంత కృష్ణ ప్రసాద్‌కు మైలరవం సవాలుగా మారింది. అక్కడున్న టీడీపీ గ్రూపులను ఏక తాటిపైకి తీసురాగలుగుతారా, వారు 2024 ఎన్నికల్లో వసంత గెలుపు కోసం పని చేస్తారా? అనేది ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద చర్చగా మారింది. వసంత కృష్ణ ప్రసాద్‌ను మైలవరం అసెంబ్లీ నియోజక వర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. మూడు రోజుల క్రితం విడుదల చేసిన మూడో జాబితాలో మైలవరం టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ చంద్రబాబు ప్రకటించారు.
వసంత కృష్ణప్రసాద్‌ 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మైలవరంలో పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయనకు అదే పార్టీకి చెందిన మంత్రి జోగి రమేష్‌కు మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. జోగి రమేష్‌కు మైలవరం సొంత నియోజక వర్గం కావడం, అక్కడ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే కాంక్షతో మైలవరం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ వచ్చారు. అలా తనకంటూ అనుచరులు, గ్రూపును ఏర్పాటు చేసుకొని వసంతకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. వసంతను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా గ్రూపు రాజకీయాలకు తెరతీసారు.
అవి ముదిరి పాకాన పడటంతో ఆ పంచయాతీ తొలుత సీఎంఓకు చేరింది. అక్కడ పరిష్కారం లభించక పోవడంతో నేరుగా సీఎం జగన్‌ వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పార్టీ మారాలనే నిర్ణయానికి వసంత వచ్చారు. మార్చి మొదటి వారంలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు.
అడ్డుకున్న టీడీపీ గ్రూపులు
వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలోకి రావడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదు. వసంత టీడీపీలోకి వస్తే తమకు మైలవరంలో భవిష్యత్‌ ఉండదని భావించిన ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావులు తీవ్రంగానే ప్రతిఘటించారు. అయితే అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో వసంత కృష్ణప్రసాద్‌ టాక్స్‌ సక్సెస్‌ కావడం, వసంతకే మైలవరం స్థానం ఇస్తామని చంద్రబాబుతో ఒప్పందం కుదరడంతో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఒక్కటైన దేవినేని, బొమ్మసాని
అప్పటి వరకు గ్రూపులుగా ఉన్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వర్గాలు వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలోకి వస్తున్నారని ఖరారు కావడంతో ఒక్కటయ్యారు. మైలవరం సీటును మాజీ మంత్రి దేవినేని ఉమాకు కానీ సీనియర్‌ నేత బొమ్మసాని సుబ్బారావుకు కానీ కేటాయించాలని తమ అనుచరులతో చేపట్టిన నిరసనలు ద్వారా అధిష్టానానికి సమాచారం పంపారు. అయినా అధిష్టానం వారిని పట్టించుకోలేదు. అప్పటికే వసంతకు మైలవరం టికెట్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు వారి బెదిరింపులను భేఖాతర్‌ చేశారు. అందరూ కలిసి పని చేయాలని గ్రూపులతో పార్టీకి ఇప్పటికే నష్టం చేకూరిందని, భవిష్యత్‌లో వీటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని దేవినేని ఉమాకు, బొమ్మసాని సుబ్బారావు వర్గాలకు చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. దీంతో వారంతా సైలెంట్‌ కాక తప్ప లేదు. అందరూ కలిసి ఒకే వేదికపైకి వచ్చి అందరూ కలిసి ఐక్యమత్యంతో పార్టీ కోసం పని చేస్తామని చెప్పారు.
అసంతృల్లోనే నేతలు
దేవినేనికి అటు మైలవరం టికెట్, ఇటు పెనమలూరు స్థానం దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ రాకను, టికెట్‌ ఖరారు కావడాన్ని దేవినేని జీర్ణించుకోలేక పోతున్నారని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఆయన గ్రూపుకు చెందిన నేతలు, కార్యకర్తలు అందరూ సైలెంట్‌గానే ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా వసంత గెలుపునకు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాల్సిందే. మరో నేత బొమ్మసాని సుబ్బారావు, ఆయన వర్గీయులు కూడా వసంత ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకో లేదు. ఇంత కాలం తమకు ప్రత్యర్థిగా రాజకీయాలు నడిపిన వ్యక్తికి ఎలా సహకరించాలనే దానిపై గుర్రుగా ఉన్నట్లు స్థానిక నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వసంత గెలుపునకు దేవినేని ఉమా, బొమ్మసాని వర్గాలు ఏవిధంగా సహకరిస్తాయనేది వేచి చూడాలి.
Next Story