జగన్‌ మీద, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో నాగబాబు ధ్వజమెత్తారు.


పెద్దిరెడ్డి అక్రమాస్తులు రాష్ట్ర బడ్జెట్‌ను దాటి పోయిందని జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పుంగనూరులో ఆదివారం జరిగిన జనంలోకి జనం సభలో ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి మాట్లాడుకుందామంటూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పెద్దిరెడ్డికి పుంగనూరులో ప్రజలు భయపడుతారని చాలా చెబుతూ.. తనకు కూడా జాగ్రత్తలు చెప్పారు. పెద్దిరెడ్డితో జాగ్రత్తగా ఉండమని తనకు కూడా సలహా ఇచ్చారు. కానీ దానికి గట్టిగానే బదులు చెప్పానని.. పెద్దిరెడ్డికే కాదు.. వాళ్ల నాయకుడు.. జగన్‌.. జగన్‌ వాళ్ల నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డికే తాము భయపడలేదని, ఇక పెద్దిరెడ్డి ఎంతని బదులు చెప్పినట్లు నాగబాబు చెప్పారు. న్యాయంగా, ధర్మంగా ముందుకెళ్లే ఓ గప్ప నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అని అన్నారు. అలాంటి పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో పని చేస్తున్న తమకు.. పెద్దిరెడ్డి కాదుకాదా.. సుబ్బారెడి.. ఏ పిచ్చిరెడ్డికి కూడా భయపడేది లేదని.. డోంట్‌ కేర్‌ అంటూ మాట్లాడారు.

స్టేజీ మీద ఉన్న పెద్దలే కాదు.. పుంగనూరు ప్రజలే కాదు.. ఈ ప్రాంతంలో ఏ రాయిని.. రప్పని.. చెట్టును.. పుట్టను అడిగినా పెద్దిరెడ్డి అక్రమాల గురించి చెబుతాయన్నారు. ఆ జాబితా అంతా తన వద్ద ఉందన్నారు. రాయలసీమ మొత్తమ్మీద పెద్దిరెడ్డి 23 ఎకరాలు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి దోచుకున్న భూములకు రికార్డుల్లేకుండా తన అనుచరులతో కాల్చి బూడిద చేయించారని అన్నారు. మదనపల్లి తాహశీల్దార్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దగ్దం చేయించారని అన్నారు. పుంగనూరు పాడి రైతులను నిలువు దోపిడికీ పాల్పడ్డారని అన్నారు. లీటరు రూ. 20 లెక్కన పెద్దిరెడ్డి నిర్థారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులను పెద్దిరెడ్డి ఎన్నికలకు ముందు బెదిరించాడని అన్నారు. మైనింగ్‌ మాఫియాతో రెచ్చి పోయాడని, నిబంధనల ప్రకారం మైనింగ్‌ చేసేవారిని బెదిరించి వారి వ్యాపారాలను దోచుకున్నారు. పుంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్‌ మాఫియాకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నారని అన్నారు. వడమాలపేటలో గుజరాత్‌ వ్యాపారిని బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతిలో చెరువులను ఆక్రమించారు. మద్యం క్వాలిటీ లేదన్న ఓ దళితుడిని దుర్మార్గంగా చంపించారు. కమిషన్ల కోసం ఆవులపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. దీనికి నేషనల్‌ ట్రిబ్యూనల్‌కు పెద్దిరెడ్డి రూ. 100 కోట్లు పెనాల్టీ కింద చెల్లించారు. పుంగనూరు పరిధిలోని పులిచర్ల మండలం మంగళంపేటలో విలాసవంతమైన భవనం కోసం 70 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారు. అటవీ భూములను ఆక్రమించి మార్కెట్‌ యార్డ్‌ నిధులతో రోడ్లు వేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు. అటవీ శాఖ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్‌ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్‌ వంటి ప్రకృతి సంపదలను దోచుకున్న అడవి దొంగ పెద్దిరెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 2లక్షల కోట్ల ఆక్రమ ఆస్తులను కూడబెట్టారు. దీన్ని లెక్కబెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో.. ఎన్ని రూములు కావాలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పుంగనూరు ఓటర్లు ఓట్లేసి గెలిపిస్తే.. అసెంబ్లీకి వచ్చి పుంగనూరు ప్రజల సమస్యల మీద మాట్లాడలేని పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే పదవి ఎందుకని?.. పెద్దిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
Next Story