నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్య.. కుమారుడికి మెసేజ్ పెట్టి..
x

నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్య.. కుమారుడికి మెసేజ్ పెట్టి..

నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ కథ విషాదాంతమైంది. ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది.


నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ అధ్యశ్యం అంశం కొన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. అటువంటి ఆ ఎంపీడీఓ కథ విషాదాంతమైంది. ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన ఫోన్ లొకేషన్ ఎక్కడినుంచి అయితే మిస్ అయిందే ఆ ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోనే మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకటరమణ.. జూలై 3వ తేదీ నుంచి సెలవు పెట్టారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి వెళ్లారు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలోనే ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పారు. ఆ తర్వాత అర్థరాత్రి(జూలై 16న) తన కుమారుడికి ఒక మెసేజ్ పెట్టారు. ‘నా పుట్టిన రోజైన జూలై 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త’ అని అందులో రాశారు. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాసిన తన సూసైడ్ నోట్‌ను కూడా ఆయన తన కుటుంబీకులందరికీ ఫోర్వర్గ్ చేశారు.

ఆయన తన సూసైడ్ నోట్‌లో వైసీపీ నేత ప్రసాదరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు వెంకటరమణ. ‘‘నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టర్ రెడ్డప్ప థవేజీ చేస్తున్న బెదిరింపులు తాళలేకపోతున్నా. నాకు న్యాయం చేయండి’ అని అందులో ఉంది. ఆ మెసేజ్ చదివిన కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు వెంకటరమణ ఫోన్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఆయన ఫోన్ సిగ్నల్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపును వేగవంతం చేశారు పోలీసులు. చివరకు ఆయన ఫోన్ సిగ్నల్ ఆగిపోయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోనే మృతదేహం లభ్యమైంది.

ఇదిలా ఉంటే వెంకటరమణ ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి? ఆయన తన సూసైడ్ నోట్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? వంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అసలు ఆయన మచిలీపట్నం ఎందుకు వెళ్లారు? ఎవరైనా పిలిచారా? అన్న కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసుల అధికారులు చెప్పారు.

Read More
Next Story