జగన్ ‘మురుగుడు’ ప్రయోగానికి లోకేష్ విరుగుడు
నారాలోకేష్ మంగళగిరి వ్యూహం ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిసి క్యాండిడేట్ ను ప్రకటిస్తే, టిడిపి నేత లోకేష్ విరుగుడు ప్రకటించారు. వివరాలు
తెలుగు దేశం పార్టీ నెంబర్ 2 నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా నైనా సరే మంగళగిరిలో జెండా ఎగరేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఆయన చాలా తక్కువ మార్జిన్ (5372 ఓట్లు)తో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే, ఈ సారి ఆయన వైసిపిని ఓడించేందుకు వ్యూహం రూపొందించుకుంటున్నారు. వైసిపిలో ఈ సీటును కాపాడుకోవాలనే తాపత్రయం బాగా గందరగోళానికి దారి తీసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సారి గెలవడని భావించి వైసిసి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని రంగం నుంచి తప్పించారు. ఆయన స్థానంలో బిసి అభ్యర్థిగా మొదట ఒక పేరు ప్రకటించారు. తర్వాత మార్చారు. పోతూ పోతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య మంత్రి మీద చెడామడా వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరి షర్మిలతోనే తన ప్రయాణం అన్నారు. అక్కడేం జరిగిందో ఏమో మళ్లీ వెనక్కొచ్చి జగన్ జిందాబాద్ అన్నారు. దీనితో ఆయన ఇమెజ్ బాగా దెబ్బతినింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతివ్యూహం రూపొందించింది.
ఈ సారి తెలుగుదేశం పార్టీ వస్తుందేమోనన్న భయంతోనే జగన్ మంగళగిరి నుంచి పద్మశాలి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఇక్కడ మొదట మాజీ మునిసిపిల్ ఛెయిర్మన్ గంజి చిరంజీవిని నిలబెడతారనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయన్న టిడిపిలో నుంచి వైసిపిలోకి లాగారు. తర్వాత ఏమనుకున్నారో ఏమో పద్మశాలి మహిళను, మాజీ మంత్రి మురుగుడు హన్మంతరావు కోడలు లావణ్య ని ఎంపిక చేశారు.
రాష్ట్రంలో పద్మశాలీలు అధికంగా ఉన్న మూడునాలుగు నియోజకవర్గాలలో ఇదొకటి. ప్రొద్దుటూరు, ధర్మవరం వంటి నియోజకవర్గాలు అగ్రకులాలకే పోయాయి. ఈ సారి దీనిని బిసిలకు కేటాయించాలని జగన్ నిర్ణయించి రామృష్ణారెడ్డిని త్యాగం చేయమన్నారు. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ బిసి వోట్లను లాక్కునే ప్రమాదం బాగా కనబడుతూ ఉంది. దానిని దెబ్బతీసేందుకు ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి, బిసి ప్రయోగం చేస్తున్నారు. దానికి ఆయన మనసులోరాజధాని విశాఖకు తరలించాలన్న ఆలోచన ఉంది కాబట్టి, మంగళగిరికి అంత ప్రాముఖ్యం లేదు. ప్రాముఖ్యం లేని చోట బిసికి సీటిస్తే లాభమెక్కువ. అందుకే ఆయన ఈ సీటు బిసిలకు కేటాయించారు.
ఇపుడు దీనికి తెలుగుదేశం పార్టీ విరుగుడు కనిపెట్టింది. ఇది పని చేస్తుందో లేదో గాని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న నారా లోకేష్ మంగళగిరి పేదలకు, ఇక్కడ అత్యధిక ఓట్లున్న కులం పద్మశాలీలకు చాలా వరాలు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీ నా టార్గెట్ అంటున్నారు. ఈసారి జనసేనతో పొత్తు ఉండటం కూడా ఆయన 53 వేల టార్గెట్ కు కారణమయి ఉండవచ్చు.
నిన్న టీడీపీ-జనసేన పార్టీలు నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో తనకు మంగళగిరి ప్రజలకు, ముఖ్యంగా పద్మశాలీలకు చాలా వరాలు ప్రకటించారు.
ఆ వరాలు ఇవి:
మంగళగిరి చుట్టూ ఉన్న కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో పేదలు ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఆ భూములను క్రమబద్ధీకరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల కోసం 20 వేల ఇళ్లు కూడా కట్టిస్తామన్నది ఆయన చేసిన రెండో వాగ్దానం.
చేనేత వృత్తిలో ఉన్న పద్మశాలీలు మంగళగిరి నియోజకవర్గంలో వారు స్వర్ణకారులుగా ఉంటున్నారు. వీరిని ఆదుకునేందుకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం తీసుకువచ్చిన పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రమంతా అమలుచేస్తామని అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ సందర్భంగా కొందరు రైతుల భూములను యూ1 జోన్ లో పెట్టారు. రైతులు దీనిని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. దానిని కూడా రద్దు చేస్తామని చెప్పారు.
ఈ వరాలు వచ్చే ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ ను గెలిపిస్తాయా వేచి చూడాలి.