ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా కింద కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి అసెంబ్లీలో సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ బలపరిచారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఏపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి నాగబాబు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తన నామినేషన్‌ను బలపరిచిన మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మార్చి నెలాఖరు నాటికి ఐదు ఎమ్మెల్యే కోటాకు చెందిన ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ కానున్నాయి. వీటిల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. నాగబాబు పేరును ఆయన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖరారు చేస్తూ ప్రకటించారు. నాగబాబు నామినేషన్‌కు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ నేతలకు ఆదేశించారు. దీంతో మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో నాగబాబు నామినేషన్ పత్రాలను గురువారం నాటికే సిద్ధం చేశారు.
నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేనకు చెందిన దాదాపు 10 ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్, లోకం మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీలు సంతకం చేసిన వారిలో ఉన్నారు. శుక్రవవారం మధ్యాహ్నం దాదాపు 15 కార్ల ర్యాలీతో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన నాగబాబుకు అసెంబ్లీ సెక్యురిటీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నాగబాబుకు తొలుత అనకాపల్లి ఎంపీ ఇస్తామన్నారు. అది పోయింది. ముగ్గురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత వాటిల్లో ఒక స్థానం కేటాయించి రాజ్యసభ పంపుతారంటూ ప్రచారం జరిగింది. ఆ మూడు సీట్లు వేరే వాళ్లకు కేటాయించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నాగబాబుకు కేటాయిస్తారనే టాక్ కూడా వినిపించింది. కానీ దానికి బీజేపీకి కేటాయించాలనే చర్చలు జరిగడంతో ఆ అవకాశం కూడా నాగబాబుకు దక్క లేదు. ఈ నేపథ్యంలో నాగబాబును ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు నిర్ణయించారు. కానీ దీనిపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని, దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని విరమించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగూ ఎమ్మెల్సీ అయిపోతున్న నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అనేది కూటమి వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.