జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్న నాగబాబుకు మరో సారి హ్యాండిచ్చారు. నాగబాబు.. ఈ సారికి నువ్వాగు బాబు అంటూ సరిపెట్టారు. ఇంతకీ ఏమి జరిగిందంటే..


జి విజయ కుమార్

లోక్‌ సభ బరిలో దిగి ఎంపీ కావాలన్న కొణిదల నాగేంద్రబాబు ఆశ మరోసారి ఆవిరైంది. ఐదేళ్ల క్రితం జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం లోక్‌ సభ నియోజక వర్గ జనసేన అభ్యర్థిగా తలపడి మూడో స్థానానికి పరిమితమైన నాగబాబు ఈ సారైనా అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు. టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన తొలి రోజుల్లోనే తాను ఎంపీ కావడం ఖాయమనుకుని కలలు కన్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా అనకాపల్లిలో జెండా పాతేశారు. అక్కడ ఇల్లు కూడా అద్దెకు తీసుకొని స్థానికంగా ఉంటున్నట్లు ఓవైపు బిల్డప్‌ ఇస్తూనే.. మరో వైపు ఎంపీ సీటు కోసం ఎడతెగని ప్రయత్నాలు చేశారు. ఏమైందో ఏమో అనకాపల్లి ఎంపీ సీటు అవకాశం లేదని తమ్ముడు పవన్‌ ద్వారా అన్న నాగబాబుకు సంకేతాలొచ్చాయి. అంతే అనకాపల్లిలో క్యాంపు కార్యాయలం ఖాళీ చేసి.. మూట ముల్లీ సర్థుకొని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. తాజాగా జనసేన.. టీడీపీ కలిసి ఎన్టీఏ కూటమిలో చేరడంతో అనకాపల్లి ఎంపీ సీటు బిజెపీ సీఎం రమేష్‌కు కేటాయించింది. అనకాపల్లిలో చేజారిన అదృష్ణానికి బందరులోనైనా లంగరేద్దామని మరింత గట్టిగా నాగబాబు ప్రయత్నాలు చేశారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీని వీడి జనసేనలో చేరిన ప్రస్తుత బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరీ టికెట్‌కు ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 15రోజులుగా బందరు ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు పవన్‌కు ఆటుపోట్ల ఒత్తిడి తాకింది. ఒక దశలో బాలశౌరీని అవనిగడ్డ ఎమ్మెల్యేగా పంపించి, నాగబాబును బందరు ఎంపీ టికెట్‌ కేటాయిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. ఎట్టకేలకు ఎంపీగా పోటీ చేయాలన్న నాగబాబు ఆశలు కార్యరూపం దాల్చకుండానే పోయాయి.
బందరు బరిలో బాలశౌరీనే..
అనివార్య పరిస్థితుల నేపథ్యంలో బందరు జనసేన ఎంపీ టికెట్‌ను బాలశౌరీకి కేటాయించక తప్పలేదు. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాకినాడ ఎంపీ టికెట్‌ను ఖరారు చేసిన సమయంలోనే బాలశౌరీ మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని తనకు ఖరారు చేయకపోడం పట్ల కారణం ఏమిటని పవన్‌ను కలిసి ఆరా తీశారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న తాను అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీని వీడి జనసేనలోకి చేరినప్పటికీ ఎంపీ టికెట్‌ కేటాయింపుపై మీనమేషాలు లెక్కించడం సరికాదని బాలశౌరీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరిద్దరి భేటీలో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బాలశౌరీకి బందరు ఎంపీ టికెట్‌ ఇవ్వకుంటే ఆ ప్రభావం మిగిలిన చోట్ల వ్యతిరేక ఫలితాలు చూపే ప్రమాదం ఉందని గుర్తించిన పవన్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బందరు సీటు కేటాయింపుపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడటంతో అటు పవన్, ఇటు జనసేన శ్రేణులు హమ్మయ్య ఒక పనైపోయిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. జనసేనకు కేటాయించిన నాలుగు ఎంపీ స్థానాల్లో ఇప్పటికే పొత్తులో భాగంగా ఇప్పటికే రెండింటిని పవన్‌ కల్యాణ్‌ త్యాగం చేయగా మిగిలిన రెండింటిలో జనసేన అభ్యర్థులను ప్రకటించే తంతు ఇప్పటికి పూర్తి అయింది. 21 ఎమ్మెల్యే స్థానాలకు గాను అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్‌ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Next Story