మంత్రిగా ఛార్జ్ తీసుకున్న లోకేష్.. నిర్ణయాలు నెరవేరుతాయా..!
x

మంత్రిగా ఛార్జ్ తీసుకున్న లోకేష్.. నిర్ణయాలు నెరవేరుతాయా..!

మంత్రులుగా ఛార్జ్ తీసుకున్న ప్రతి నేత బాధ్యతలతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిపై సంతకాలు కూడా చేశారు. ఆ నిర్ణయాలు నెరవేరుతాయా? అయితే ఎప్పటికి?


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ఉదయం సచివాలయంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రిగా ఛార్జ్ తీసుకుని పలు దస్త్రాలపై సంతకాలు చేశారు లోకేష్. వీటిలో మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రం కూడా ఉంది. సీఎం ఖరారు చేసిన 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ విధివిధానాలను క్యాబినెట్ ముందు ఉంచే ఫైల్‌పై లోకేష్ సంతకం చేశారు. డీఎస్సీ అమలు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని ఆయన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న ప్రతి నేత కూడా ఎన్నడూ లేనివిధంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తమ శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారు తీసుకుంటున్న నిర్ణయాలే రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా ఉన్నాయి.

అమలు జరిగేనా!

సీఎం సహా ప్రతి శాఖ మంత్రి కూడా బాధ్యతలు తీసుకున్న అనంతరం తమ శాఖకు సంబంధించిన కీలక అంశాల దస్త్రాలపై సంతకాలు చేస్తున్నారు. వాటి గురించి ప్రకటిస్తున్నారు కూడా. సదరు అంశాల విషయంలో తమ అప్రోచ్ ఎలా ఉండనుందని అన్న విషయాలను వారు వివరిస్తున్నారు. అయితే వారు సంతకాలు చేస్తున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు కానీ అవి వారు చెప్పిన విధంగా అమలవుతాయా? లేకుంటే గతంలో అనేక ఫైళ్ల తరహాలోనే ఇవి కూడా అటకెక్కుతాయా? అన్న అనుమానాలను ప్రజలు లేవనెత్తుతున్నారు. అన్ని శాఖ మంత్రులు చెప్పడానికి వినసొంపుగా తమ నిర్ణయాలు చెప్తున్నారు.. మరి వాటి ఆచరణలో కూడా అదే దూకుడు కనబరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

సూపర్ సిక్స్ ఎక్కడ?

ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అంటూ అందరినీ ఆకర్షించిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాటి ఊసు కూడా ఎత్తలేదు. తాజాగా రవాణా, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్‌ప్రసాద్.. తొలిసారి సూపర్ సిక్స్‌లోని ప్రధాన హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించారు. ఇప్పటికే కసరత్తులు ప్రారంభించామని, ఆర్‌టీసీకి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. దాదాపు ఒక నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు. అంతకు మించి సూపర్ సిక్స్‌లో కానీ, సూపర్ సిక్స్ 2.0లో కానీ చెప్పిన ఏ హామీ గురించి కానీ ఎవరూ స్పందించలేదు.

ఆ కారణంగానే ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పిన సూపర్ సిక్స్ హామీల గురించే పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు సంతకాలు చేసిన వాటినైనా నెరవేరుస్తారా లేక అటకెక్కిస్తారా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సంతకాలు చేసిన అంశాలు పూర్తి ఎప్పటిలోపు అవుతుందో ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు చెప్పలేదని, వాటిని ఈ ఐదేళ్లు పూర్తయ్యేలోపు చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అదే విధంగా ఎన్నడూ లేని విధంగా బాధ్యతలతో పాటు ఒక కీలక అంశంపై మంత్రి దృష్టి సారించడం మంచి పరిణామం అని, రాజకీయాల్లో మార్పు వస్తుందని అంటున్న వారు కూడా ఉన్నారు. ఇది వరకు ఎప్పుడూ కూడా ఏ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై ఆరోజు మమ అనిపించేవారు. కానీ ఈసారి మాత్రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాము తొలుత చేపట్టే పనులకు సంబంధించిన దస్త్రాలపై సంతకం చేయడం ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి ఆ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం నిలుపుకుంటుందో వమ్ము చేసుకుంటుందో చూడాలి.

Read More
Next Story