ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా అన్నదమ్ములు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ను, ఆయన సోదరుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీగా నాగబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు పవన్‌ కల్యాణ్‌ అందుబాటులో లేక పోవడంతో నాగబాబుకు కలవడం కుదరలేదు. దీంతో గురువారం తన సోదరుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను విజయవాడలో కలిసి నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్, నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగబాబు, తన భార్య పద్మజతో కలిసి బుధవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సచివాలయంలో ఉన్న సీఎం చంద్రబాబును నాగబాబు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు సీఎం చంద్రబాబు నాగబాబును శాలువాతో కప్పి సత్కిరించి, వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని బహూకరించారు. ఇదే సమయంలో నాగబాబు కూడా సీఎం చంద్రబాబును సత్కరించారు. శాలువాను కప్పి సత్కరించి, పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే కోటా కింద నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కింద ఐదు సీట్లు ఖాళీ అయ్యాయి. యనమల రామకృష్ణుడు, పీ అశోక్‌ బాబు, బీటీ నాయుడు, జంకా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావుల పదవీ కాలం ముగియడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఐదు సీట్లను కూటమి భాగస్వామ్య పార్టీలు పంచుకున్నాయి. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి చొప్పున సీట్లు కేటాయించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడులకు టీడీపీ కింద అవకాశం కల్పించగా, జనసేన నుంచి నాగబాబుకు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు.
ఎంపీగా అవ్వాలని నాగబాబు తొలుత కలలు కన్నారు. అనకాపల్లి నుంచి బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ సీట్ల పంపిణీల్లో ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీఎం రమేష్‌ ఇక్కడ నుంచి గెలుపొందారు. దీంతో ఎంపీగా నాగబాబుకు అవకాశం లేకుండా పోయింది. తర్వాత రాజ్యసభకు వెళ్లాలని భావించారు. మూడు స్థానాల్లో ఒక స్థానం జనసేనకు కేటాయించాలని ఢిల్లీ లెవల్లో పవన్‌ కల్యాణ్‌ పావులు కదిపారు. అయితే ఆ మూడు స్థానాల్లో రెండు టీడీపీకి, ఒకటి బీజేపీలు పంచుకున్నాయి. బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా, బీజేపీ నుంచి ఆర్‌ కృష్ణయ్యను రాజ్యసభకు పంపారు. దీంతో నాగబాబుకు రాజ్య సభ అవ్వాలనే కోరిక కూడా నెరవేరకుండా పోయింది. పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో చక్రం తిప్పినా ఫలితం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబుకు ఏమీ చేయలేక పోతున్నాననే ఆలోచనలో పవన్‌ కల్యాణ్‌ ఉండగా.. ఇదే సయమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు తెరపైకొచ్చాయి. వీటిల్లో ఒకటి నాగబాబుకు కేటాయించాలని పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబుతో చర్చించారు. నాగబాబుకు ఒక స్థానం ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఎంపీగా పార్లమెంట్‌లో అడుగు పెట్టాలని కలలు కన్న నాగబాబు చివరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఎమ్మెల్సీగా అడుగు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలో ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలనే దానిపైన కసరత్తు జరుగుతోంది. అయితే నాగబాబుకు ఏ మంత్రి పదవి ఇస్తారనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story