దశల వారీగా ప్లాస్టిక్ నిషేధం అమలు
నల్లమల అడవిలోకి వెళ్లే సమయంలోను, సందర్శకులు వెళ్లే సమయంలోను ఎంట్రన్స్‌లోనే ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద అటవీ శాఖ అధికారులు చెకింగ్ చేస్తున్నారు. సందర్శకులు వెళ్లేందుకు దాదాపు 14 నుంచి 15 వరకు చెక్ పోస్టులు ఉన్నాయి. అన్నింటిల్లోను చెకింగ్ చేపట్టారు. ప్లాస్టిక్ బాటిల్స్, కానీ ప్లాస్టిక్ బ్యాగ్‌లు కానీ ఉంటే వాటిని తీసుకొని వాటికి బదులుగా పర్యావరణానికి హాని కలిగించని గ్లాసు వాటర్ బాటిల్స్ అందుస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా పేపర్, క్లాత్, జూట్‌తో తయారు చేసిన సంచులు అందిస్తున్నారు.
తొలుత సందర్శకులకు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టం గురించి సందర్శకుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముందే ఎందుకు చెప్ప లేదు, చెప్పి ఉంటే మేము ప్లాస్టిక్ తీసుకొని రాము కదా అని తొలుత సందర్శకుల నుంచి కాస్త విముఖత వ్యక్తం అవుతున్నప్పటికీ వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించిన తర్వాత సందర్శకుల్లో కూడా మార్పు కనిపిస్తోందని గిద్దలూరు డివిజన్ ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ వైవి నరసింహరావు ది ఫెడరల్‌కు వివరించారు. మినిమమ్ కాస్ట్‌కే గ్లాసు బాటిల్స్, జూట్, ఇరత బ్యాగ్‌లు అందిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా అటవీ ప్రాంతంలోను, సందర్శకులు వెళ్లే రోడ్డు ప్రాంతాల్లో పడేసిన ప్లాస్టిక్ వస్తువులను తొలగించేందుకు ప్రత్యేకంగా స్వచ్ఛంగా సేవా సంస్థలకు సంబంధించిన బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలా సేకరించిన ప్లాస్టిక్ వస్తువులను తిరిగి రీసైక్లింగ్ యూనిట్లకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నల్లమల ప్రాంతంలో టెంపుల్స్ ఎక్కువుగా ఉన్నాయి. ఆత్మకూరు, మార్కాపూర్, నంద్యాల, గిద్దలూరు ఇలా అన్ని డివిజన్‌లలో కలిపి 15 వరకు పిలిగ్రిమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు కూడా ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపైన అవేర్‌నెస్ కార్యక్రమాలు చేపట్టారు. దీని కోసం ఆయా దేవాలయాల అథారిటీలను ప్లాస్టిక్ నిషేధంపై భాగస్వాములను చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, దేవాలయాల అథారిటీలను సమన్వయం చేసుకుంటూ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీశైలం దేవాలయ పెద్దలు, అధికారులతో కూడా ఇది వరకే భాగస్వాములను చేశారు. శ్రీశైలం దేవస్థానం ఈవోతో పాటు ఇతర అధికారులు, ఆ ప్రాంతంలో ఉన్న షాపుల యజమానులు, సిబ్బందితో కూడా అటవీ శాఖ అధికారులు చర్చలు జరిపారు. ప్లాస్టిక్ రహిత నల్లమలకు సహకరించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు పర్యావరణ పరిరక్షణకు ఇరు శాఖల అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు నరసింహరావు వివరించారు. అయితే తొలినాళ్లల్లో శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో సందర్శకులు ప్లాస్టిక్ వాడకం కొనసాగించారని, దీంతో ప్లాసిక్ వస్తువులన్నింటిని స్వాధీనం చేకున్నట్లు తెలిపారు. వాటికి బదులుగా గ్లాసు నీళ్ల సీసాలు, జూట్ బ్యాగ్‌లను అందించి, వాటిని ఉపయోగించాలని స్ట్రిక్ట్‌గా షాపుల యజమానులకు చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిందని, దేవస్థానం పెద్దలు సహకరిస్తున్నారని చెప్పారు.
ఫారెస్టు ఏరియాలోకి వెళ్లే పాయింట్లు, పిలిగ్రిమ్ ప్రాంతాల్లో కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు ప్లాస్టిక్ నిషేధం సాధ్యమైనట్లే అని నరసింహరావు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు నల్లమలలో ప్లాస్టిక్‌ను వాడకూడదు, నిషేధించారనే సమాచారం వచ్చే సందర్శకులకు చేరవేయగలిగితే చాలా వరకు సక్సెస్ అయినట్లే అని ఆయన అభిప్రాయపడ్డారు. దీని కోసం అవసరమే అన్ని ప్రయత్నాలు చేపట్టామని, బోర్డర్ జిల్లాల నుంచి వచ్చే వారి కోసం ఆయా ప్రాంతాల్లోని చెక్ పోస్టుల ద్వారా కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు.