2019లో చంద్రబాబు హఠావో.. 2024లో జగన్ హఠావో.. ఇదీ రాష్ట్ర ప్రజల నిర్ణయం..
x

2019లో చంద్రబాబు హఠావో.. 2024లో జగన్ హఠావో.. ఇదీ రాష్ట్ర ప్రజల నిర్ణయం..

రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడంతో వేటి అజెండా వాటికి ఉంది. దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని నాదెండ్ల చెప్పారు.


సోమవారం మధ్యాహ్నం 12.15 ప్రాంతం. మధ్యాహ్నం ఎండ చిరచిరలాడుతోంది. టౌన్‌లోని గాంధీనగర్‌ రోడ్డు చివర్లో ఓ పాతకాలపు మేడ. పెద్ద లోగిలి, చుట్టూ ప్రహరీ. పెళ్లింటికి వేసినట్టు పెద్ద తాటాకు పందిరి. లోపల ఓపక్క వాటర్‌ ఫిల్టరు, ఎండనపడి వచ్చిన వాళ్లు చల్లబడేలా కూలర్లు. దప్పిక తీర్చుకునేలా మజ్జిగ ప్యాకెట్లు.. కూర్చోవడానికి కొత్త కుర్చీలు... జనంతో కిటకిటలాడుతోంది. మహాకూటమిలోని మూడు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. రోడ్డు మీద వచ్చిపోయే జనానికి కనిపించేలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. భవనం చుట్టూ ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉన్నవి, పవన్‌ కల్యాణ్, చంద్రబాబు మధ్యలో నాదెండ్ల మనోహర్‌తో ఉన్నవి కొన్ని మిలమిలా మెరుస్తున్నాయి.

వచ్చిపోయే వాళ్లు, పలకరింపులు, ఎడతెగని చర్చలతో పందిరికింద జనం ముచ్చట్లాడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ తమ నాయకుని కంట్లో పడడానికి ప్రయత్నిస్తున్నారు. వీలయితే పలకరించి పోవాలని చూస్తున్నారు. తెనాలిలోని జనసేన కార్యాలయం వద్ద సోమవారం కనిపించిన దృశ్యాలివి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనలో సెకండ్‌ ఇన్‌ కమాండ్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తున్నారు. చంద్రబాబు మంగళవారం తెనాలి వస్తుండడంతో పార్టీ కార్యకర్తల హడావిడి ఎక్కువగా ఉంది. ఇటువంటి సమయంలో స్థానిక సీనియర్‌ జర్నలిస్టు రఘురామయ్యను వెంటబెట్టుకుని.. ది ఫెడరల్‌ ప్రతినిధులు ఈ మాజీ స్పీకర్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడైన నాదెండ్ల మనోహర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారు. ఆయన చాలా బిజీగా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేరేమోనని మనోహర్‌ వ్యక్తిగత సహాయకులు చెప్పినా మా మిత్రుడు రఘురామయ్య సహకారంతో ఆయన్ను కలిసి ఇంటర్వ్యూ చేయగలిగాం.

ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమంటారంటే...

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడం వల్ల వేటి అజెండా వాటికి ఉంది. ఈ దేశానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాలకులు మారాల్సిన అవసరం ఉంది. ప్రజలు అదే కోరుకుంటున్నారు. సెక్యులర్‌ ఫ్యాబ్రిక్‌కే కట్టుబడి ఉన్నాం… బీజేపీ, టీడీపీ, జనసేన మహాకూటమిగా ఎన్నికల బరిలోకి దిగాం. బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామంటే అన్నీ ఆలోచించే పొత్తు పెట్టుకున్నాం. ఈ దేశ రాజ్యాంగ స్వభావం లౌకికం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించే సమయంలో మేము (జనసేన) ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్‌ షాకి స్పష్టం చేశాం. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆ విషయాన్నే పదేపదే ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలోని మైనారిటీల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగకూడదని, ఆ విధంగా జరిగితే పొత్తు ధర్మం దెబ్బతింటుందని కూడా మేము మా వైపు నుంచి స్పష్టం చేశాం. ముస్లిం, క్రిస్టియన్, ఇతర మైనారిటీ వర్గాలకు మేము హామీ ఇస్తున్నాం. వాళ్ల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలుగదు. లౌకిక వ్యవస్థకు మేము కట్టుబడి ఉన్నాం. మా పార్టీ విధానం అది.

మోదీ మీటింగ్‌ తర్వాత మీ గ్రాఫ్‌ తగ్గిందా?

మూడుపార్టీలు కూటమిగా ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి మీటింగ్‌ అది. చాలా హడావిడిగా పెట్టిన సభ. చాలా బిజీ షెడ్యూల్‌‌లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడమంటేనే ఆ సభ సక్సెస్‌ అయినట్టు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు ఆ సభ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా లేదని కొందరికి అనిపించవచ్చు. ఆ పార్టీని విమర్శించలేదనో ఈ పార్టీని ప్రశంసించలేదనో కొందరు అనుకోవచ్చు. కానీ కేవలం మూడు రోజుల వ్యవధిలో ఈ మీటింగ్‌కి ప్రధాని వచ్చారు అనేది గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో మహాకూటమికి బలాన్ని చేకూర్చారని భావించాలి. ఈ సభ తర్వాత మా గ్రాఫ్‌ కాస్త తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు అంతకు రెట్టింపు అయింది. తగ్గింది నాలుగనుకుంటే పెరిగింది 8 అనుకోవాలి.

ముస్లింలపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల్ని…

ఇంతకుముందే చెప్పా. మేము సెక్యులర్‌ ఫ్యాబ్రిక్‌కు కట్టుబడి ఉన్నాం. పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు కదా? ఇకపైనా అంతే. ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగితే మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అసలు సహించరు. అవసరమైతే కూటమి నుంచి బయటికి రావడానికి కూడా వెనుకాడరు. అన్ని వర్గాలకు మేలు జరగాలన్న ఉద్దేశంతోనే మేము ఫ్రంట్‌ కట్టాం. ముస్లింలకు జనసేన భాగస్వామిగా ఉన్న మహాకూటమి అండగా ఉంటుంది. ఏ వర్గానికి అన్యాయం జరగనీయబోం. బీజేపీపై రాజకీయ విమర్శలు వస్తుంటాయి. వాటిపై మేము స్పందించాల్సిన అవసరం లేదు.

2024 ఎన్నికలు చాలా ప్రత్యేకమనే దానిపై…

చూడండి.. ప్రతి ఎన్నికా ప్రత్యేకమే. గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగే దానికి పోలికంటూ ఏమీ ఉండదు. కాలానుగుణ సమస్యలు, ఆధునికత పెరిగే కొద్ది ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. 2014 ఎన్నికలతో 2019 ఎన్నికల్ని పోల్చలేం. అదే విధంగా 2024 ఎన్నికలు కూడా. 2014లో ప్రధాన సమస్య రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్ర విభజన, అభివృద్ధి, భవిష్యత్‌ కార్యాచరణ. 2019 ఎన్నికల్లో యువత ఆశలు, ఆకాంక్షలు, 2024లో దేశ సమైక్యత, సమగ్రత, రాష్ట్ర ప్రగతి, సంక్షేమం.

ఆవేళ హఠావో చంద్రబాబు ఈవేళ హఠావో జగన్‌..

రాష్ట్రం చీలిపోయింది. అనుభవజ్ఞుడైతే బాగుంటుందని ప్రజలు భావించి 2014లో చంద్రబాబును గెలిపించారు. ఐదేళ్లు తిరిగొచ్చే పాటికి యువకుడైన జగన్‌కి ఒక ఛాన్స్‌ ఇస్తే బాగుంటుందని 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. 2014లో చంద్రబాబును గెలిపించిన ఆ ప్రజలే 2019లో హఠావో చంద్రబాబు అని నిర్ణయించుకున్నారు. జగన్‌కి అధికారాన్ని ఇచ్చారు. 2024 ఎన్నికల్లో హఠావో జగన్‌ అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారు. దట్సాల్‌ (అంతే).

జగన్‌ పాలన బాగాలేదని ఎలా అంటారు?

విమర్శించడానికి నేనీ మాట చెప్పడం లేదు. జగన్‌పై మాకేమీ వ్యక్తిగత ద్వేషం లేదు. సంక్షేమం మాటున జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. ప్రతి స్కీం ఒక స్కామే. ఇప్పుడు వాటిని వివరించేంత సమయం లేదు గాని మూగజీవాల కొనుగోలు మొదలు సలహాదారుల వరకు ప్రతి ఒక్క పథకంలో అవినీతే. బటన్లు నొక్కామనే పేరిట ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అది ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవొచ్చు. పాడిపశువుల కొనుగోలు పేరిట సుమారు రూ.1,870 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందంటే నమ్ముతారా? ఇలాంటివి అనేకం ఉన్నాయి.

రోజువారీ ఆదాయం రూ. 734 కోట్లు ఏమవుతున్నట్టు?

రాష్ట్రాభివృద్ధిపై కంటే ఓటు బ్యాంకును పెంచుకోవడంపైన్నే జగన్‌‌కు శ్రద్ధ ఉందని ఎందుకంటున్నానో ఓ వాస్తవం చెబుతా. విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ రోజువారీ ఆదాయం (క్యాపిటల్‌ రెవెన్యూ) సుమారు రూ.734 కోట్లు. దీనికి జగన్‌ తెస్తున్న అప్పుల్ని కలిపితే రోజువారీగా రూ.160 కోట్లకు పైమాటే. అంటే రాష్ట్రానికి ప్రతి నిత్యం సుమారు రూ.900 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం ఎంతో తెలుసా? కేవలం రూ.43 కోట్లు. అంటే మిగతాది ఏమై పోతున్నట్టు? రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులు ఎక్కడికి వెళుతున్నట్టు? సంక్షేమం పేరిట ఎవరి జేబుల్లోకి ఎంత పోతున్నాయో మేధావులు నిగ్గుతేల్చాలి. రోడ్ల దుస్థితికి కారకులు ఎవరు? కొత్త పరిశ్రమలు ఎందుకు రావడం లేదు, నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది? ఎంఏలు, ఇంజినీర్లు చదువుకున్న పిల్లలు వాళ్ళు చేయాల్సిన పనులకు బదులు ఆటోలు నడుపుకోవడం అభివృద్ధి అవుతున్నట్లా? నిన్నటి కన్నా నేడు మెరుగ్గా ఉండడమే అభివృద్ధి అని జగన్‌ పదేపదే చెబుతుంటారు కదా, మరి ఇలాంటి పరిస్థితిని ఏమనాలి?

మీరూ అవే హామీలు ఇస్తున్నారు కదా?

అవును. మేమూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాం. మా ప్లాన్‌ మాకుంది. సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించే మందు మేము పెద్దఎత్తున కసరత్తు చేశాం. ఆదాయ, వ్యయాలను లెక్కలోకి తీసుకునే ఖరారు చేశాం. స్కాంలను అరికట్టగలిగితే స్కీంలను అమలు చేయవచ్చు. దుబారా, కుంభకోణాలను ఆపగలిగితే మేమిచ్చిన ఆరు పథకాలను సునాయాసంగా అమలు చేయవచ్చు. ఒక లక్షా 15 వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి పెట్టడం పెద్ద కష్టం కాదు. ఆ ఆర్థిక వనరులను సమకూర్చుకోగలిగే సత్తా మాకుంది.

మీ కూటమి విజయావకాశాలపై…

2019లో వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు ఈవేళ మార్పు కోరుకుంటున్నారు. వన్‌ ప్లస్‌ వన్‌ రెండు, టూ ప్లస్‌ వన్‌ త్రీ.. మూడు పార్టీల కూటమి. విజయానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మా కూటమి గెలుస్తుంది. అధికారంలోకి వస్తుంది.

మీ గెలుపు సునాయాసమేనా?

కచ్చితంగా.. జనసైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ భుజం భుజం కలిపి పని చేస్తున్నారు. చూస్తున్నారు కదా.. చంద్రబాబు సమక్షంలో చేరడానికి ఎంతమంది ప్రత్యర్థి పార్టీల వాళ్లు వచ్చారో.. ఇందులో ముస్లింలు సహా అన్ని వర్గాల వారు ఉన్నారు. కూటమికి వస్తున్న స్పందన అది. అందువల్ల సునాయాసంగానే గెలుస్తా (ఈ మాట చెబుతుండగా పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి ఫోన్‌ రావడం.. కార్యకర్తలు కార్యాలయం వెలుపుల సందడి చేస్తుండడంతో.. కలుద్దాం అంటూ ఆయన ముగించారు.)

ఓకే సర్‌ ఆల్‌ ది బెస్ట్‌ అంటూ ది ఫెడరల్‌ ప్రతినిధులు ఆయనకు (నాదెండ్ల మనోహర్‌) షేక్‌హ్యాండ్‌ ఇచ్చి బయటకు వచ్చారు.

Read More
Next Story