అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికే ఢిల్లీకి.. జగన్‌పై నాగబాబు సెటైర్లు
x

అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికే ఢిల్లీకి.. జగన్‌పై నాగబాబు సెటైర్లు

జగన్ ఢిల్లీ పర్యటనపై నాగబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదంతా అసెంబ్లీకి రాకూడదని జగన్ ఆడుతున్న డ్రామా అన్నారు.


రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనపై , ప్రతీకార రాజకీయాలపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తామని, ఏపీలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్ చేస్తామని వెల్లడించారు. వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన రషీద్ కుటుంబీకులను పరామర్శించిన సందర్బంగా జగన్ ఈ ప్రకటన చేశారు. అయితే ఈ అంశంపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సెటైర్లు వేశారు. ఏపీ ప్రజలపై ప్రేమతో ఏమీ జగన్ ఢిల్లీకి వెళ్లడం లేదని చురకలంటించారు. ఏపీ ప్రజలపై ఇప్పుడు చూపుతున్నంత ప్రేమ నిజంగానే జగన్‌కు ఉండి ఉంటే ఇప్పటికీ ఆయన అధికారంలోనే ఉండే వారు కాదా అని ప్రశ్నించారు. జగన్ పక్కా ప్లాన్ ప్రకారమే ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు.

శవ రాజకీయం విఫలమే కారణం

వినుకొండలో జరిగిన రషీద్ హత్యను రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నించింది. అందుకే వెంటనే అక్కడకు వెళ్లి పరామర్శించారు. ఆఖరికి పరామర్శకు వెళ్తూ కూడా జగన్‌.. టపాసులు కాల్పించుకున్నారు. అసలు ఎవరైనా పరామర్శకు వెళ్తూ టపాసులు కాల్పిస్తారా అని ప్రశ్నించారు నాగబాబు. అంతేకాకుండా పరామర్శకు వెళ్లిన జగన్ అక్కడ చిరునవ్వులు కూడా చిందిస్తూ కనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. శవ రాజకీయాలు చేయడం జగన్ ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో భాగంగా రషీద్ కుటుంబీకులను పరామర్శించిన అనంతరం కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శలను నాగబాబు తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రషీద్ హత్యను జనసేన తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నాం.

రాజకీయ రంగు పులిమింది వైసీపీనే

రషీద్ హత్య పాత గొడవలు, కక్ష్యల కారణంగా జరిగింది. కానీ దానికి జగన్, వైసీపీ కలిసి రాజకీయ రంగును పులిమారు. కూటమిపై బురదజల్లాలన్న ఉద్దేశంతో జగన్.. శవరాజకీయాలను తెరలేపారని నాగబాబు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నాయకుడిగా రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం తప్పేమీ లేదు.. కానీ అక్కడకు వెళ్లి రాజకీయ అంశాలు మాట్లాడటం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా చావు ఇంటికి వెళ్లి జగన్ మామ అని చెప్పడం, జగనన్న పథకాలు అంటూ ప్రచారం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు నాగబాబు. ప్రజలను నమ్మించడానికి జగన్ ఇంకా ఎంత కాలం నటిస్తారని విమర్శించారు.

అందుకే ఢిల్లీ పర్యటన

ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ సమాచారం కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం ఎలా అని జగన్ ప్లాన్స్ వేసుకోవడం ప్రారంభించారు. అందుకోసమే ఆయన వినుకొండ హత్యను వాడుకుంటున్నారు. శవరాజకీయాలు చేస్తూ ఆంధ్రలో లా అండ్ ఆర్డర్ కనుమరుగైందని, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్తున్నారు. కానీ ఆయన అసలు ఉద్దేశం అసెంబ్లీకి డుమ్మా కొట్టడేమనని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడానికి జగన్ ఆడుతున్న కొత్త డ్రామానే ఢిల్లీలో ధర్నా అని చురకలంటించారు. నిజంగా లా అండ్ ఆర్డర్‌పై అంత ఆందోళన చెందుతున్న జగన్.. వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడని చెప్పి మెంటర్ ఆసుపత్రిలో పెట్టి, నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి పడేసినప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఇలాంటి చచ్చు డ్రామా ఐడియాలు జగన్‌కు ఎవరిస్తున్నారో తెలియదు కానీ.. జగన్ అసెంబ్లీకి రావాలని, ఆయనను ఎవరూ ఏమీ అనొద్దని కూటమి ఎమ్మెల్యేలతో తానే స్వయంగా చెప్తానని, కాబట్టి నిర్భయంగా జగన్.. అసెంబ్లీకి రావాలని నాగబాబు సూచించారు.

Read More
Next Story