విశాఖ సాగరతీరంలో ప్రత్యక్ష యుద్ధం!
నేవీ డేలో ఒళ్లు గగుర్బొడిచేలా సమర విన్యాసాలు. అతిథులుగా హైకోర్టు చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి. మనవడు దేవాన్స్‌తో హాజరైన సీఎం చంద్రబాబు
మనం యుద్ధం ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా చూడం.. యుద్ధం జరిగాక కొన్ని సన్నివేశాలను ఎప్పుడో టీవీల్లోనో చూస్తాం. కానీ శత్రువులపై సముద్రం నుంచి ఎలా యుద్ధం చేస్తారో, వారినెలా మట్టుబెడతారో కళ్లారా చూసే అవకాశం విశాఖ సాగరతీరంలో తూర్పు నావికాదళం కళ్లకు కట్టింది. నేవీ యుద్ధం ఎలా జరుగుతుందో విశాఖ వాసులకు ప్రత్యక్షంగా చూపింది. పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో విజయం సాధించినందుకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4న నేవీ డేని జరుపుతుంది. తూర్పు నావికాదళం దీనిని విశాఖ సాగరతీరంలో దీనిని నిర్వహిస్తుంది.
కానీ 2024లో డిసెంబర్ 4న విశాఖలో కాకుండా ఒడిశాలోని పూరీలో నిర్వహించింది. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞాపనలతో సరిగ్గా నెల రోజుల అనంతరం జనవరి 4న విశాఖ ఆర్కే బీచ్ నేవల్ ఆపరేషనల్ డెమానిస్ట్రేన్ను చేపట్టింది. దీనికి తూర్పు నావికాదళ ప్రధానాధికారి రాజేష్ పెందర్కార్ నేతృత్వంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విశిష్ట అతిథిగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్లు హాజరయ్యారు.
ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు..
శనివారం సాయంత్రం 4.20 గంటలకు విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్లో ఈ నేవీ డే వేడుకలు మొదలయ్యాయి. తొలుత హాక్ యుద్ధ విమానాల నుంచి బాంబులు పేల్చడంతో యుద్ధ విన్యాసాలు ఆరంభమయ్యాయి. ఆపై జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలా సముద్ర గర్భం నుంచి బయటకొస్తూనే శత్రువులపైకి మెరుపు దాడులు చేస్తూ సెయిల్ పాస్ట్ విన్యాసాన్ని ప్రదర్శించి కనుమరుగైంది. ఆపై మెరైన్ కమెండోస్ (మార్కోస్) శత్రు సైన్యంపైకి దాడి చేయడానికి జెమినీ బోట్లలో దూసుకు వచ్చే ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం శత్రు సైనాన్యినికి చిక్కిన భారత నేవికులను విడిపించడం, శత్రువులను కాల్చి చంపడం వంటివి ప్రదర్శించారు. అలాగే సీకింగ్-42 హెలికాప్టర్లో నుంచి నేవికులు తాడుతో దిగి అవసరమైన చోట బోటులో దించే విన్యాసం చేపట్టారు. తర్వాత సముద్రంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన శత్రువుల ఆయిల్గ్ను నేవీ డైవింగ్ టీమ్ ధ్వంసం చేసింది. ఆ పొగ కిలోమీటర్ల మేర ఆకాశంలో కమ్ముకుని కనువిందు చేసింది. ఇక ఉభయ చర యుద్ధ ట్యాంకులు సముద్రంలోంచి వచ్చి తీరంలో ఇసుకలో చక్కర్లు కొట్టాయి.
అలాగే సముద్రం నుంచి ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి నేవీ డ్రైవర్లు త్రివర్ణ పతాక పారాచ్యూట్లతో సాహసోపేతంగా దూకి నేవీ డే వేడుకలు జరిగే ప్రాంతంలో దిగి అబ్బుర పరిచారు. అనంతరం యుద్ధ విమానాలపైకి హెలికాప్టర్లు దింపే విన్యాసాలు, యాంటీ సబ్మెరైన్ రాకెట్ విన్యాసాలు, అటు సముద్రంలోనూ, ఇటు నేలపైన దూసుకుపోగల ఉభయచర యుద్ధ ట్యాంకుల ప్రదర్శన ఔరా అనిపించాయి. మరికొన్ని హెలికాప్టర్లు సముద్ర అలలను తాకేలా కిందకు వాలిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. వాటితో పాటే హాక్స్ యుద్ధ విమానాలు భూమిపైకి దూసుకొస్తున్నాయా? అనిపించేలా ప్రదర్శించిన విన్యాసాలు భయం గొలిపాయి.
ఇంకా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు బాణం ఆకారంలోనూ, డోనియర్ హెలికాప్టర్లు డైమండ్ ఆకారంలోనూ సమూహంలా ఏర్పడి ప్రయాణించాయి. ఆ తర్వాత అత్యాధునిక పీ8-ఐ నిఘా ఎయిర్ క్రాఫ్ట్ నిప్పులు చిమ్ముతూ తన ప్రతిభను చూపించింది. ఇలా నేవికాదళ విన్యాసాలు, నేవీ సామర్థ్యాలను, ప్రతిభా పాటవాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. వీక్షించడానికి రెండు కళ్లూ చాలలేదు.. ఈ అద్భుత విన్యాసాలను వీక్షించడానికి విశాఖ వాసులే కాదు.. పొరుగున ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సూర్యాస్తమయ సమయం వరకూ నేవీ యుద్ధ విన్యాసాలను కొనసాగించారు. ఆ తర్వాత వరుసగా నిలిపిన యుద్ధ నౌకలకు ఒకేసారి విద్యుద్దీపాల వెలుగులు విరజిమ్ముతూ మిరుమిట్లు గొలిపాయి. నేవీ బ్యాండ్ బీటింగ్ రిట్రీట్తో నేవీ డే వేడుకలను ముగించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తూర్పు నావికాదళ ప్రధానాధికారి రాజేష్ పెంచార్కర్లు ప్రసంగించారు.
ప్రత్యేక ఆకర్షణగా దేవాన్ష్ !
ఈ నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేష్ కుమారుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి కూడా నేవీ డే వేడుకలకు హాజరయ్యారు. వేదికపై వీరిద్దరి మధ్య దేవాన్ష్ కూర్చున్నాడు. మధ్యమధ్యలో విన్యాసాల గురించి మనవడు దేవాన్ష్‌కు వివరిస్తూ చంద్రబాబు మురిసిపోయారు.