మైలవరం టిడిపి టికెట్ ఎవరికి?
మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు, వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైలవరం టిడిపి టికెట్ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.
G. Vijaya Kumar
మైలవరం టిడిపి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనేది ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంట నెలకొంది. టిడిపి అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించిన తొలి జాబితాలో మైలవరం అభ్యర్థి పేరు లేక పోవడంతో ఎవరికి చోటు దక్కనుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం స్థానం ఆశిస్తున్నారు.
టిడిపి నేత దేవినేని ఉమా టిడిపి సీనియర్ నేతల్లో ఒకరు. ప్రస్తుతం టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఒక పర్యాయం మంత్రిగా పని చేశారు. మాజీ ముఖ్యంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలి బలంగా వీస్తున్న టైమ్‌లో ఉమ్మడి రాష్ట్రంలో గెలుపొందిన టిడిపి నేతల్లో దేవినేని ఉమా ఒకరు. 2009లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో 12వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థులైన ఆపసాని సందీప్(కాంగ్రెస్)కు 65,887 ఓట్లు, పిఆర్‌పి నుంచి పోటీ చేసిన చనుమోలు లక్ష్మీ అనుపకు 19,516 ఓట్లు రాగా టిడిపి అభ్యర్థిగా బరీలోకి దిగిన దేవినేని ఉమాకు 78,554 ఓట్లు పోలయ్యాయి. విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో దేవినేని ఉమా విజయం సాధించారు. ప్రత్యర్థి వైసిపి నేత జోగి రమేష్‌పై 7,569 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జోగి రమేష్‌కు 86,970 ఓట్లు రాగా దేవినేనికి 94,539 ఓట్లు పోలయ్యాయి. అనంతరం చంద్రబాబు కేబినెట్‌లో జలవనరుల శాఖ మంత్రిగా బెర్తు దక్కించుకున్నారు.
గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి
ఇంత అనుభవం ఉన్న దేవినేని ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మైలవరం టిక్కెట్ కోసం తన ప్రత్యర్థి అయిన సిట్టింగ్ వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు.
వసంత కృష్ణప్రసాద్ తీవ్ర ప్రయత్నాలు
ప్రస్తుత మైలవరం వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టిడిపి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. దీని కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వసంతకు ఈ సారి చెక్ పెట్టారు. వసంతకు కాకుండా తిరుపతిరావు యాదవ్‌కు మైలవరం వైసిపి బెర్తు కేటాయించారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. వసంతకు టిక్కెట్ రాకుండా మంత్రి జోగి రమేష్ సిఎం వద్ద చక్రం తిప్పారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. దీంతో టిడిపిలోకి వెళ్లాలని వసంత నిర్ణయించుకున్నారు. ఆ మేరకు రంగం కూడా ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వసంత, దేవినేని ఉమా ఒకే పార్టీ టిక్కెట్ కోసం పోటీ పడుతుండటం, చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Next Story