గుజరాత్ రోల్ మోడల్‌గానే ఆంధ్ర అభివృద్ధి: టీజీ భరత్
x

గుజరాత్ రోల్ మోడల్‌గానే ఆంధ్ర అభివృద్ధి: టీజీ భరత్

గుజరాత్‌ను రోల్‌మోడల్‌గా భావించి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు గడిచిపోయాయి. కానీ విభజన హామీల్లో చెప్పిన ప్రత్యేక హోదా ఇప్పటికి కూడా ఆంధ్రకు అందని ద్రాక్ష పండులానే ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా రావడం లేదు. 2014లో గెలిచిన టీడీపీ, ఆ తర్వాత 2019లో అధికారాన్ని సొంతం చేసుకున్న వైసీపీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించడంలో ఎటువంటి పురోగతి సాధించలేదు. ఇప్పుడు టీడీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దానికి తోడు కేంద్రంలో కీలకంగా కూమా మారింది. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయొచ్చని, ఇక ప్రత్యేక హోదా వచ్చేస్తుందని చాలా మంది భావించారు. కానీ అది కూడా జరగలేదు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించి టీజీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోల్డ్ స్టోరేజ్‌లో ఉందన్నారు.

ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం

‘‘ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక విజ్ఞప్తి చేయనున్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా గుజరాత్ తరహాలో ఓ గిప్ట్ సిటీని రాష్ట్రంలో నిర్మించాలని సీఎంను కోరనున్నాను. ప్రత్యేక హోదాతో కొన్ని బెనిఫిట్లు ఉన్నా గిఫ్ట్ సిటీతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుంది’’ అని వివరించారు. అనంతరం రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. అన్ని రకాల పరిశ్రమలకు బెస్ట్ ఆప్షన్‌గా ఏపీని ఉంచుతామని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పరిశ్రలు వెళ్లిపోవడమే తప్ప ఒక్కటి కూడా పరిశ్రమ రాలేదు అని దుయ్యబట్టారు.

గుజరాతే రోల్ మోడల్

‘‘పరిశ్రమ రంగం విషయంలో గుజరాత్‌ను రోల్ మోడల్‌గా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ను అంతకుమించి అనేలా అభివృద్ధి చేస్తాం. వైసీపీ సర్కార్ సమయంలో మాదిరిగా మాయాబజార్.. టీడీపీ ప్రభుత్వంలో నడవదు. ఎటువంటి రాయితీలు అందక పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రలో పెట్టుబడులు పెట్టాలంటేనే వెనకడుగు వేశారు. కానీ ఈసారి అలా కాదు. పరిశ్రమలకు అందాల్సిన రాయితీలపై ప్రత్యేక దృష్టి పెడతాం. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో అద్భుతాలు చేయాలన్న విజన్‌తో ఉన్నాం. అలానే ముందుకు సాగుతాం’’ అని వివరించారు.

పెట్టుబడులు పేపర్లకే పరిమితం

అనంతరం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల్లో పైసా కూడా రాలేదని, మొత్తం పక్కకు వెళ్లిపోయాయని విమర్శించారు టీజీ భరత్. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌ వస్తున్నాయన్న పెట్టుబడులు అన్నీ కూడా కేవలం ప్రకటనలకు, పేపర్లకే పరిమితం అయ్యాయి కానీ రాష్ట్రానికి చేరిన పెట్టబడులు ఏమీ లేవని దుయ్యబట్టారు. అలా ఎందుకు జరిగిందే తెలియలేదని, దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెడతామని వివరించారు. రాష్ట్రానికి ఐదేళ్ల పాటు పెట్టబడులు రాకుండా సర్కార్ ఏం చేసిందో కూడా ప్రశ్నిస్తామని, దీనిపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుంటామని, అవసరం అయితే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పెట్టుబడులపై దర్యాప్తు చేయిస్తామని ఆయన వివరించారు.

Read More
Next Story