ఈ ఐదేళ్లల్లో జగన్‌ కేసులు ఏమవుతాయో అనేది సర్వత్ర చర్చగా మారింది. ప్రతి రోజూ కేసును విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించడం ఈ చర్చకు దారి తీసింది.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితం నిత్యం సవాళ్లతో అడుగులు వేస్తోంది. తండ్రి వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా గొప్ప వ్యాపార వేత్తగా, పార్లమెంటేరియన్‌గా పలువురు దృష్టిని జగన్‌ ఆకర్షించారు. వైఎస్‌ఆర్‌ దుర్మరణం జగన్‌ జీవితంలో పెను మార్పులకు కారణమైంది. తమ మాట వినకుండా ఓదార్పు యాత్రను ప్రారంభించి, కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో కొరకగాని కొయ్యగా తయారైన జగన్‌ను కట్టడి చేసేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు వేయించింది. మనీ ల్యాండరింగ్, క్విడ్‌ ప్రోకో కింద కేసులు నమోదయ్యాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వరుసగా విచారణలు చేపట్టి 16 నెలల కాలం జైలు జీవితాన్ని గడిపేలా ఈ కేసులు చేశాయి. అయినా తన పోరాటంలో అడుగులు ముందుకేస్తూ ముఖ్యమంత్రి కాగలిగారు జగన్‌. సమైక్యాంధ్రప్రదేశ్‌ కోసం పార్లమెంట్‌లో సైతం నినదించి లక్ష్యానికి చేరువ కాలేక పోయారు. విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీన పడటం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అవకాశాలు లేకుండా పోవడంతో ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యారు. అయినా కేసులు నిత్యం జగన్‌ మనసును వేధిస్తూనే ఉన్నాయి. బెయిల్‌ పై ఉన్నప్పటికీ మొదట వారానికి ఒక రోజు విచారణకు హాజరు కావాల్సిందేనని షరతులు విధించింది. కొంత కాలం తరువాత ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున మరి కాస్త సడలింపులిస్తూ, భద్రతా కారణాల దృష్ట్యా వారం వారం కోర్టుకు రావాలనే అంశం పక్కకు పోయింది.

కాంగ్రెస్‌ తర్వాత కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ కూటమి జగన్‌ కేసులలో స్పీడును తగ్గించి కాస్త ఊరటను కల్పించింది. 2019 ఎన్నికల్లో జగన్‌ స్వతంత్రంగానే పోటీ చేసి ఏపీలో అత్యధిక సీట్లు సాధించ గలిగారు. ఆయనపై ఉన్న కేసులు, విచారణలు, పలురకాల ఒత్తిడులు అన్నీ జగన్‌ను అడుగులు ముందుకే పడనీకుండా అడ్డుపడ్డాయి. ప్రధాని మోదీ జగన్‌ను గ్రిప్‌లో పెట్టుకోగలిగారు. ప్రత్యేక హోదా, ఇంకా రాష్ట్రానికి రావలసిన పలు అంశాలపై నోరెత్తితే కేసుల వ్యవహారంపై ఇబ్బందులు తప్పవనుకున్న జగన్, తన ఆలోచనల దృక్పథాన్ని మార్చుకున్నారు. దీంతో గత ఐదేళ్లు విచారణలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే మొదటి నుంచి జగన్‌కు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న రఘురామకృష్ణరాజు జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పార్లమెంట్‌ సభ్యుని హోదాలో పలు మార్లు పిటీషన్‌లు దాఖలు చేశారు. తర్వాత ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి గెలుపొంది ఏపీ డిప్యూటీ స్పీకర్‌ అయ్యారు. జగన్‌ బెయిల్‌ రద్దు వ్యవహారాన్ని మాత్రం వదిలి పెట్టలేదు. అలాగే జగన్‌ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి, హింసించారని నాటి ప్రభుత్వం తనను చంపేందుకు కూడా ప్లాన్‌ చేసిందని, కూటమి నూతన ప్రభుత్వంలో పోలీసు కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు. ఈ కేసులో ఐపీఎస్‌లు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక వైపు బెయిల్‌ రద్దు కేసు, మరో వైపు రఘురామను వేదించినట్లు నమోదైన కేసులు కోర్టులో ఉన్నాయి. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని వేసిన పిటీషన్‌ సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం, ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోరడం సమంజసం కాదని కొట్టేసింది.
రోజూ విచారణ జరుగుతుందా?
జగన్‌ కేసును ప్రతి రోజు విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. మిగిలిన కేసులు ఉన్నప్పటికీ సమయం తీసుకొని జగన్‌ కేసును కూడా విచారించి, త్వరగా తీర్పును వెలువరించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు. గత ఐదేళ్లు పెద్దగా పట్టించుకోని జగన్‌ కేసును రాష్ట్రంలోను కేంద్రంలోను కూటమి అధికారంలో ఉండటంతో కేసుల వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎలాగైనా జగన్‌ను జైలుకు పంపాలని ఆలోచనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌ జైలులో ఉంటే.. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీడీపీ పార్టీ కార్యకలాపాలకు ఇబ్బందల్లేకుండా అడుగులు వేసేందుకు అవకాశం లేకుండా ఉంటుందని ఆలోచనలు చేస్తోంది. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర పెద్దల అభ్యర్థనల మేరకు జగన్‌ కేసు విచారణపై కాస్త కదలికలను తీసుకొచ్చింది. ఒక వైపు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ముఖ్యమైన నాయకులు రాజీనామాలు చేసి వెళ్లిపోవడం, మరో వైపు కూటమి, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం కూడా జగన్‌ కాళ్లకు బంధాలు వేసినట్టు అయింది. అటు కేసులు, ఇటు పార్టీ వ్యవహారాల్లో జగన్‌కు దిక్కు తోచని స్థితిని తీసుకొచ్చి రాజకీయంగా తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ఎన్ని రకాలుగా వ్యూహాలు రూపొందించాలో అన్ని రకాలుగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ మేధావులు చెబుతున్న మాట.
2029లో జగన్, కూటమితో కలిసి పోటీ చేసేందుకు ససేమిరా అన్నారు. 2024లో తెలుగుదేశం, జనసేనలు, కూటమితో కలిసి పోటీ చేయడంతో బీజేపీ బలం ఏపీలో మరింత పెరిగింది. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఈ స్థాయిలో బీజేపీ ప్రజాప్రతినిధులు ఉండటం ఇదే మొదటి సారి. అందులోనూ ఒకరు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోగలిగారు. ఒక వైపు బీజేపీ మరో వైపు జనసేన, ఇంకో వైపు టీడీపీలు జగన్‌ కేసు విషయంలో దాడి చేస్తున్నాయి. ఆ దాడులను తిప్పి కొట్టేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్థులైన నాయకులను తయారు చేసుకోలేక పోయింది. పైగా పార్టీ కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శే పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో బీజేపీ రాజకీయ వ్యూహం ఒక్కొక్కటిగా సక్సెస్‌ అవుతున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జగన్‌ కేసు విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన మాటలు జగన్‌కు కానీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కానీ ఊరటను కలిగించే ధోరణిలో కూడా లేదు. కేసును ఏపీ హైకోర్టుకు మార్చాలని రఘురామకృష్ణ వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ హై కోర్టులోనే కేసుంటే జగన్‌ను కదలకుండా బంధించడం ఈజీ అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. జగన్‌ కేసుల విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను సమర్థించే అవకాశం లేదు. కూటమి కూడా దీనినే అవకాశంగా తీసుకొని అక్కడే కేసులను విచారిస్తే సరిపోతుందని భావించినట్లు కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి సాక్షులను విచారించి, కేసును తేల్చేయడం పెద్ద కష్టమైన పని కాదు. మనీ ల్యాండరింగ్‌ కేసు విషయంలో ఈడీ నమోదు చేసిన కేసులు రుజువైతే పనిష్‌మెంట్‌ ఉంటుంది. క్విట్‌ప్రోకో కింద సీబీఐ పెట్టిన కేసులు రుజువైతే పనిష్‌మెంట్‌ తప్పదు. కానీ ఈ రెండు కేసుల్లో తగిన సాక్ష్యాలు, ఆధారాలు లేవనే వాదనలు కూడా కొంత మంది న్యాయవాదుల్లో ఉంది. ఇవన్నీ కావాలనే పెట్టిన కేసులు తప్ప, మా క్లైంట్‌ ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యాపారాలు చేశారని జగన్‌ తరపున లాయర్లు వాదిస్తున్నారు.
పెద్దల కేసులు వగదెగాలంటే సమయం పట్టొచ్చు..
కోర్టుల్లో ప్రస్తుతం ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదేళ్లల్లో బెయిల్‌ రాకుండా విచారణ జరక్కుండా ఉన్న కేసులు అలాగే కొనసాగుతున్నాయి. త్వరగా పరిష్కరించాలంటే సాధ్యమయ్యే పని కాదు. పైగా ఈ కేసులు రాజకీయ పెద్దలకు సంబంధించినవి. న్యాయవాదులు ఎక్కువ మంది ఉంటారు. ఏదో ఒక పిటీషన్, ఏదో ఒక సందర్భంలో కోర్టులో వేస్తూనే ఉంటారని అని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విచారణను ప్రతి రోజూ విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు తెలంగాణ సీబీఐ కోర్టును ఆదేశించింది. సీబీఐ ప్రత్యేక కోర్టే అయినప్పటికీ జగన్‌పై నమోదైన కేసుల్లో క్విడ్‌ప్రోకో, మనీల్యాండరింగ్‌ వంటివి ఉన్నాయి. కొన్ని కేసులు అధికారంలో ఉన్నప్పుడు స్పీడ్‌గా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అధికారంలో లేనప్పుడు న్యాయ విచారణలో వేగం తగ్గుతుంది. అందువల్ల ఈ కేసుల్లో వేగం పుంజుకుంటుందా? పుంజుకోదా? అనేది స్పష్టంగా చెప్పలేమన్నారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించినందున ఇక బెయిల్‌ ప్రస్తావన ఇప్పట్లో ఉండే అవకాశం లేదని శ్రీనివాసులు పేర్కొన్నారు. కేసుల విషయానికి వస్తే.. సుప్రీం కోర్టు ఒక సమయం ఇచ్చి ఆ సమయంలోపు పరిష్కారం కావాలని కండిషన్లు పెడితే తప్ప త్వరగా పరిష్కరించాలని చెబితే వెను వెంటనే ముందుకు సాగే అవకాశాలు ఉంటాయని చెప్పలేమన్నారు. ఇందులో ప్రధానంగా ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ జోక్యం చేసుకోవాలి. ఇందు కోసం ప్రత్యేక ‘లా’లు ఉన్నాయి. ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. అన్ని రకాల ప్రొవిజన్సు ఉంటాయి. చేయాలనుకుంటే స్పీడ్‌ పెంచొచ్చు. లేదనుకుంటే ఆగొచ్చు. అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్‌ సంస్థలు కేసు ఫైలింగ్‌ చేసే సందర్భాల్లో లోపాలు ఉంటాయని, ఆ లోపాలు బయటపడితే టెక్నికల్‌ సమస్యల పేరుతో కేసులు వీగిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఇవన్నీ ప్రధానంగా రాజకీయ ప్రేరేపిత కేసులుగానే ప్రజలు భావిస్తున్నందున ఎప్పటికి పరిష్కారం అవుతాయో చెప్పడం కష్టమని శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.
మరో వైపు జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను న్యాయస్థానం రద్దు చేస్తుందా? కొనసాగిస్తుందా? అనే చర్చ దేశ రాజకీయాల్లో హీట్‌ పెంచుతోంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని జనసేన, టీడీపీలు జగన్‌ బెయిల్‌ రద్దుకు లోలోపల కుట్రలు చేస్తున్నాయనే ఆరోపణలు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వినిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్‌ రఘురామ వేసిన పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చినందున జగన్‌ బెయిల్‌ రద్దు అనే అంశం మరి కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని, విచారణ ఊపందుకోవచ్చేమో కానీ బెయిల్‌ రద్వు వ్యవహారంలో తొందరపడితే ప్రభుత్వానికి ముప్పు వస్తుందనే భయంలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది.
Next Story