మనసు పలికింది సన్నాయి పాట..
x

మనసు పలికింది సన్నాయి పాట..

సన్నాయి పాటతో తిరుమల శ్రీవారు పవలిస్తారు. ఆ కీర్తనలతో వేకువజామున మేల్కొంటారు. ఈ అదృష్ట భాగ్యం నాయీ బ్రాహ్మణులకు దక్కింది.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: దేవుణ్ణి ఎవరైనా చూశారా.!? ఆయనతో ఎవరైనా మాట్లాడతారా.. పోనీ మాట్లాడారా?! ఈ ప్రశ్నలకు ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెబుతారు. తనువంతా ఆవాహం చేసుకున్న రీతిలో భక్తులు చెప్పే మాట శ్రీహరి వింటారు. తనకు ఇష్టమైన మాటలు, పాటలు కూడా ఆస్వాదిస్తారు. ఈ మాటలు కొద్దిగా అతిశయోక్తి అనిపించినా... కలియుగ వైకుంఠంలో ఇది ఆచారం. నిత్యం సాగే వ్యవహారమే...ఆలయ కట్టుబాట్లు. నిర్వహణ.. ఒక్కో వంశానికి, మరో తెగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రాధాన్యత ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామి వారికి నిర్వహించే కార్యక్రమాల్లో అవన్నీ అమలవుతుంటాయి. ఎన్ని ఉత్పాతాలు ఎదురైన ఈ ఆచార వ్యవహారాలు ఇక్కడ అక్షరాల అమలవుతాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో భాగంగా వందల వేల సంవత్సరాల నుంచి సాగుతున్న ఆచార వ్యవహారాల్లో.. మరో అంశం తెలుసుకుందాం..!

మనసుతో పలకరిస్తే.. అన్ని సాధ్యమే..

సంగీతం అంటే పాములు కూడా పడగవిప్పి ఆడతాయనేది వింటూ ఉంటాం. శేషతల్పంపై ఆసీనులైన మహావిష్ణువు మరో అవతారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిగా తిరుమలలో కొలువయ్యారు. బ్రహ్మోత్సవాల వేళ చిన్న, పెద్ద పెద్దశేష వాహనంపై విహరించే.. స్వామివారికి తన సన్నిధిలో సన్నాయి పాట వినసొంపుగా ఉంటుంది. ఆ సన్నాయి రాగాలు వింటూ విశ్రమించే శ్రీవారు.. అదే రాగాలు, మాటలతో మేల్కొంటారు. సన్నాయితో స్వామివారిని కీర్తిస్తున్న ఓ వ్యక్తి కలియుగ వైకుంఠంలో స్వామివారికి నివేదన ఇస్తున్నారు.

వేకువజామున రెండు గంటల ప్రాంతంలో సన్నాయి చేత పట్టుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వెలుపలికి రావడం కనిపించింది. నన్ను ఫెడరల్ ప్రతినిధిగా పరిచయం చేసుకుని కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ నాయీ బ్రాహ్మణుడు తన పేరు డి. ప్రసాద్ అని చెప్పారు. ‘‘తిరుమల శ్రీవారి ఆలయంలో వేద పండితులు, జీయర్ స్వాములు, ఏకాంగులు, అన్నమాచార్య వంశస్థులు, సన్నిధి గొల్ల పాత్ర ఎంత ప్రధానమైనవో... నాయీ బ్రాహ్మణులుగా మాకు వరప్రసాదంగా నాదస్వర నివేదన అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అని తన అనుభూతిని పంచుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో ప్రసాద్ ఆస్వాదిస్తున్న ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆయన మాటల్లోనే...


" శ్రీవారి సన్నిధిలో నాదస్వరం వినిపించే నాయీ బ్రాహ్మణులం 10 నుంచి 15 మందిమి ఉన్నాం. వంతుల వారీగా శ్రీవారి ఆలయంలో రాత్రి (వేకువజాము) శ్రీవారికి పవళింపు సేవలో జోల పాటతో పాటు, సుప్రభాత సేవతో మేల్కొల్పడంలో నాదస్వరంతో నివేదన సమర్పిస్తాం. అది కూడా స్వామివారి మూలవిరాట్టు ఎదురుగా 15 నిమిషాలు నిలబడి... రాగాలు పలికించడానికి మా స్వరానికి అలుపు ఉండదు. వేళ్ళకు శ్రమ తెలియదు. స్వామి వారి విగ్రహాన్ని చూడగానే మాలో తెలియని శక్తి ప్రసరిస్తుంది. ఓ కాంతిపుంజం మాలో శక్తిని పెంచుతుంది. అప్పుడే ఇన్ని నిమిషాలు గడిచిపోయా అనిపిస్తుంది" అని సన్నాయిపై సప్త స్వరాలు పలికించే ప్రసాద్ చెప్పారు.

"నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాల కిందటి నుంచి స్వామి వారి సన్నిధిలో రాగాలు పలికించే అపురూపమైన భాగ్యం లభించింది. మా పెద్దలు చేసుకున్న పుణ్యఫలం నాకు ఈ రూపంలో వరంగా లభించింది’’ అని ప్రసాద్ తన మనసులో మాట చెప్పారు. "స్వామివారి సన్నిధిలో పవళింపు సేవలో డ్యూటీకి వెళతానని ఊహించలేదు. సన్నాయి పట్టుకోవడానికి కూడా సాధ్యం కాని అనుభూతి కలిగింది. నాకు ఈ వరం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు" అని ప్రసాద్ తన్మయత్వంతో చెప్పారు.

‘‘మొదటిసారి సన్నిధిలోకి వెళ్ళగానే.. నిలువెత్తు శ్రీవారి విగ్రహం కళ్ళెదుట కనిపిస్తుంటే... తదేకంగా చూస్తూ ఉండిపోయా... స్వర్గంలోకి ప్రవేశించాననే అనుభూతి కలిగింది. కళ్ళలో నుంచి నీరు ఉబికి వస్తోంది. నోట మాట రాలేదు. ఒళ్లంతా కంపించిపోయింది. కొద్దిసేపటికి నన్ను నేను నిభాలించుకున్నా. నెమ్మదిగా సన్నాయి చేతి నుంచి పైకి లేపే, అంతే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అర్చక స్వాములు వచ్చి సముదాయించి పక్కకు తీసుకుని వచ్చారు. అప్పటివరకు నన్ను నేను మర్చిపోయాను. స్వామి వారితో ఈ జన్మకి ఇది చాలు అని నివేదించుకున్న" అని ప్రసాద్ అన్నారు. అలా.. ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్వామి వారు తనతో ప్రతిరోజు ఉదయం మాట్లాడుతూనే ఉన్నారు. తనకు కలిగిన అనుభూతి అదని, శ్రీవారితో నేరుగా తాను మాట్లాడుతున్నట్టే అనిపించిందని తన్మయత్వంతో చెప్పారు.

‘‘శ్రీవారి సన్నిధిలో పవళింపు సేవ ఆ తర్వాత సుప్రభాత సేవకు వెళ్లి మేలుకొలుపు సమయంలో... కాంబోజి రాగం, ఆనంద భైరవి, నీలాంబరి, మాధ్యమావతి రాగాలు సన్నాయితో పలికిస్తూ, పలికిస్తూ... తిరుమల శ్రీవారిని మురిపించే భాగ్యం నాకు దక్కడం ఇక మాటల్లో చెప్పడం నావల్ల కాదు. శ్రీవారి కృప లీలలు ఇలాగే ఉంటాయి. స్వామివారిని చూస్తూ గడిపే సమయం ఎంతమందికి దొరుకుతుంది. అది నాకు లభించడం ఏ జన్మ పుణ్యఫలమో.. నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమో తెలియదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గడపడం నాకు, నా కుటుంబ సభ్యులకు లభించిన గొప్ప వరం. ఈ జన్మకి ఇది చాలు. మళ్లీ జన్మ ఉంటే శ్రీవారి సేవకుడిగానే పుట్టాలని ఉంది’’ అని ప్రసాద్ తన అనుభూతులను ఫెడరల్ ప్రతినిధితో పంచుకున్నారు.


నాకు లభించిన ఓ గొప్ప వరం

అది వేసవి కాలం అయినా సరే. కలియుగ వైకుంఠంలో రాత్రివేళ వీచే చల్లటి గాలి శరీరాన్ని మరో లోకానికి తీసుకు వెళుతుంది. మందర స్థాయిలో వినిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్తుతించే కీర్తనలు మైమరిపిస్తాయి. నడి రాత్రి శ్రీవారి ఆలయ సన్నిధికి వెళ్ళిన నాకు అదే అనుభూతి కలిగింది. ఆలయం ముందు చన్నీటితో కార్మికులు శుద్ధి చేస్తున్నారు. పాదాలకు తగులుతున్న ఆ చల్లదనం హాయిగొలిపింది. అప్పటి వరకు సహకరించనంటున్న నా శరీరం ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో కొత్త శక్తిని పొందింది. అప్పటివరకు సహకరించని నా కళ్ళు కూడా నిద్రలేమిని మరిచిపోయాయి. అదే సమయంలో శ్రీవారి ఆలయం నుంచి వెలుపలికి సన్నాయి పట్టుకుని వ్యక్తిని చూడగానే అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఆలయంలో ఈయనే కదా సన్నాయి పాట పాడేది అని.

పరుగుల మీద ఆయన దగ్గరికి వెళ్లి స్వామి.. స్వామి అని పిలిచా. నా పారా ఏగాదిగా చూసిన ఆయన.. ఎవరు మీరు అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన గుర్తింపు కార్డు చూపించి. జర్నలిస్ట్ అని చెప్పేశా. కొద్దిసేపు తటపటాయించి నాతో మాట్లాడడానికి సరే అన్నారు. ఇన్నేళ్లుగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుపతిలో అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న మైకుల్లో వినిపించే నాదస్వరం విన్నాను. కానీ అది వాయించేది మీరే అని నాకు తెలియలేదు అని చెప్పగానే.. ఆయన చెప్పిన మాట ఏంటంటే.. అది నాది కాదు స్వామి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమే నాతో పలికిస్తున్నాడని అన్నారు. ఆయన మాట కూడా నిజమే కదా అనిపించింది.

శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద సన్నిధిలో 15 నిమిషాల పాటు తన సన్నాయి కీర్తనలతో నివేదించే ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే నిజంగా శ్రీ వేంకటేశ్వర స్వామితో నేను ఎదురుగా నిలబడి మాట్లాడినట్లు అనిపించింది. ఇదే మాట నేను ఆ వ్యక్తితో పంచుకున్నా. దీనికి ఆయన చెప్పిన మాట ఒకటే.. దేనికైనా సమయం వస్తుంది. ఆ సమయం ఆ దేవదేవుడే ఇస్తారు. నాకు ఆ భాగ్యం కలిగింది అని ఆయన అనుకుంటే. నా మదిలో కూడా అదే భావన కలిగింది. దేవా నీ లీలలు ఎన్నెన్నో స్వామి. ఒక్కొక్కరిని ఒక్క విధంగా కరుణిస్తూ ఉంటావు. ఇన్నేళ్లుగా ఒక భక్తుడిగా, జర్నలిస్టుగా నీ దగ్గరికి వస్తున్నా. ఎప్పుడు నాకు ఇంత మధురానుభూతి ప్రసాదించని నువ్వు కరుణించావు. మళ్లీ ఇలాంటి అదృష్టం కలిగించమని మనసులో వేడుకుంటూ ఆ సన్నాయి ప్రసాద్‌కు దండం పెట్టు కున్నాను. మళ్లీ నాకు ఇదే తరహా వార్తలు రాయడానికి శక్తిని ప్రసాదించమని ప్రసాద్ ద్వారా వెంకటేశ్వర స్వామి వారికి నివేదించుకున్న. కొద్దిసేపటి తర్వాత ప్రసాదం నుంచి అనుమతి తీసుకుని వెనుదిరిగాను.

తిరుమలలోనే ఇది సాధ్యం

"తిరుమలలో జన్మించడం. శ్రీవారి కొలువులోనే నాకు సేవ చేసే భాగ్యం దొరకడం ఓ వరం" అని శానిటేషన్ పనులు పర్యవేక్షించే పీకే నారాయణ అన్నారు. తెల్లవారుజాము ఇంటి ముందు శుభ్రం చేసి కళ్లాపి చల్లడానికి ఎంత ప్రాధాన్యం వుంటుందో.. వేలాది మంది భక్తులు సంచరించే ఆలయం ముందు.. వేకువ జామున అంతకంటే నిష్టగా చన్నీటితో శుభ్రం చేస్తుంటారు. ఆ సమయంలో అర్చక స్వాములు ఆలయానికి ప్రవేశించే సమయం అది. అదే వేళలో ఆలయం ముందు శుభ్రం చేయించే విధుల్లో ఉన్న పీకే నారాయణన్.. ఫెడరల్ ప్రతినిధి పలకరించగా.. కొద్దిసేపటి తర్వాత ఆయన తన భావాలను పంచుకున్నారు. ఈ క్షేత్రంలోనే నాకు నా తల్లిదండ్రులు జన్మనిచ్చారు. ఇక్కడ శ్రీవారి కొలువులోనే నాకు సేవ చేసే భాగ్యం తగ్గడం అనేది నేను ఊహించలేదు.

స్వామి వారి సన్నిధిలో ఉండే ప్రశాంతత నాకు ఎక్కడికి పోయినా దొరకదు. ఇక్కడ ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మికం ఒకటే కాదు. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తారు. అందులో భాగంగా సన్నిధి గొల్ల, వేకువజామున స్వామి వారికి జోల పాట.. లాలి పాట.. వినిపించే అన్నమయ్య వంశీకులు.. అనాధ స్వరంతో నివేదించే సందర్భాలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ కార్యక్రమాలు వారికి వారి కుటుంబాలకు జన్మజన్మలకు ఆచారం కొనసాగించే విధంగానే ఉండాలి. అది తిరుమల వెంకటేశ్వర స్వామి వారు వారికి ప్రసాదించిన వరం. భాగ్యం. కొన్ని ఏళ్ల కింద కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాటన్నిటిని ఆ స్వామివారి పరిష్కరించారు. అధికారులు సహకరించారు ఈ ఆచారాలు వ్యవహారాలు కొనసాగించాలని నా అభిప్రాయమని నారాయణ తన మనసులోని భావాలను పంచుకున్నారు.

Read More
Next Story