ప్రజల మధ్య నారా కుటుంబం
నారావారి కుటుంబం పూర్తిగా రాజకీయాల్లోకి దిగారు. ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాని నారా భువనేశ్వరి ఈ సారి ఎన్నికల బరిలో ప్రచార సారధిగా అడుగులు వేస్తున్నారు.
40 ఏళ్ల తరువాత నారావారి కుటుంబ సభ్యులందరూ పూర్తిగా రాజకీయాల్లోకి దిగారు. ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాని నారా భువనేశ్వరి ఈ సారి ఎన్నికల బరిలో ప్రచార సారధిగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం నుంచి నారా లోకేష్ రాజకీయ అరంగేట్రం చేశారు. తన వాక్చాతుర్యం, పట్టుదల, ప్రజల్లో మమేకం కావడం ఈ రెండేళ్లలో పూర్తిస్థాయిలో జరిగింది. లోకేష్ భార్య నారా బ్రాహ్మణి తన కుమారునితో సహా రోడ్డుపైకి వచ్చారు. మామ, భర్త లోకేష్‌లకు తోడుగా నిలిచారు.
తండ్రికి బెయిల్ తెప్పించడంలో లోకేష్ సక్సెస్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ మేరకు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపారు. తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కుమారుడు లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో జైలు నుంచి బయటకు రాగానే ముందుగా రాష్ట్రంలోని పలు దేవాలయాలకు వెళ్లి నారా చంద్రబాబు, ఆయన సతీమణి పూజలు చేశారు. ఇంట్లో హోమం కూడా నిర్వహించారు.
‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి ప్రజల మధ్యకు
చంద్రబాబు జైలులో ఉండగా కొందరు ఆ బాధను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నిర్థారించింది. వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి తీసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి వారిని ఓదార్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పటికీ ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఆమె పర్యటించారు. బాధిత కుటంబాలను ఓదార్చారు. ఒక్కో కుటంబానికి రూ. 3లక్షల వరకు ఆర్థిక సాయందదించారు.
భువనేశ్వరిలో గొప్పదనం ఏంటంటే..
భర్త జైలులో ఉన్నారని బాధ ఉన్నా బయటకు కనిపించకుండా గుండె నిండా ధైర్యం నింపుకుని జనం మధ్యకు వచ్చారు. ఆమె ఎంతో ధైర్యంగా ఉంటూ, ఆమె చెప్పే మాటలు విన్నవారికి మాత్రం కన్నీరు తెప్పించాయి. ఎంతో మంది ముసలి వారు ఆమె ఆవేదనా భరిత మాటలు విని కన్నీరుమున్నీరయ్యారు. ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో ప్రజలకు తెలవాలి. అందుకే ‘నిజం గెలవాలి’ అంటూ నేను పోరాడుతున్నాను. నా పోరాటానికి మీ అందరి సహకారం కావాలని అర్థించారు. వేల మంది హాజరైన సభల్లో ఎంతో గుంభనంగా తన భావావేశాలను వెల్లడించారు. మొదటి రెండు సభల్లోనే జనాన్ని ఆకట్టుకున్నారు. ఆ తరువాత చంద్రబాబునాయుడు విడుదల కాగానే యాత్రను ఆపి తిరిగి కొనసాగిస్తున్నారు.
జనాన్ని మెప్పిస్తూ...
నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా తండ్రి జైలుకు వెళ్లడంతో యాత్రకు విరామం ప్రకటించి తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే వరకు పోరాడారు. ఢిల్లీలో కొన్ని రోజులు మకాం వేశారు. ఆ తరువాత ముఖ్యమైన నేతలతో మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపించడంలో సఫలమయ్యారు. లోకేష్ వాక్‌చాతుర్యం పలువురిని ఆశ్చర్య పరుస్తున్నది. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో తెలుగు స్పష్టంగా మాట్లాడేందుకు కొంత ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తండ్రి బాటలోనే సభలు, సమావేశాలు సక్సెస్ చేస్తూ వస్తున్నారు. అధికారుల తీరును దుయ్యబట్టారు. రెడ్‌బుక్ పేరుతో మీ పేర్లు నోట్ అవుతున్నాయని వారి గుండెల్లో దడ పుట్టించారు.
పూర్తి స్థాయిలో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు
చంద్రబాబునాయుడు ‘రా కదిలిరా’ పేరుతో రాజకీయ సభలు ప్రారంభించారు. మొదటి రోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో సభ ఏర్పాటు చేయగా రెండో సభ కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించారు. ఆ సభల్లో జగన్ పాలనపై విరుచుకు పడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచి మరో వంద సంవత్సరాలు కోలుకోకుండా చేశారని విమర్శలు గుప్పించారు. ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఇక రాష్ట్రమంతా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
మంగళరిగిలో లోకేష్
ప్రస్తుతం లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పదిరోజులపాటు నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజులు పాదయాత్ర, ఇతర కార్యక్రమాల్లో ఉన్నందున వాటిని ముగించుకుని కొద్ది రోజులు నియోజకవర్గంలో ప్రజలను కలిస్తే బాగుంటుందని భావించారు. నియోజకవర్గ జనం మధ్య తిరుగుతూ వారిని కలిసి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
బ్రహ్మణి మంచి మాటకారి..
నారా బ్రహ్మణి కూడా మంచి మాటకారి. మామ జైలులో ఉన్నప్పుడు జరిగిన సభల్లో ఆమె మాట్లాడిన తీరు పలువురిని ఆకర్షించింది. ఎంతో అనుభవం ఉన్న యువతి ప్రసంగిస్తున్నట్లు ఆమె చేసిన ఉపన్యాసం ఉంది. తండ్రి బాలకృష్ణ, భర్త లోకేష్‌ల సమక్షంలో ఆమె ఎంతో ధైర్యంగా ఎటువంటి వడిదుడుకులు లేకుండా మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ పదవికి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Next Story