‘అమరావతి పేరుతో రాయలసీమను మళ్లీ విస్మరిస్తున్న చంద్రబాబు’
ఇలాంటి ధోరణి ముదిరితే ప్రత్యేక రాయలసీమ నినాదం వినిపించినా ఆశ్చర్యం లేదు అంటున్న తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి
-తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి
రాష్ట్ర విభజన అనంతరం 2014లో మొదటి సారి తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని ప్రకటనతో అంతవరకు అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహము మెుదలైంది. అమరావతి అభివృద్ధి పేరుతో అభివృద్ధి నంత మధ్య కోస్తాలోనే కేంద్రీకృతం చేస్తూ రాయలసీమపై వివక్షత చూపడం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరమైన తప్పిదం. దీనిని అన్ని ప్రాంతాలలోని మేధావులు, మాజీ ఐఎఎస్ అధికారులు, యాక్టివిస్టులు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించారు.
నేడు కూడా 2024 లో తెలుగు దేశం నాయకత్వంలోనే ఏర్పడిన టిడిపి-జనసేన-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ బాట పట్టింది. భారీగా అమరావతి రాజధానిని పునర్నిర్మించాలని ప్రయత్నం మొదలు పెట్టింది. దీనికి వ్యతిరేకంగా ప్రకృతి ఇస్తున్న హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. ఇటీవల వచ్చిన భారీ వరదలతో విజయవాడ, అమరావతి ప్రాంతాలన్నీ జలమయం కావడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమరావతి ప్రాంతమంతా ముఖ్యంగా పరిపాలనా భవనాలున్న ప్రదేశాలతో సహా భారీ వరదలతో జలమయం కావడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు తన మంకు పట్టు కోసం అమరావతిలోనే రాజధానిని నిర్మించాలనే నిర్ణయించుకున్నారు.
బోట్లలో అధికారులతో గతంలో కట్టినటువంటి కట్టడాలను సర్వే చేయించి, చుట్టూ పట్టిసీమ, కొండవీటి వాగు మరికొన్ని ఎత్తిపోతల పథకాలను మొదట నిర్మించి రాజధాని ప్రాంతంలోకి వరద నీళ్లు రాకుండా చేస్తానంటున్నారు. ఇలా భారీ ఎత్తుపోతల పథకాలకే వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతోంది,. ఇంత ఎంతవరకు న్యాయం?
ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పేందుకు పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. ఇలా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నది రాయలసీమ ఉద్యమకారుల ఆవేదన. తాను కోరుకుంటున్న రాజధాని నిర్మాణాన్ని కూడా పక్కనపెట్టి, రాబోయే నగరాన్ని వరదలు ముంచెత్తకుండా చేయడానికి వేల కోట్లు ఖర్చుపెట్టే ఆర్థిక సామర్థ్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి లేద. ఇది చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. అయినా సరే, కేంద్రం వత్తాసుతో ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చి ఇలా ప్రాజక్టులను నిర్మించాలనుకుంటున్నారు. ఇలా ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూ తమ స్వలాభం కోసం అక్కడే రాజధానిని నిర్మించాలని కృత నిశ్చయంతో వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేయమంటే మరోసారి అభివృద్ధి కేంద్రీకరణకు మరోసారి విభజనకు ఈ ప్రభుత్వం నాంది పలుకడమేనని ఎంతోమంది మేధావులు ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి, పరిపాలనా దక్షుడు, పర్యావరణం కోసం ఉద్యమిస్తున్న మేధావి డాక్టర్ ఇఎఎస్ శర్ ఇప్పటికే ఈ విషయం మీద అనే సారి ఉత్తరాల ద్వారా ప్రభుత్వానికి తెలియచేశారు. ఉన్నదంతా ఉడ్చేసి అమరావతి నిర్మిసక్తే, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఏమి ఖర్చుపెడతారని వాళ్ళంతా అడుతుతున్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖాతరు చేయడం లేదు.
ఒకవైపు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు దొరకక వలసలతో ఆత్మహత్యలు చేసుకుంటన్నారు. ఈ వార్తలు రోజు పత్రికలో బాధకారంగా దర్శనమిస్తున్నాయి. రాయలసీమలో పంటలు పండక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని విస్మరించడం ఏమి న్యాయం? ఈ ప్రాంతం కోసం
కృష్ణ తుంగభద్ర నదులపై సమాంతర కాలువ, ఆల్మట్టి నుంచి బుక్కపట్నం వరకు వరద కాలువను నిర్మించడం చాలా అత్యవసరం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడే నిర్మించ తలపెట్టి శంకుస్థాపన చేసినటువంటి గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న విషయం విస్మరించారు.
ఈ మధ్య కేంద్రం క్రిష్ణా నదిపై సిద్దేశ్వరం దగ్గర నిర్మించ తలపెట్టిన నేషనల్ హైవే లో భాగంగా సిద్దేశ్వరం దగ్గర తీగలవెంతనను నిర్మించకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని భారీ ఎత్తున రాయలసీమ ప్రజలు ఢిల్లీ వరకు ఉద్యమాలు చేశారు. నంద్యాల ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి సీఎం గారి సమక్షంలోనే తీగల వంతెన బదులుగా బ్రిడ్జికం బ్యారేజీ నిర్మించేలాగా చంద్రబాబు నాయుడు కేంద్రానికి సూచించాలని ప్రత్యక్షంగా కోరారు. ఇప్పటివరకు కూడా కేంద్రాన్ని కోరి అక్కడ బ్రిడ్జ్ కం బ్యారేజీ నిర్మించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవడం రాయలసీమ ప్రాంత రైతులను అవమానానికి గురి చేస్తా ఉంది.
రాజధానిని, హైకోర్టును కర్నూల్ లో అభివృద్ధి చేయదలచినటువంటి వాటిని కూడా అమరావతికి తరలించినటువంటి ఈ ప్రభుత్వం నేడు రాయలసీమకు మేలు చేసే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం విచారకరం. ఈ ఏడాదే కృష్ణా నది నుండి దాదాపుగా 800 టిఎంసిలు సముద్రం పాలు చేయడం చాలా దారుణమైన విషయం. గుడ్ ఇయర్ (Good Year) ప్రతిసారి కూడా వందల టిఎంసిలు తుంగభద్ర, కృష్ణా నదిలో నుండి సముద్రాలకి వృధాగా పోతున్నప్పటికీ ఎవరూ విచారించడం లేదు. తరతరాలుగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి పాలకులు రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్మించకపోవడంతో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదన్న విషయం ఎన్నో ఉద్యమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ ఉద్యమకారులు ప్రత్యక్ష ఉద్యమాల ద్వారా తెలపడం జరిగింది. కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ (NDA) ప్రభుత్వం గానీ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గానీ రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో ఏ ఒక్క నూతన ప్రాజెక్టును కట్టడానికి, రాయలసీమ ప్రాంతంలో ఉన్న కృష్ణా తుంగభద్ర నదులను అనుసంధానం చేయడానికి కానీ మొగ్గు చూపకుండా ఎక్కడో ఏడు జిల్లాల అవతల ఉన్నటువంటి గోదావరి నీళ్లను గోరకల్లుకు అనుసంధానం చేసే కార్యక్రమం చేపడతామంటున్నా. ఈ ప్రభుత్వం ఇలా హాస్యాస్పదంగా ప్రకటనలు చేస్తూ రాయలసీమ ప్రాంత ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉంది.
ఎందుకంటే గతంలో గతంలో పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రకటనలో చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా ఒక్క టీఎంసీ ని కూడా రాయలసీమ ప్రాంతానికి కేటాయించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి నుండి గోరకల్ కు నీళ్లు ఎత్తిపోతల పథకాల ద్వారా భారీ కరెంటు ఖర్చులను భరిస్తూ రాయలసీమ ప్రాంతం అంత కూడా సస్యశ్యామలం చేస్తామంటే రాయలసీమ ఉద్యమకారులుగా మేము ఎలా నమ్ముతాం.
ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాయలసీమ ప్రాంతంలో కృష్ణ తుంగభద్ర నదులతో పశ్చిమ ప్రాంతంలో ఉన్న వేదవతి, పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని నదులతో అనుసంధానం చేయాలని రాయలసీమ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఉన్నారు.
ఎందుకంటే ఆ ప్రాంతంలో నదులు అనుసంధానం చేస్తే పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో రాయలసీమ కరువు ప్రాంతానికి వరద నీరు చేరుకునే దానికి అవకాశం ఉందని ఉద్యమకారులుగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసుకుంటున్నాం.
ఇంత మెజార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో చర్చించి కేంద్రంతో రాయలసీమ ప్రాంతంలో నదుల అనుసంధానం చేపట్ట లేకపోతే భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతానికి నదుల అనుసంధానం జరిగే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని రాయలసీమ ఉద్యమకారులుగా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఇపుడు వచ్చీ రాని నీళ్లతోనే హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు అద్భుతమైన పంటలు తీసే రైతాంగం తరపున ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే నీళ్లు అందించలేని ఎత్తిపోతల పథకాలు, రెయిన్ గన్నుల పథకాలు, మేఘ మధన పథకాలతో రాయలసీమ ప్రజలను అడుగడుగునా అవమాన పరచవద్దు. శ్రీభాగు ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాజధానిని హైకోర్టును అదేవిధంగా గుంటకల్లుకు రావలసినటువంటి రైల్వే జోన్ ను, అనంతపురానికి రావాల్సినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ను, తిరుపతిలో శంకుస్థాపన చేసినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ను మధ్య కోస్తాకు తరలించి రాయలసీమ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయవద్దు. అదే జరిగితే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో రాయలసీమ రాష్ట్ర నినాదానికి పునాది వేసినట్లు అవుతుంది.
(తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు)