మహిళల మనసును ఆకట్టుకుంటూ..

నారా భువనేశ్వరి మహిళల మనస్సులను ఆకట్టుకుంటున్నారు. తన భర్త జైలులో ఉండగా మరణించిన కుటుంబాల వారిని పరామర్శిస్తున్నారు.


మహిళల మనసును ఆకట్టుకుంటూ..
x
చిన్నారికి ‘కుశల్‌ కృష్ణ’ అంటూ భువనేశ్వరి నామకరణం

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలు కుటుంబాలను ఆకట్టుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉండగా చనిపోయిన బాధిత కుటుంబాలను ఇంకా కలుస్తూనే ఉన్నారు. మధ్యలో కొంత గ్యాప్‌ ఇచ్చిన తరువాత ఒక్కో జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట శ్రీకాకుళం జిల్లా నుంచి పర్యటన ప్రారంభించిన భువనేశ్వరి ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో సాగుతున్న యాత్ర చివరి దశకు చేరుకుంటోంది.

మహిళా పాడిరైతులతో ప్రత్యేకంగా..
భువనేశ్వరి నేరుగా మహిళలను కలిసేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేశారు. పాడి రైతు మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మహిళా పాడిరైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో ఆర్థికంగా మహిళలు ఎందుకు ఎదగాలో చెబుతున్నారు. అలాగే రాజకీయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అక్కడి మహిళలకు మైకులు ఇచ్చి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.
రాజకీయ ఆరోపణలు..
వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని రాజకీయ ఆరోపణలు చేస్తూ యాత్ర సాగుతోంది. సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో గురువారం యాత్ర సాగింది. మడకశిర సెంటర్‌లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
ఆర్థిక సాయం అందిస్తూ..
బాధిత కుటుంబ సభ్యులకు రూ. 3లక్షలు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఓట్ల జాబితాలో అవకతవకలు పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే మన ఆయుధం, ఆ ఆయుధంతో వైసీపీని ఓడించాలని పిలుపు నిచ్చారు.
బాబుకు నామకరణం
హిందూపురంలో పర్యటిస్తున్నప్పుడు భువనేశ్వరి ఓ చిన్నారికి నామకరణం చేశారు. సింగనమల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త హేమంత్‌ యాదవ్, శోభాయాదవ్‌ దంపతులకు మగ పిల్లాడు జన్మించాడు. హిందూపురంలో నిజం గెలవాలి కార్యక్రమం వద్దకు హేమంత్‌ యాదవ్‌ దంపతులు తమ బిడ్డతో వచ్చారు. తమ బిడ్డకు నామకరణం చేయాలని హేమంత్‌ యాదవ్‌ దంపతులు కోరారు. దీంతో ‘కుశల్‌ కృష్ణ’ అంటూ చిన్నారికి భువనేశ్వరి నామకరణం చేశారు.
Next Story