విశాఖ శారదా పీఠానికి కళ తగ్గింది. ఒక నాడున్నరాజకీయ సందడి ఇప్పుడు కనుమరుగైంది. ఇచ్చిన భూములను సైతం ఒక్కోటిగా వెనక్కి తీసుకుంటున్నారు.


శక్తులు, మహిమలు ఉన్నాయని చెప్పుకునే స్వామీజీలకూ ఒక్కోసారి కాలం కలిసి రాదంటే ఇదేనేమో. సరిగ్గా 24 నెలల కిందట కూడా ఓ వెలుగు వెలిగిన ఓ విశాఖ స్వామి ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఓ రేంజ్‌లో ఉండే వారిని తప్ప మరెవ్వర్నీ కన్నెత్తి చూడని ఆ స్వామి ఇప్పుడు నేనెవ్వరికీ దర్శనం ఇవ్వనంటూ మొహం చాటేస్తున్నారు. ఆయనే విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి. ఒక చేత్తో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మరో చేత్తో ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శాసించిన ఈ స్వామీజీ ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో నానా ఇక్కట్లు పడుతున్నారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్టు వైసీపీ హయాంలో పీఠానికి ఇచ్చిన భూములను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెనక్కి లాగేసుకుంటోంది. దీంతో ఆయన కక్కలేక మింగలేక తన శక్తుల్ని చూపలేక సతమతం అవుతున్నారు.

ఇదీ స్వామిజీ ప్రస్థానం...
స్వరూపానందేంద్ర సరస్వతి 1964, నవంబరు 18న ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా, రణస్థలం గ్రామంలో జన్మించారు. 1997లో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠాన్ని స్థాపించారు. ఆయనకు ‘ఆర్ష విద్యా వాచస్పతి విశ్వగురు పురస్కార్‌–2021‘ లాంటి గౌరవాలు లభించాయి.
సాధారణంగా స్వామీజీలు ఏ ఒక్క పార్టీ నాయకులకో పరిమితం కారు. స్వామీజీలపై ఉన్న నమ్మకంతో వారి వద్దకు పార్టీలకతీతంగా వెళ్తుంటారు. కానీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రం అలా కాదు.. వైసీపీ స్వామీజీగానే ముద్ర వేసుకున్నారు. పీఠం ఏర్పడిన చాన్నాళ్లు కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి స్వరూపానందుడితో సన్నిహితంగాను, భక్తుడిగానూ మెలిగేవారు. ఆయనతో పూజలు, పునస్కారాలు చేయించేవారు. అప్పుడప్పుడు విశాఖ ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లేవారు. 2014 తర్వాత అప్పటి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వరూపానందేంద్ర సరస్వతిపై నమ్మకం పెంచుకుని శారదా పీఠానికి రావడం ఆ తర్వాత ఆయన తెలంగాణకు సీఎం కావడం జరిగాయి. దీంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ లానే ఈ పీఠం బాట పట్టారు. కొన్నాళ్లకు ఆయన కూడా ఆంధ్ర సీఎం అయిపోయారు. దీంతో ముఖ్యమంత్రులను చేసే పవర్‌ ఈ స్వామీజీకి ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. ఇలా తరచూ అటు కేసీఆర్, ఇటు వైఎస్‌ జగన్‌లు విశాఖ శారదా పీఠానికి రావడం, స్వామీజీ ఆశీర్వాదాలు అందుకోవడంతో స్వరూపానందుడు పవర్‌ఫుల్‌ స్వామీజీ అయిపోయారు. ఇంకేముంది? సాక్షాత్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే స్వామీజీ దగ్గరకొచ్చి సాగిలపడుతుండడంతో వైసీపీ, టీఆర్‌ ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చీఫ్‌ సెక్రటరీలు, డీజీపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఈ స్వామీజీ ఆశీర్వాదానికి క్యూ కట్టేవారు. ఇక కింది స్థాయి అధికారుల సంగతి సరేసరి! ఇలా వైసీపీ ప్రభుత్వం హయాంలో శారదా పీఠం వార్షికోత్సవాలకు జగన్‌ హాజరవడంతో కనులపండువగా జరిగేది. క్రమంగా స్వరూపానందుడ కేవలం వైసీపీ వారికే స్వామీజీగా మారిపోయారన్న భావనతో టీడీపీ, జనసేన సహా ఇతర పార్టీల నేతలు ఆయనకు దూరంగా ఉన్నారు.
వైసీపీ పాలనలో వైభోగం..
2019 నుంచి 2024 వరకు సాగిన వైసీపీ పాలనలో స్వరూపానందేంద్ర సరస్వతి వైభోగమే జరిగింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌తో నేరుగా ఆయనకు సాన్నిహిత్యం ఉండడంతో వైసీపీ మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులు ఎందరో తమ స్థాయిని మరిచి స్వామీజీ ప్రాపకం కోసం ప్రాకులాడేవారు. జగన్‌కు ఈ స్వామీజీ ఎంత చెబితే అంతే! అనే ప్రచారం ఉండేది. ఇలా నిత్యం జనంకంటే రాజకీయ నేతలు, అధికారులతోనూ క్షణం తీరిక లేకుండా స్వామీజీ గడిపేవారు. ఆయనకు 2+2 సెక్యూరిటీతో భద్రత కల్పించారు. శారదా పీఠం వద్ద ఒక ఔట్‌ పోస్టును కూడా ఏర్పాటు చేశారు. ఒక ఎస్‌ఐ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షించేవారు. ఇక స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శారదా పీఠం నుంచి విశాఖ విమానాశ్రయం వరకు ఏకంగా అత్యంత అరుదైన గ్రీన్‌ ఛానల్‌నే ఏర్పాటు చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు.
వైఎస్‌ జగన్‌ దిగిపోయాక..
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక స్వరూపానందేంద్ర సరస్వతికి గడ్డు కాలం దాపురించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ శారదా పీఠానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాల భూమిని కేటాయించారు. ఎకరం రూ.కోట్ల విలువ చేసే ఆ భూమిని కేవలం రూ.15 లక్షల నామమాత్రపు ధరకే కట్టబెట్టారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపి ఆ కేటాయింపులను రద్దు చేసింది. అలాగే గతంలో తిరుమలలో శారదా పీఠం మఠానికి కేటాయించిన స్థలానికి ఆనుకుని ఉన్న జాగాను ఆక్రమించి అక్కడ కూడా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టడంతో పెనాల్టీ సొమ్ము చెల్లించి క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం అనుమతించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై టీటీడీ హైకోర్టునాశ్రయించింది. దీనిపై తాజాగా ఆక్రమిత భవనాన్ని టీటీడీకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 15 రోజుల్లో ఆ భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలంటూ టీటీడీ శారదా పీఠానికి నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు విశాఖ చినముషిడివాడలో ఉన్న శారదా పీఠంలోనూ ప్రభుత్వ భూమి ఆక్రమించి కట్టడాలు నిర్మించారంటూ ఫిర్యాదులున్నాయి. దీనిపై పీఠం కోర్టునాశ్రయించింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక స్వరూపానందేంద్ర సరస్వతికి, శారదా పీఠానికి చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి.
ఉత్తరాదిలోనే ఎక్కువ సమయం..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం పతనంతో స్వరూపానందకు అన్నీ ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలకుడని, ఆయన, పవన్‌ కల్యాణ్‌లు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వారికి తన ఆశీస్సులుంటాయని మీడియా సమావేశం పెట్టి మరీ స్వరూపానంద ప్రకటించారు. ఆ తర్వాత చాతుర్మాస దీక్ష కోసమని ఉత్తరాదికి వెళ్లిపోయారు. అప్పట్నుంచి శారదా పీఠానికి అత్యంత అరుదుగా వస్తున్నారు. ఎక్కువ సమయం ఉత్తరాదిలోనే గడుపుతున్నారు. చిన్న స్వామీగా పిలువబడే ఉత్తరాధికారి స్వాత్మానంద పీఠం వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఏటా తన పుట్టిన రోజును ఎప్పుడూ శారదా పీఠంలో అట్టహాసంగా జరుపుకునే స్వరూపానంద.. ఈసారి కాశీలో జరుపుకున్నారు. వైసీపీ హయాంలో ఆయన విశాఖ వచ్చినా, ఎక్కడికైనా వెళ్లినా చాలా హడావుడే కనిపించేది. కానీ ఇప్పుడు ఆయన ఎప్పడు వస్తున్నారో, ఎవరికీ తెలియడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఆయన పరిస్థితిని చూసి గతంలో ఆయన దర్శనం కోసం పడిగాపులు పడిన మహామహులెవరూ ఇప్పుడు పీఠం ఛాయలకు వెళ్లడం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యం వీవీఐపీల రాకపోకలతో పోలీసు వాహనాల కుయ్‌.. కుయ్‌ సైరన్లు వినిపించడం లేదు. ప్రస్తుతం ఈ స్వామీజీ పరిస్థితిని, నాడు ఆయన హవాను చూసిన వారు ఔరా! ఏమి? కాల మహిమ! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. స్వామీజీలుగా చెప్పుకునే వారు రాజకీయాలకతీతంగా ఉండాలే తప్ప ఒక పార్టీకి చెందిన స్వామీజీగా ముద్ర వేయించుకుంటే ఇలాంటి పరిస్థితే వస్తుందని చర్చించుకుంటున్నారు.
చంద్రబాబుకు ఆయనకు విభేదాలేమిటి?
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్వరూపానందేంద్ర సరస్వతికి విభేదాలేమిటన్న దానిపై తలోరకంగా చెప్పుకుంటున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి అభిప్రాయ భేదాలున్నాయని చెబుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జయేంద్ర సరస్వతినే తప్ప స్వరూపానందను గుర్తించలేదని, అందువల్ల స్వరూపానందపై చంద్రబాబుకు సానుకూలత లేదని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా పొలిటికల్‌ స్వామి అయినంతగా మరెవరూ లేరు.
కాంగ్రెస్‌కు చంద్రస్వామిలా.. వైసీపీకి స్వరూపానందః బొలిశెట్టి
కాంగ్రెస్‌కు వివాదాస్పద తాంత్రిక చంద్రస్వామి ఎలాగో.. వైసీపీకి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి అలాగే. శారదా పీఠం రికగ్నైజ్డ్‌ పీఠం కాదు. దీనిని ఏ ధార్మిక పీఠమూ గుర్తించలేదు. హిందూ మత పెద్దలు ఎవరూ ఈయనను సమావేశాలకు ఆహ్వానించరు.
తొలినాళ్లలో కాంగ్రెస్‌ నేత టి సుబ్బరామిరెడ్డి పెంచి పోషించారు. ఆ తర్వాత వైసీపీకి రాజకీయ పీఠంలా మారింది.. శారదా పీఠంపై భూ ఆక్రమణల ఫిర్యాదులున్నాయి. 2018లో రూ.కోటి డిపాజిట్లు లేని ఈ పీఠానికి 2023కి రూ.44 కోట్ల డిపాజిట్లు పెరిగాయి. ఇంకా విపరీతమైన ఆస్తులు కొనడం, బిల్డింగులు కట్టారు. వైసీపీ హయాంలో తిరుమల గోగర్భం వద్ద స్థలాన్ని ఆక్రమించుకుని భవనం కట్టారు. ప్రజలు ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. శారదా పీఠానికి అడ్డగోలుగా కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, తిరుమలలో ఆక్రమిత భవనాన్ని స్వాధీనానికి నోటీసులు జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. వీటికి బాధ్యులైన అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలి. ప్రజలూ చూస్తూ ఊరుకోకూడదు. అలా అయితేనే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు అని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
పీఠం భూముల రద్దు సరైనదే.. ప్రొఫెసర్‌ చలం
విశాఖ శారదా పీఠానికి భీమిలి మండలం కొత్తవలసలో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూముల కేటాయింపును కూటమి ప్రభుత్వం రద్దు చేయడం, తిరుమలలో టీటీడీ స్థలాన్ని ఆక్రమించి కట్టిన భవంతిని స్వాధీనానికి నోటీసులు జారీ చేయడం ఆహ్వానించదగ్గదే.
ఇంకా రాష్ట్రంలో హిందూ, క్రై స్తవ, ముస్లిం పెద్దలు/ స్వామీజీల అక్రమ చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని దళిత, బలహీన వర్గాల వారికి, పరిశ్రమలు, విద్యా సంస్థల ఏర్పాటుకు కేటాయించాలి. అప్పడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Next Story